Sunday, November 25, 2012

పాఠం పూర్తయ్యాకా....

ఒకోసారి 
అలసిన మనసుకి ఆలంబనవై
మరోసారి 
అమరిన అనుబంధాలకు విఘాతమై
యాభై ఎనిమిదో ఏట 
ఆహ్వానించని అతిధిలా వస్తావు 
ఎపుడొస్తావో తెలుసు అయినా
మరికొంత ఆలశ్యమవాలని...

హాజరు పుస్తకం లో నా చివరి సంతకం 
వేల ప్రశ్నలని సంధిస్తుంది 
రెక్కలుడిగిన నాకు 
పిల్లలు కొత్తరిక్కలు తొడిగి 
తమతో పాటు ఎగరమంటారు
సహకరించని మనసు 
ససేమిరా అంటుంది 

పదవీ విరమణ అంటే 
జీవితపు చరమాంకమనీ
విశ్రాంత యానమని అంటారు 
కానీ నాకు మాత్రం 
జీవితం లో చేయాల్సిన 
నేక పనుల్లో ఒక పని పూర్తయి 
మరో పనిలోకి వెల్తున్నట్లే
ఒక పాఠం పూర్తయ్యాకా
మరో పాఠం నేర్చుకోవడమే..
 
ఇపుడు నాకోసం నేను 
నా సృష్టి కర్తతో 
సంభాషించుకునే అవకాశం 
అతని సన్నిధిలో సేదతీర్చుకునే భాగ్యం 
పదవీ విరమణ ఎవరికేమయినా
నాకు మాత్రం ఓ వరం ...

1 comment: