Sunday, April 10, 2022

పెళ్ళిలో జీలకర్ర, బెల్లం ఎందుకు ? పద్నాల్గవ భాగం

వివాహ ప్రక్రియ లోని ముఖ్యమయిన వాటికి వివరణ పెళ్ళిపుస్తకం..14 వ భాగం. కాశీకి పోవుట: బ్రహ్మచారి చదువు ముగిసిన పిమ్మట గురువు ఆజ్ఞగొని యాత్రకు మరలుట (సమావర్తనము) ఒక ఆచారముగా ఉండేది (ఇప్పటికీ కొన్ని వర్ణాలలో ఈ తంతు ను చూడగలం). ఆ యాత్ర ఒక సమ్వత్సరం పరిమితి ఉండేది. ఆ దీక్షలో గురువు శిష్యునకు క్షురకర్మ(గుండు గీయించి) చేయించి, నూతన వస్త్ర ధారణ గావించి తర్వాత గురుదక్షిణ, దానితో ఆవును, దూడను, ఎద్దును స్వీకరించి సమావర్తనము చేయిస్తారు. ఈ సమయమున గొడుగు, చెప్పులు మొదలగు సామాగ్రిని సంసిధ్ధము చేసికొని, గురువునకు ఈ సామాన్లని దానము చేసి, బ్రాహ్మణులను పూజించి ప్రతి లోపమునకు ప్రాయశ్చిత్తముగా వారి అనుగ్రహమును పొంది బయలుదేరవలెను. ఈ తంతునే కాశీకి పోవుట అని క్లుప్తంగా అంటారు. పాద యాత్ర చేస్తున్న స్నాతకుని చేరి కన్యాదాత తన పుత్రికను దానము చేయుదననియు, అగ్నిసాక్షిగా పాణిగ్రహణము చేయుమనియు కోరును. అపుడు స్నాతకుడు కాశీ ప్రయాణము విరమించుకొని కన్యను వివాహ మాడతాడు. మధుపర్కము : వరుడు అలంకృతుడై మంగళగీతికలతో, వేదమంత్రములతో చక్కని వాహనమున పెండ్లివారి యింటికి బయలుదేరును. వీరిని ఆహ్వానించి కన్యాదాత మధుపర్కము నొసగును. వరుడు మత్రపూతకముగా మధుపర్కమును స్వీకరించును. మధుపర్కమనగా తీయని పానీయం. మధువు (తేనె)తో పాలు మొదలగు వాటిని కలిపి తయారు చేయుదురు. ఇది సేవించిన తర్వాత వరుని వస్త్రాదులతో సన్మానిస్తారు. ఇది తెలియక మధుపర్కములు అనగా పెళ్ళిలో కట్టుకొను వస్త్రములు అను పొరపాటు అభిప్రాయం నేడు వ్యాపించింది. ఇంకా విచిత్రమేమంటే " జరీ మధుపర్కములు " అను పద ప్రయోగాలు కూడా అజ్ఞానము వలన తయారయినవి. గౌరీ పూజ లేదా లక్ష్మీపూజ : వధువు ఈ పూజ చేయుట వలను వధువునకు మాంగల్యాభివృధ్ధి కలుగును. కన్యాదాత వరుని పూజించుట : కన్యాదాత వరుని పాదములు కడిగి పూజించును. నిజానికి వరుడు కన్యాదాత కన్నా వయసులో చిన్నవాడు. వయసులో పెద్దవాడు తనకన్న చిన్నవాని పాదములు తాకుట, కడుగుట సామాన్యముగా లోకాచారము కాదుగాని, ఇది వివాహములో ఆచారము. దీనికి కారణము మంత్రములలో చెప్పబడింది. ఇక్కడ వరుడు లక్ష్మీనారాయణ స్వరూపుడు. ఇతడిని పూజించి, కాళ్ళని కడిగి, జలధారతో కన్యను దానమిచ్చుట (కన్య ధారపోయుట) మహాభాగ్యముగా భావించబడును. జీలకర్ర, బెల్లము : శుభముహూర్త సమయమున వధూవరుల మధ్య తెరతొలగిస్తారు. ఒకరినొకరు చూసుకున్న తరువాత జీలకర్ర , బెల్లము కలిపిన ముద్దను ఒకరి తలపై ఒకరు నిలిపి చేతితో తాకుతారు. పూర్వకాలములో పదార్ధ విజ్ఞాన శాస్త్రవేత్తలు (Material Scientists) జీలకర్ర బెల్లము కలిపి నూరినా, నలిపినా ధన సంజ్ఞక విద్యుత్తు (Positive electric charge) ఉత్పత్తి అగునని వర్ణించారు. జీలకర్ర బెల్లముతో ఘర్షణ చేస్తే అలాగే జరుగునని నిరూపించ బడింది. వేద కల్పము తెలిసిన పెద్దలు దీనిని గ్రహించి వధూవరుల పరస్పర జీవశక్తుల ఆకర్షణకు తోడ్పడునట్లుగా జీలకర్ర బెల్లము తాకుట ఒక ఆచారముగా చేసారు. దీనివలన దృష్టి కలుపుట, మనస్సు సంకల్పించుట సంభవించునని నమ్మకము. అరుంధతి దర్శనము : వివాహ ప్రక్రియలో వధూవరులను అరుంధతీ దర్శనం చేయిస్తారు. అరుంధతి అనగా ఎటువంటి పరిస్థితిలోనూ ధర్మమునకు హాని కలిగింపనిది అని అర్ధం. నూతన దంపతులు కామమునకే ప్రాధాన్యమీయకుండా ధర్మమునకే ప్రాధాన్యమిచ్చి లోకములో ఆదర్శ దంపతులుగా మెలుగుటకు కావలసిన దీవెనలు అరుంధతీ వశిష్టుల దర్శనము వలన పొందింపచేయటమే మన పెద్దల ఉద్దేశ్యము. కొసమెరుపు: ఒక యువతి త్రాచుపాముతో ప్రేమలో పడి పెళ్ళాడిన ఉదంతం 07.06.2006 న రెండువేల మంది సమక్షమ్లో జరిగింది. ఒరిస్సా రాజధానికి దగ్గరలొ అటాలా పల్లెకు చెందిన బింబాలా దాస్(30) అనేయువతి తాను తాచుపాముని ప్రేమిచానని పెళ్ళాడతానని ప్రకటించింది. మూఢనమ్మకాలకు నిలయమైన ఆ గ్రామ ప్రజలు పాము పుట్ట పక్కనే వివాహ వేదిక చేసి మంత్రోఛ్ఛారణతో తంతు నిర్వహించారు. వరుడు (పాము) పాపం ఎంతకీ పుట్టలోంచి రాకపోవడంతో పాము లోహ ప్రతిమను పెట్టి తంతు కానిచ్చేసారు.

అన్యోన్య దాంపత్యం..? పదమూడవ భాగం

హిందూ వివాహ ప్రాశస్త్యము. పదమూడవ భాగము
పెళ్ళి పుస్తకం - 13
సప్తపది లోని ప్రతి అడుగుకు ఒక అర్ధము, పరమార్ధము చూసాం. ఈ సప్తపది తరువాత కొన్ని రకాల హూమాలు జరుగుతాయి. అవి ప్రధాన హూమం, లాజా హూమం, ప్రవేశ హూమం,ఇదికాక, శనికల్లు తొక్కడం (పూర్వం మషాలా సామాను నూరడానికి ఉపయోగించిన ఒక రాయి..ఇది మనం పూజ గదిలో ఉంచుకునే రాతి గౌరిదేవిని పోలి ఉంటుంది దీ నినే శనికల్లు అంటారు) శేష హూమం వంటి తంతులు జరిపిస్తారు. ప్రస్తుతం వీటిలో కొన్ని ఆచరణలో లేవు. ఇహ పోతే వీటికి ముందు వరుడు కొన్ని మంత్రాలు చెపుతాడు. ఇవి ఇల్లాలు ఏ విధంగా అత్తవారింట నడచుకోవాలో సూచిస్తాయి. వరుడు: సభాసప్తవదాభవ సఖాయౌ సప్తదాబభూవ, సఖ్యంతేగమే యగేం, సఖ్యాత్తే మాయోషగ్గం సఖ్యాన్మే మాయోష్టా సమయా వ: సంకల్పావహై సంప్రియౌ రోచిష్టూ సుమనస్యమౌనౌ ఇష మూర్జమఖి సమ్వసానౌ సం నౌ మనాగంసి సం వ్ర తా సముచిత్తన్యకరమ్ ! తా : నాతో ఏడడుగులు నడచి నాకు స్నేహితురాలవుకమ్ము. ఏడడుగులు మనిద్దరం నడిస్తే మనం స్నేహితులమౌతాం. అప్పుడే నేను నీ స్నేహాన్ని పొందుతాను. నీ స్నేహన్నుంచి ఎప్పుడూ వియోగం పొందకు. పరస్పరం ప్రేమతో, అనుకూల దాంపత్యంతో ప్రకాశిస్తూ నిండు మనసుతో ఆహారాన్ని, బలాన్ని కలిసి పొందుతూ కలిసి ఉందాం, కలిసి ఆలోచించుకుందాం, అలాగే అన్ని విషయాలలోనూ బాహ్యేంద్రియాలు కూడా కలిసి ఉండేటట్లు నడచుకుందాం. వరుడు: అరణ్యమణం నుదేవా కన్యా అగ్నిమయక్షత్ర ఇమాం దేవో అధ్యర: ప్రేతో ముంచాతి నాముతస్సు బద్దామముతస్కరత్ తా: వెనుక స్త్రీలు అగ్ని దేవుణ్ణి పూజించి కోరిన భర్తను పొందిరి. లోకోపకారియైన ఆ అగ్ని దేవుడు ఈ చిన్నదానికి వివాహమైన తరువాత పుట్టింటి మీద మమకారం తగ్గించి అత్తింటి మీద విశేషానురాగం గల దానిగా చేయుచుండుగాక! వరుడు: సమ్రాజ్ఞి శ్వశురేభవనసమ్రాజ్ఞి శ్వశ్ర్వాంభవ, ననాందరి సమ్రాజ్ఞివ, సమ్రాజ్ఞి అధి దేవ్యేషు: తా : మామయందు, అత్తయందు, ఆడబిడ్డలయందు, బావలయందు, మరుదుల యందు, సముచిత ప్రేమాభిమానాలతో నుండుము. వరుడు: త్వష్టా జాయామజన యత్తత్వష్టా స్త్వైత్వాం పతితం త్వష్టా సహస్ర మాయూగ్గంషి దీర్ఘమాయు: కృణోతవాం తా : ఓ మనసా: బ్రహ్మ ఈ వధువును నాకు భార్యగా సృష్టించెను. నన్ను ఈ కన్యకు భర్తగా సృష్టించెను. ఆ బ్రహ్మ దేవుడు మా ఇద్దరికి సకల సంపదల నిచ్చి చిరాయుష్యమును కలిగించుగాక ! వధువు : ఆవశ్యం త్వా మనసా చేకితానం తనసో జాతం తవసో విభ్హుతం ఇహ ప్రజామి హరయిగ్గం రరాణ: ప్రజా యవ్వప్రజాయా పుత్రకామ ! తా : నిన్ను నా అబిప్రాయము తెలిసిన వానిగను, మంచి సంస్కారంతో పుట్టిన వానిని గాను, మంచి నియమాలతో పెంచుకున్న తేజస్సు గల వానిగను, నేను గ్రహించాను, ఓ సంతానాభిలాషి: నీవు నాతోనే సంతానాన్ని గని సిరి సంపదల నిచ్చి సుఖపడుము. ఇద్దరు: సంజంతు విశ్వేదేవాస్పమాపా హృదయానినౌ సంమాత రిళ్వా సంధాతా సముదేష్టి రిదేస్టునో ll తా ll విశ్వదేవులు, పవిత్రోదకాలు, వాయువు, బ్రహ్మ మన మనస్సులను ఎల్లప్పుడు స్నేహంతో కూడునట్లు చేయుదురుగాక: సరస్వతి మన మెప్పుడు అనుకూలంగా మాట్లాడుకొనేటట్లు చూచుగాక ! పెద్దలు: అభివర్ధతాం పయసాభిరాష్ట్రేణ వర్ధతాం, రయ్యా సహస్ర పోషనే మౌకాస్తామన పేక్షితౌ తా ll ఈ వధువు ఎల్లప్పుడూ పాడిపంటలతోను, ఇండ్లతోను, భూములతోను, సంపద మిమ్ములను అభివృధ్ధి చేయుగాక! ఈ దంపతులు సర్వసమృధ్ధితో దేనికిని ఇతరులను అపేక్షించకుండా ఉందురు గాక ! పెద్దలు : పుత్రిణేమా కుమారిణా నిర్వమాయుర్వ్య శ్నుతం ఉభా హిరణ్యా పేశసా వేతిహూత్రా కృతద్వసూ తా ll ఈ నూతన దంపతులిద్దరును, కుమారులు, కుమారికలు గలిగి పరిశుధ్ధమైన బంగారు కాంతితో మంచి పనులు చేస్తూ సిరిసంపదలు సంపాదించి మంచి ఆయుర్ధాయాన్ని పొందుదురుగాక ! కొసమెరుపు: Wife wanted A man inserted an 'ad' in the classifieds : " Wife Wanted". Next day, he received a hundred letters. They all said the same thing "You can have mine." A quarrel After a quarrel, a wife said to her husband, "You know, I was a fool when I married you." And the husband replied, "Yes, dear, but I was in love and didn't notice it."