Sunday, April 10, 2022

పెళ్ళిలో జీలకర్ర, బెల్లం ఎందుకు ? పద్నాల్గవ భాగం

వివాహ ప్రక్రియ లోని ముఖ్యమయిన వాటికి వివరణ పెళ్ళిపుస్తకం..14 వ భాగం. కాశీకి పోవుట: బ్రహ్మచారి చదువు ముగిసిన పిమ్మట గురువు ఆజ్ఞగొని యాత్రకు మరలుట (సమావర్తనము) ఒక ఆచారముగా ఉండేది (ఇప్పటికీ కొన్ని వర్ణాలలో ఈ తంతు ను చూడగలం). ఆ యాత్ర ఒక సమ్వత్సరం పరిమితి ఉండేది. ఆ దీక్షలో గురువు శిష్యునకు క్షురకర్మ(గుండు గీయించి) చేయించి, నూతన వస్త్ర ధారణ గావించి తర్వాత గురుదక్షిణ, దానితో ఆవును, దూడను, ఎద్దును స్వీకరించి సమావర్తనము చేయిస్తారు. ఈ సమయమున గొడుగు, చెప్పులు మొదలగు సామాగ్రిని సంసిధ్ధము చేసికొని, గురువునకు ఈ సామాన్లని దానము చేసి, బ్రాహ్మణులను పూజించి ప్రతి లోపమునకు ప్రాయశ్చిత్తముగా వారి అనుగ్రహమును పొంది బయలుదేరవలెను. ఈ తంతునే కాశీకి పోవుట అని క్లుప్తంగా అంటారు. పాద యాత్ర చేస్తున్న స్నాతకుని చేరి కన్యాదాత తన పుత్రికను దానము చేయుదననియు, అగ్నిసాక్షిగా పాణిగ్రహణము చేయుమనియు కోరును. అపుడు స్నాతకుడు కాశీ ప్రయాణము విరమించుకొని కన్యను వివాహ మాడతాడు. మధుపర్కము : వరుడు అలంకృతుడై మంగళగీతికలతో, వేదమంత్రములతో చక్కని వాహనమున పెండ్లివారి యింటికి బయలుదేరును. వీరిని ఆహ్వానించి కన్యాదాత మధుపర్కము నొసగును. వరుడు మత్రపూతకముగా మధుపర్కమును స్వీకరించును. మధుపర్కమనగా తీయని పానీయం. మధువు (తేనె)తో పాలు మొదలగు వాటిని కలిపి తయారు చేయుదురు. ఇది సేవించిన తర్వాత వరుని వస్త్రాదులతో సన్మానిస్తారు. ఇది తెలియక మధుపర్కములు అనగా పెళ్ళిలో కట్టుకొను వస్త్రములు అను పొరపాటు అభిప్రాయం నేడు వ్యాపించింది. ఇంకా విచిత్రమేమంటే " జరీ మధుపర్కములు " అను పద ప్రయోగాలు కూడా అజ్ఞానము వలన తయారయినవి. గౌరీ పూజ లేదా లక్ష్మీపూజ : వధువు ఈ పూజ చేయుట వలను వధువునకు మాంగల్యాభివృధ్ధి కలుగును. కన్యాదాత వరుని పూజించుట : కన్యాదాత వరుని పాదములు కడిగి పూజించును. నిజానికి వరుడు కన్యాదాత కన్నా వయసులో చిన్నవాడు. వయసులో పెద్దవాడు తనకన్న చిన్నవాని పాదములు తాకుట, కడుగుట సామాన్యముగా లోకాచారము కాదుగాని, ఇది వివాహములో ఆచారము. దీనికి కారణము మంత్రములలో చెప్పబడింది. ఇక్కడ వరుడు లక్ష్మీనారాయణ స్వరూపుడు. ఇతడిని పూజించి, కాళ్ళని కడిగి, జలధారతో కన్యను దానమిచ్చుట (కన్య ధారపోయుట) మహాభాగ్యముగా భావించబడును. జీలకర్ర, బెల్లము : శుభముహూర్త సమయమున వధూవరుల మధ్య తెరతొలగిస్తారు. ఒకరినొకరు చూసుకున్న తరువాత జీలకర్ర , బెల్లము కలిపిన ముద్దను ఒకరి తలపై ఒకరు నిలిపి చేతితో తాకుతారు. పూర్వకాలములో పదార్ధ విజ్ఞాన శాస్త్రవేత్తలు (Material Scientists) జీలకర్ర బెల్లము కలిపి నూరినా, నలిపినా ధన సంజ్ఞక విద్యుత్తు (Positive electric charge) ఉత్పత్తి అగునని వర్ణించారు. జీలకర్ర బెల్లముతో ఘర్షణ చేస్తే అలాగే జరుగునని నిరూపించ బడింది. వేద కల్పము తెలిసిన పెద్దలు దీనిని గ్రహించి వధూవరుల పరస్పర జీవశక్తుల ఆకర్షణకు తోడ్పడునట్లుగా జీలకర్ర బెల్లము తాకుట ఒక ఆచారముగా చేసారు. దీనివలన దృష్టి కలుపుట, మనస్సు సంకల్పించుట సంభవించునని నమ్మకము. అరుంధతి దర్శనము : వివాహ ప్రక్రియలో వధూవరులను అరుంధతీ దర్శనం చేయిస్తారు. అరుంధతి అనగా ఎటువంటి పరిస్థితిలోనూ ధర్మమునకు హాని కలిగింపనిది అని అర్ధం. నూతన దంపతులు కామమునకే ప్రాధాన్యమీయకుండా ధర్మమునకే ప్రాధాన్యమిచ్చి లోకములో ఆదర్శ దంపతులుగా మెలుగుటకు కావలసిన దీవెనలు అరుంధతీ వశిష్టుల దర్శనము వలన పొందింపచేయటమే మన పెద్దల ఉద్దేశ్యము. కొసమెరుపు: ఒక యువతి త్రాచుపాముతో ప్రేమలో పడి పెళ్ళాడిన ఉదంతం 07.06.2006 న రెండువేల మంది సమక్షమ్లో జరిగింది. ఒరిస్సా రాజధానికి దగ్గరలొ అటాలా పల్లెకు చెందిన బింబాలా దాస్(30) అనేయువతి తాను తాచుపాముని ప్రేమిచానని పెళ్ళాడతానని ప్రకటించింది. మూఢనమ్మకాలకు నిలయమైన ఆ గ్రామ ప్రజలు పాము పుట్ట పక్కనే వివాహ వేదిక చేసి మంత్రోఛ్ఛారణతో తంతు నిర్వహించారు. వరుడు (పాము) పాపం ఎంతకీ పుట్టలోంచి రాకపోవడంతో పాము లోహ ప్రతిమను పెట్టి తంతు కానిచ్చేసారు.

5 comments:

  1. వివాహము గురించి చక్కగా ఫోస్ట్ చేసారు.

    ReplyDelete
  2. శ్రీనిక గారూ !
    మిత్రుల కోరిక మన్నించి మళ్ళీ పెళ్ళిపుస్తకం ప్రారంభించినందుకు సంతోషం. వివరణ బావుంది. అభినందనలు.

    ReplyDelete
  3. sreenika గారూ...,

    నమస్కారం. క్రొత్తగా నేను హారం ప్రచార బాధ్యతను తీసుకున్నాను. కాబట్టి హారం గురించి
    ఓ నాలుగు మాటలు చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను. హారం ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. హారం ప్రతి ఐదారు
    నిమిషాలకు మీ బ్లాగునుంచి టపాలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు,
    మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం. హారంలో వ్యాస రచయితల పేర్లు, వ్యాఖ్యాతల పేర్ల పైన క్లిక్ చేసి సులభంగా వారి వారి వ్యాసాలను,వ్యాఖ్యలను చూసికొనే వీలుంది.

    తాజా టపాలనే కాక బ్లాగుల్లో లభ్యమయ్యే జ్ఞానాన్ని వివిధవర్గాలగా క్రోడీకరించి, గత నాలుగు సంవత్సరాలుగా
    తెలుగు తల్లి నోటినుంచి రాలిన ముత్యాలను గుదుగుచ్చి మీ ముందుంచుతుంది. ఈ ప్రయత్నంలో
    హారం ప్రస్తుతానికి ఆధ్యాత్మికం, పద్య సాహిత్యం, సాంకేతికం, హాస్యం, పాటలు,సినిమాలు, బొమ్మలు,సంగీతం, కవితలు, బాలసాహిత్యం, వంటలు మొదలైన వర్గాలుగా క్రోడీకరించి చూపిస్తుంది. .

    మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో హారం లింకు ను వుంచి ప్రోత్సహించండి. హారం లింకు ఇక్కడ నుండి సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు. అభిప్రాయాలను దయచేసి ఇక్కడ తెలుపండి . టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.

    - హారం ప్రచారకులు.

    ReplyDelete
  4. ఇవాళే మీ బ్లాగు చదవడం చాలా బాగా వివరించారు.

    ReplyDelete