Wednesday, May 26, 2010

పెళ్ళిలో జీలకర్ర, బెల్లం ఎందుకు ?


వివాహ ప్రక్రియ లోని ముఖ్యమయిన వాటికి వివరణ
పెళ్ళిపుస్తకం..14 వ భాగం.

కాశీకి పోవుట:
బ్రహ్మచారి చదువు ముగిసిన పిమ్మట గురువు ఆజ్ఞగొని యాత్రకు మరలుట (సమావర్తనము) ఒక ఆచారముగా ఉండేది (ఇప్పటికీ కొన్ని వర్ణాలలో ఈ తంతు ను చూడగలం). ఆ యాత్ర ఒక సమ్వత్సరం పరిమితి ఉండేది. ఆ దీక్షలో గురువు శిష్యునకు క్షురకర్మ(గుండు గీయించి) చేయించి, నూతన వస్త్ర ధారణ గావించి తర్వాత గురుదక్షిణ, దానితో ఆవును, దూడను, ఎద్దును స్వీకరించి సమావర్తనము చేయిస్తారు. ఈ సమయమున గొడుగు, చెప్పులు మొదలగు సామాగ్రిని సంసిధ్ధము చేసికొని, గురువునకు ఈ సామాన్లని దానము చేసి, బ్రాహ్మణులను పూజించి ప్రతి లోపమునకు ప్రాయశ్చిత్తముగా వారి అనుగ్రహమును పొంది బయలుదేరవలెను. ఈ తంతునే కాశీకి పోవుట అని క్లుప్తంగా అంటారు. పాద యాత్ర చేస్తున్న స్నాతకుని చేరి కన్యాదాత తన పుత్రికను దానము చేయుదననియు, అగ్నిసాక్షిగా పాణిగ్రహణము చేయుమనియు కోరును. అపుడు స్నాతకుడు కాశీ ప్రయాణము విరమించుకొని కన్యను వివాహ మాడతాడు.

మధుపర్కము :

వరుడు అలంకృతుడై మంగళగీతికలతో, వేదమంత్రములతో చక్కని వాహనమున పెండ్లివారి యింటికి బయలుదేరును. వీరిని ఆహ్వానించి కన్యాదాత మధుపర్కము నొసగును. వరుడు మత్రపూతకముగా మధుపర్కమును స్వీకరించును. మధుపర్కమనగా తీయని పానీయం. మధువు (తేనె)తో పాలు మొదలగు వాటిని కలిపి తయారు చేయుదురు. ఇది సేవించిన తర్వాత వరుని వస్త్రాదులతో సన్మానిస్తారు. ఇది తెలియక మధుపర్కములు అనగా పెళ్ళిలో కట్టుకొను వస్త్రములు అను పొరపాటు అభిప్రాయం నేడు వ్యాపించింది. ఇంకా విచిత్రమేమంటే " జరీ మధుపర్కములు " అను పద ప్రయోగాలు కూడా అజ్ఞానము వలన తయారయినవి.

గౌరీ పూజ లేదా లక్ష్మీపూజ :

వధువు ఈ పూజ చేయుట వలను వధువునకు మాంగల్యాభివృధ్ధి కలుగును.

కన్యాదాత వరుని పూజించుట :

కన్యాదాత వరుని పాదములు కడిగి పూజించును. నిజానికి వరుడు కన్యాదాత కన్నా వయసులో చిన్నవాడు. వయసులో పెద్దవాడు తనకన్న చిన్నవాని పాదములు తాకుట, కడుగుట సామాన్యముగా లోకాచారము కాదుగాని, ఇది వివాహములో ఆచారము. దీనికి కారణము మంత్రములలో చెప్పబడింది. ఇక్కడ వరుడు లక్ష్మీనారాయణ స్వరూపుడు. ఇతడిని పూజించి, కాళ్ళని కడిగి, జలధారతో కన్యను దానమిచ్చుట (కన్య ధారపోయుట) మహాభాగ్యముగా భావించబడును.

జీలకర్ర, బెల్లము :

శుభముహూర్త సమయమున వధూవరుల మధ్య తెరతొలగిస్తారు. ఒకరినొకరు చూసుకున్న తరువాత జీలకర్ర , బెల్లము కలిపిన ముద్దను ఒకరి తలపై ఒకరు నిలిపి చేతితో తాకుతారు. పూర్వకాలములో పదార్ధ విజ్ఞాన శాస్త్రవేత్తలు (Material Scientists) జీలకర్ర బెల్లము కలిపి నూరినా, నలిపినా ధన సంజ్ఞక విద్యుత్తు (Positive electric charge) ఉత్పత్తి అగునని వర్ణించారు. జీలకర్ర బెల్లముతో ఘర్షణ చేస్తే అలాగే జరుగునని నిరూపించ బడింది. వేద కల్పము తెలిసిన పెద్దలు దీనిని గ్రహించి వధూవరుల పరస్పర జీవశక్తుల ఆకర్షణకు తోడ్పడునట్లుగా జీలకర్ర బెల్లము తాకుట ఒక ఆచారముగా చేసారు. దీనివలన దృష్టి కలుపుట, మనస్సు సంకల్పించుట సంభవించునని నమ్మకము.

అరుంధతి దర్శనము :

వివాహ ప్రక్రియలో వధూవరులను అరుంధతీ దర్శనం చేయిస్తారు. అరుంధతి అనగా ఎటువంటి పరిస్థితిలోనూ ధర్మమునకు హాని కలిగింపనిది అని అర్ధం. నూతన దంపతులు కామమునకే ప్రాధాన్యమీయకుండా ధర్మమునకే ప్రాధాన్యమిచ్చి లోకములో ఆదర్శ దంపతులుగా మెలుగుటకు కావలసిన దీవెనలు అరుంధతీ వశిష్టుల దర్శనము
వలన పొందింపచేయటమే మన పెద్దల ఉద్దేశ్యము.
కొసమెరుపు:
ఒక యువతి త్రాచుపాముతో ప్రేమలో పడి పెళ్ళాడిన ఉదంతం 07.06.2006 న రెండువేల మంది సమక్షమ్లో జరిగింది. ఒరిస్సా రాజధానికి దగ్గరలొ అటాలా పల్లెకు చెందిన బింబాలా దాస్(30) అనేయువతి తాను తాచుపాముని ప్రేమిచానని పెళ్ళాడతానని ప్రకటించింది. మూఢనమ్మకాలకు నిలయమైన ఆ గ్రామ ప్రజలు పాము పుట్ట పక్కనే వివాహ వేదిక చేసి
మంత్రోఛ్ఛారణతో తంతు నిర్వహించారు. వరుడు (పాము) పాపం ఎంతకీ పుట్టలోంచి రాకపోవడంతో పాము లోహ ప్రతిమను పెట్టి తంతు కానిచ్చేసారు.

Saturday, May 22, 2010

పెళ్ళి పుస్తకం మళ్ళీ తెరవరూ...

స్కూటీ డిక్కీలో మర్చిపోయిన పుస్తకాలు తెచ్చుకుందామని సెల్లార్ లోకి వెళ్ళాను. ఐదవ ఫ్లోర్ పార్వతి గారు వారి మరిది పెళ్ళి విషయాలు చెపుతుంటే అర గంట ఇట్టే గడిచిపోయింది. స్కూలుం టే అసలు ఖాళీ ఉండదు. ఎవరయినా మాట్లాడితే ముక్తసరిగా మాట్లాడి వచ్చేసిదాన్ని. ఇపుడు సెలవులు కాబట్టి ఎవరయినా మాట్లాడితే కాసేపు వారితో గడిపి మరీ వస్తున్నాను. పిల్లలిద్దరూ మా ఆడపడుచు ఇంటికి వెళ్ళారు. ఇల్లు కొంచెం ప్రశాంతంగా ఉంది. తలుపు తాళం తీసి ఇంట్లో అడుగు పెట్టేసరికి సెల్ మోగుతూంది. గబగబా వెళ్ళి సెల్ అందుకున్నాను. సామంత్ నా స్టూడెంట్
సాయంత్రం తనూ ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ ఇంటికి వస్తారంట నేను ఇంట్లో ఉంటానా లేదా అని ఫోన్ చేసాడు. తప్పకుండా రమ్మని చెప్పాను.
సామంత్ చాలా మంచి స్టూడెంట్. కష్టపడి చదువుతాడు. స్కూల్ టాపర్ కూడా. ఒక్క చదువే కాదు. అన్ని పోటీలలోనూ టాపరే. వాళ్ళ ఫాదర్ రియల్ ఎస్టేట్ బిజినెస్. కోటీస్వరుల కుటుంబం. అయినా సామంత్ చాలా వినయంగా ఉంటాడు.
ఇంటర్ కం లో్ వాచ్ మేన్ కి ఫోన్ చేసి వాళ్ళొస్తే పైకి పంపమని చెప్పాను. సాయంత్రం ఐదున్నరయ్యేసరికి కాలింగ్ బెల్ మోగింది. వాళ్ళే వచ్చారనుకుని టి.వి. కట్టేసి తలుపు తెరచి చూస్తే పనిమనిషి నర్సమ్మ. తను పని చేస్తూంటే ఉల్లిపాయలు అవి కోసి వాళ్ళకి పకోడీలు వేద్దామని పిండి కలిపి ఉంచుకున్నాను. నర్సమ్మ వెళ్ళకుండానే సామంత్, ఖదీర్, వినయ్ వచ్చారు.
గుడ్ ఈవినింగ్ మేడం :
గుడ్ ఈవినింగ్ వెల్ కం..రండి కూర్చోండి. నిలబడే ఉన్నారు.
నో..నో ఫార్మాలిటీస్. ఇక్కడ మీరు స్టూడెంట్స్ కాదు.
చెప్పండి. ఏంచేస్తున్నారు. ఏమైనా సమ్మర్ కోర్సులకి అటెండవుతున్నారా ?
నో..మేడం. ఊరికెళ్ళాం మేడం.. సామంత్ అన్నాడు.
ఒ.కె. ఒన్ మినిట్..
కిచెన్ లోకి వెళ్ళి నర్సమ్మకి పకోడీలు వేయమని చెప్పి వచ్చి కూర్చున్నాను.
ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ . ముగ్గురూ మూడు మతాలకు చెందిన వారైనా చాలా క్లోజ్ గా ఉంటూ అన్ని పండగలూ సెలబ్రేట్ చేసుకుంటూంటారు.
ఊ. చెప్పండి రేపే కదా రిజల్ట్స్ .
ఔను మేడం టెంషన్ గా ఉంది వినయ్ అన్నాడు.
టెంషన్ దేనికి. మీరు బాగా వ్రాసారు. మార్కులు కూడా బాగా వస్తాయి.
ఏ కాలేజీలో జాయిన్ అవుదామనుకుంటున్నారు?
ఇంకా ఏమి డిసైడ్ చేసుకోలేదు మేడం. డాడీ రిజల్ట్సు వచ్చాకా చూద్దాం అన్నారు.. ఖదీర్ అన్నాడు.
గుడ్ డెసిషన్..
నర్సమ్మ పకోడీలు తెచ్చింది. తీసుకోండి.
ముగ్గురూ మొహమాట పడి పోతున్నారు.
ఇవన్నీ ఎందుకు మేడం. వినయ్
నో..చెప్పానుగా మీరిక్కడ స్టూడెంట్స్ కాదని..తీసుకోండి.
మీ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా?
అందరూ బాగున్నారు..మేడం. సామంత్ కి నా దగ్గర చనువెక్కువ. తనంటే నాకు అభిమానం కూడా.
మేడం మీరేమను కోనంటే ఒక చిన్న రిక్వెస్ట్ మేడం.
చెప్పు సామంత్..
ఏం లేదు మేడం. మీరీమధ్య మీ పెళ్ళి పుస్తకం ఎపిసోడ్స్ ఏమీ పెట్టలేదు.
మా పేరెంట్స్ కూడా నన్నడిగారు.
అదా..మరేమ్లేదు.. నీకు తెలుసుకదా..మీ అంకుల్ ఈ మధ్య చాలా బిజి అయిపోయారు.
ఎక్కువ టూర్స్ కి వెళ్ళాల్సి వస్తూంది.
ఇంటిపని, పిల్లల ఎగ్జాంస్, అంతేకాదు నీకుతెల్సు కదా ఇల్లు కట్టుకుంటున్నాం ..
ఆ పని కూడా నేనే చూసుకోవాల్సివస్తూంది.
వీటన్నిటితో కొంత వీలుపడక పోస్ట్ చేయలేకపోయాను. త్వరలో స్టార్ట్ చేస్తాను.
మేడం. మాక్రైస్తవ మతం లోని వివాహాన్నిగురించి కూడా రాస్తానన్నారు. వినయ్ అన్నాడు.
తప్పకుండా వినయ్...అంతేకాదు..ఖదీర్ మీ మతం లోని వివాహ ఆచారాలను కూడా రాయబోతున్నాను.
ధాంక్స్ మేడం. ఖదీర్ అన్నాడు.
అంతే మేడం ఇది అడుగుదామనే వచ్చాం. మీరు ఫీలయితే సారీ మేడం. సామంత్.
నో..నో మీరింత అభిమానంగా వచ్చినందుకు, నా బాధ్యత గుర్తుచేసినందుకు నేనే ధాంక్స్ చెప్పాలి.
ముగ్గురూ ధాంక్స్ చెప్పి వెళి పోయారు.
పెళ్ళి పుస్తకం మళ్ళీ తెరవరూ...అన్నట్టుగా వారి చూపులు నన్ను చుట్టుముట్టాయి.
నేను తరవాతి ఎపిసోడ్ గురించి ఆలోచనలో పడిపోయాను.