Sunday, November 29, 2009

మరో లోకం లో


మనం కలిసిన
ఆ మధుర క్షణాలు
ఏ కలలు, కల్పనలు లేని
మరో లోకం లో
మనం మనకోసమే
అనుకున్నాం

ఏదో ఒక రోజు
కాలం ఈ సందేశాన్ని
నీ ముందు నిలబెడుతుంది.
నీవు లేని
నన్నుని చూస్తావు
పుడమి ఎదపై ముద్దాడిన
మన పాదముద్రికలని
నువు చూడకపోవు
పొన్నాయి చెట్టుకింద
నీ వడిలో నానుదుట
రాలిన పూవు
నీ ముద్దుతో
పొందిన అమరత్వాన్ని
నువు గుర్తించకపోవు
మన గుసగుసలు
గాలి వినిపించక పోదు
కిలకిలరావాలలో
పరిమళించిన ఆశలు
వినబడకపోవు

నీ రాకకై ఈ తోట
పూల పానుపు
పరిచింది..
ఒక్క భ్రమరం కోసం
వలపు రంగులద్దుకుని
మత్తుగా నీకోసం
వేచి చూసే వేల సుమాల్లో
నను గుర్తించ గలవా ప్రియా...


Monday, November 23, 2009

పెళ్ళి పుస్తకము -- ఏడవ భాగము


హిందూ వివాహ ప్రాశస్త్యము.
ఏడవ భాగము
వివాహ మంత్రాల అర్ధము
మరికొన్ని మంత్రాల అర్ధాలను ఇక్కడ చూద్దాం.
వధూవరుల గోత్రాలు తెలిపిన తర్వాత...
" ధర్మప్రజా సంపత్యర్ధం పృణీమహే"
(ధర్మ సంతాన సంపద కొరకు కన్యను
ఎన్నుకొనుచున్నాను
) అని వరుడు అనగా:
"వృణీధ్వం దా స్వామి"
(ఎన్నుకొంటిరి గావున ఇచ్చుచున్నాను)
అని కన్యాదాత అంటాడు.
" కృతార్ధావయం "
(కృతార్ధులయినాము)
అని కన్య వెదికినవారవరైనా ఉంటే వారంటారు.
అపుడు వరుడు....
" శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం ధర్మ ప్రజా
సంపత్యర్ధం : స్త్రీయం ఉద్వహే"

(శ్రీ పరమేశ్వర ప్రీతి కొరకు, ధర్మ సంతానము
కొరకు
ఈమెనువివాహం చేసుకొనుచున్నాను.
అని
అంటాడు.)
లక్ష్మీనారాయణ స్వరూపుడుగా కన్యాదాత వరుని పూజించును.
కాళ్ళు కడిగినపుడు
' ఆవ: పాదావనే జనేర్ ద్వివంత నిర్దహంతుమే'
( పాదములను రక్షించు దేవతలను
సంకల్పించు
జలములునా శత్రువులను
నిశ్శేషముగా
దహింతురు గాక.)
రెండు పాదములను కడిగి అర్ఘ్య పాద్యాదులు
అయిన
తరువాత మధుపర్కం (తీయని పానీయం )
మూడు
సార్లు వరుడికి కన్యాదాత ఇస్తాడు.
మరికొన్ని మంత్రాల అర్ధాలు మరో టపాలో...
కొసమెరుపు:
కళ్ళు రెండూ తెరచి ఉంచు పెళ్ళికి ముందు,
సగం
మాత్రమే తెరువు పెళ్ళితర్వాత. ........బెంజమిన్ ఫ్రాంక్లిన్
Marriage is the institution where the woman loses her the name and the man his solvency ~ Anonymous

Friday, November 13, 2009

పెళ్ళి పుస్తకం - ఆరవ భాగం

హిందూ వివాహ ప్రాశస్త్యము.
ఆరవ భాగము

వివాహ మంత్రాల అర్ధం
వివాహ సమయం లో వధూవరులతో చెప్పించే మంత్రాలను పరిశీలిస్తే మం ప్రాచీనుల దూరదృష్టి, భావ పటిష్టత ప్రతి పదమ్లో కనిపిస్తుంది. కనీసం కొన్ని మంత్రాలకైనా అర్ధాలు కొత్తగా పెళ్ళి చేసుకునేవారు, పెళ్ళి అయిన వారు గ్రహిస్తే మన సంప్రదాయ తత్వం బోధపడి కొన్ని సందేహాలు తొలగిపోయి లోక కళ్యాణం జరుగుతుంది. అందుకే కొన్ని మంత్రాల భావాలను తెలుసుకుందాం.
ఇవి కేవలం జనబాహుళ్యం లో ఉన్నవి మాత్రమే కాని.... ఇవే అన్ని మంత్రాలు కాదు.

కాశీ యాత్రకు వెళ్ళునపుడు(ఇది కొన్ని వర్ణాలలో) బంగారు ఆభరణాలు ధరిస్తారు.
అందువలన కలిగే లాభములు ఈ మంత్రములో....

" ఆయుష్యం,వర్చస్యం రాయస్పోష మౌద్బిదం
ఇదం హిరణ్యం వర్చస్వజైత్రాయా విశతాదిమాం "


ఆయుష్షు ను వర్చస్సును, జయమును కలిగించుట కొరకు
నాయందు ఉండుగాక.

" శత శారదా యాయుష్మాన్ జరదృష్టి ర్యదాసత్
మృతాదుర్ల్ప్తప్తం మధువత్ సువర్ణం ధనం జననం

రుణం దార యిషుణం "


నూరు సం వత్సరముల వరకు ఆయువు, ముసలినతనం వచ్చువరకు జీవించి యుండునట్లు చేయును గాక !
నేతి నునుపు ఆరకుండునట్లు గా మంచి రంగు సంపద, జయము దృఢత్వము కలుగును.

" ప్రియం మా కురదేవేషు ప్రియం రాజసు
మా కురు ప్రియం విశ్వేషు గోప్ర్తేసు II"


నాకు దేవతలతోను, రాజులతోను, లోక రక్షకులతోను, ప్రియ సంబంధము కలిగింపుము.
ఈ విధంగా మనం మంత్రాన్ని బంగారాభరణాలను ధరించుతూ చెపుతారు.
కొసమెరుపు:

@ Shaadi ke pehle - Ek Duje Keleye
Shaadi ke baad - Sirf Bachcho Ke Liye
@ Shaadi ke pehle - Dilwale Dulhaniya Le
Shaadi ke baad - Baaki Log Sukhi Ho jayenge
@ Shaadi ke pehle - Chandramukhi
Shaadi ke baad - Jwaalamukhi

@ Shaadi ke pehle - Maine Pyar Kiya

Shaadi ke baad - Ye Maine Kya Kiya?

Wednesday, November 11, 2009

ప్రతిసారీ మొదటిసారే....

ప్రతిసారి మొదటి సారిలా
ఏ గది మూలనో
అలజడి రేగి

రాత్రి అదే సమయానికి
కిటికీ తెరిచే సరికి
ఎదురింటి గుమ్మంలో
అఛిద్రమైన చీకట్లో
నాకోసం
నీవు...

కాలం జారిపోతూ
చిదిమిన చివరి
క్షణం నుండి
నీ కోసం
నేను...

చేరువయ్యే కొద్దీ
దూరమై
దూరమయ్యే కొద్దీ
చేరువయ్యే మనకి
ఎచటి నుండో
మూగ రాగాలు
మోసుకొస్తూంది ఆమని

నేనేనా...

విరితావులపై
ఇంద్రధనుస్సు
వలిగిపోయిందేమో...
నీ కురుల పానుపు మీద
పవళించాలని
పూలన్నీ మత్తుగా
నీ కోసం...

Monday, November 9, 2009

నీవు లేని.....నాలో


ఏవో భావనలు
నను కమ్మేస్తూన్నాయి
మనిద్దరిని దగ్గర చేస్తూన్నాయి

నీకోసం
సాగరాన్నైనా ఈదగలను
గాలిని గుప్పిట పట్టి
ఎక్కడికైనా ఎగర గలను

కాని ....
నీవు లేని నా హృదయం
ఆకాశం లేని పక్షిలా
నీవు లేని నా ఆత్మ
తప్పిపోయిన లేడిపిల్లలా
నిను చూడని నాకళ్ళు
శిశువు త్రాగక నిండిన
తల్లి పాలిండ్లలా
నీవు లేని నా కన్నీళ్ళు
ఉదయం లేని
మంచు బిందువుల్లా..

అనంత దూరానికి
ఇరువైపులా
మనం
నువు
గుసగుసలాడినా చాలు
వినిపిస్తుంది
నా హృదయానికి
కాదనకు ప్రియా.......

Friday, November 6, 2009

పెళ్ళి పుస్తకం.. ఐదవ భాగం - బి


హిందూ వివాహ ప్రాశస్త్యము.
ఐదవ భాగము - బి
అన్ని అనుభవాల్లో పురుషుడు స్త్రీ సమానంగా ఉన్నప్పుడే స్త్రీ పురుషునికి అర్ధాంగి అవుతుంది. ఈ వివాహ బంధం ఈ లోకంలోని ఈ జన్మలలో వీరిద్దరిని కలుపుతూనే ఉంటుంది. ప్రపంచ మానవ జీవితంలో ఆయా దేశాల్లో ఆయా సంప్రదాయాల్లో తేడాలున్నా వివాహమనేది ఒక విచిత్రబంధం. మన భారతదేశమ్లో నియమముగా బ్రహ్మచర్యాన్ని గడిపిన స్త్రీ పురుషులు సంఘ శ్రేయస్సును, తమ వంశ శ్రేయస్సును, తమ శ్రేయస్సును దృష్ఠిలో ఉంచుకొని, సకల ధర్మాలకు ఆశ్రయభూతమైన ఈ సంసారం చేసుకుంటారు. దీనిలో మానవ మనస్తత్వం లో ఎన్నో మార్పులు వస్తాయి. బాధ్యత పెరుగుతుంది.
గురుకులం లో విద్యాభ్యాసం ముగించిన తరువాత శిష్యునికి గురువు
" ప్రజాతంతుం మావ్యవచ్చేత్పీ:"
నీ వంశ పరంపరను నశింపజేయకుము. ఇంటికి వెళ్ళి వివాహం చేసుకోమని ఆజ్ఞాపించును.
కనుకనే లోకజ్ఞుడగు మహాకవి కాళిదాసు రఘువంశ రాజులను వర్ణించుచూ..
ప్రజాయై గృహ మేధినాం "...... సంతానం కొరకే గ్రుహస్తులగువారని చెప్పినాడు.
సంతాన ప్రాప్తి అనంతరం వారికి గృహస్తాశ్రమ ఆశక్తి లేదని వాన ప్రస్థులగుదురని కూడ దీనిని బట్టి తెలుస్తుంది.
కనుక మానవ జీవితంలో సకల శ్రేయస్సులకు మూలభూతమైన వివాహబంధం చాలా ప్రశస్తమైనది.
కొసమెరుపు :
ఘనా దేశం లోని ' ఆసాంటే ' అనే తెగలో
వరుడు, వధువు ఇంటి కెళ్ళి తలుపు తడతాడు. లోపలున్న వధువు తిరిగి తలుపు తడుతూ సమాధానం ఇస్తే...వరుడి తల్లి , మేనమామ వధువు ఇంటికి వెళ్ళి వివాహ ప్రతిపాదన చేస్తారు.
వివాహ మంత్రాల అర్ధం...తరువాయి టపాలో...


Monday, November 2, 2009

నో... హి షుడ్ స్పీక్ ఇం గ్లిష్


నో... హి షుడ్ స్పీక్ ఇం గ్లిష్ దట్సాల్

గత వారం రోజులనుంచి బ్లాగుల్లో వచ్చే విషయాల్లో ముఖ్యంగా " ఐ నెవర్ స్పీక్ తెలుగు " గురించే..
ఇదిలా ఉంటే...దాదాపు రాష్ట్రం లోని చాలా పాఠశాలల్లోనూ ఇంగ్లిష్ లోనే మాట్లాడాలనే నిబంధనని పాక్షికంగా సడలించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.
అయితే మా పాఠశాలలో ఈ విషయంలో ఎప్పుడూ ఎటువంటి ఆంక్షలు గాని శిక్షలు గాని లేవు. కేవలం పిల్లలకి కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి వివిధ రకాలయిన కార్యక్రమాలను నిర్వహించడం, కమ్యూనికేషన్ స్కిల్స్ రంగం లో నిష్ణాతులను రప్పించి దాని ఆవశ్యకతని తెలియచేయడం నిత్యం జరు గుతూంటాయి.
ఏదో ఒక టాపిక్ ఇచ్చి విధ్యార్ధు లందరిచేత మాట్లాడిస్తాం. వారి తప్పుల్ని తెలియజేస్తాం. ప్రోత్సాహక బహుమతులిస్తాం.
ఇంకా చెప్పాలంటే...బహుసా రాష్ట్రంలో స్పోకెన్ ఇంగ్లిష్ ఒక సబ్జక్ట్ గా బోధించే అతికొద్ది పాఠశాలల్లో మాదీ ఒకటని గర్వంగా చెప్పగలను.
సిడి ల ద్వారా ఎంతో సమాచారాన్ని వారికి అందచేస్తాం.
గత రెండు సం.రాలుగా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వారు నిర్వహించే స్పోకెన్ ఇంగ్లీష్ పరీక్షలకు ఇష్టమున్న విద్యార్ధులకు శిక్షణ ఇప్పిస్తున్నాం.
మరో విషయమేమంటే..గత సం.రం. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వారి అనుబంధ సంస్ఠ(MaaRs International) వారు నిర్వహించిన " స్పెల్ బీ ఇంటర్నేషనల్ " పోటీలలో దేశవ్యాప్తంగా వందల పాఠశాలలు పాల్గొన్నాయి. మా పాఠశాల పిల్లలు రాష్ట్రస్థాయి, అంతరాష్ట్రీయ,అంతర్జాతీయ స్థాయిలో 1,2,3.... స్థానాలు కైవశం చేసుకున్నారు.
ఇక అసలు విషయానికి వస్తాను.
ఈ మధ్య ఒక పేరెంట్ కలిసారు. తన కొడుకు ప్రోగ్రెస్ గురించి మాట్లాడుతూ..
మేడం. మా అబ్బాయి కొంచెం స్లో లెర్నర్. అన్ని సబ్జక్టుల్లోను ఏవరేజ్ గా ఉన్నాడు.
ఫర్వాలేదు. పికప్ అవుతాడు లెండి. ఇపుడిపుడే అలవాటు పడుతున్నాడు.
I know his improvement is slow but steady. అన్నాను.
అంతేకాదు మేడం. వాడికసలు ఇంగ్లీషు మాట్లాడడమే రావట్లేదు. మా చెల్లెలుగారి పాప మా బాబు లాగే ఏడో తరగతి ఫలానా______ స్కూల్లో చదువుతూంది. తను ఇంగ్లిష్ చాలా బాగా మాట్లాడుతాది. బాబుకెందుకు రావట్లేదు.
వస్తుంది. మీరేమీ ఖంగారు పడనఖ్ఖర్లేదు. నెమ్మది నెమ్మదిగా నేర్చుకుంటాడు.
లెర్నింగ్ అనేది నిదానంగా జరుగుతుంది కాని దాని ఫలితాలు మాత్రం శాశ్వతంగా ఉంటాయి.
కాబట్టి మీరు ఆందోళన చెందకండి. తను తప్పకుండా మాట్లాడగలడు.
అంటే..ఈ వారం వార్తల్లో వచ్చిన ఇంగ్లీష్ స్పీకింగ్ కధనాలని బట్టి....మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ మీద నిర్వహించే కార్యక్రమాలు సడలిస్తారేమోనని....
అదేం లేదండి..మీకు తెల్సు మాది నిర్బంధ విద్య కాదు. కాబట్టి ఎటువంటి సడలింపులు ఉండవు.
ఆ విషయం తెల్సు. మేడం. We joined him English medium for getting used with English. We are paying thousands and thousands.
ఇంగ్లీష్ మాట్లాడడం రాక పోతే భవిష్యత్తు అంధకారమే కదా.
So I don't know anything. He should speak in English....

ఇలాంటి పేరెంట్స్ ని చూస్తే.....
పెళ్ళి పుస్తకం - ఐదవ భాగం


హిందూ వివాహ ప్రాశస్త్యము.
ఐదవ భాగము - ఎ
రోజూ ఉదయాన్నే లేచే నాకు ఆదివారం వచ్చేసరికి చాలా బధ్ధకం వచ్చేస్తుంది. ఆయన మాత్రం ఉదయాన్నే లేచి రైతుబజారు కెళ్ళి కూరలు తెచ్చి పడేస్తారు. ఈ వారం ఆయనలేరు. నేనే వెళ్ళాలి. తప్పదు. పిల్లలింకా లేవలేదు. గబగబా తయారయి బండేసుకుని బయలుదేరాను. వచ్చేటపుడు నీలిమ వాళ్ళింటికి వెళ్ళాను.నీలిమ నా టెంత్ క్లాస్ మేట్. పాపం పెళ్ళయిన సం వత్సరానికే భర్త పోయాడు. సర్వీసులో చనిపోయాడు కాబట్టి దానికి రెవెన్యూ డెపార్ట్ మెంటులో జాబ్ ఇచ్చారు. అత్తమామలతో ఇక్కడే ఉంటుంది. మా సర్కిల్ లో తనెపుడూ అసలు పెళ్ళెందుకు చేసుకోవాలి. నేనసలు పెళ్ళేచేసుకోను. ఏకాకిగానే బ్రతికేస్తాను అని అంటూండేది. దీని మీదే ఎక్కువ చర్చలు జరిపేవాళ్ళం. అయితే అవి పెళ్ళి మీద ఎక్కువ అవగాహన లేని రోజులు. గుమ్మమ్లో ముగ్గు పెడుతూన్న నీలిమ నవ్వుతూ ఇంట్లోకి తీసుకెళ్ళింది. అత్తగారికి మావగారికి నేనంటే బాగా ఇష్టం. నీ బ్లాగ్ సీరియల్ ఎంతవరకూ వచ్చిందమ్మా అంకుల్ అడిగారు. బాగానే వస్తుందంకుల్. నాకు బ్రూ కాఫీ అంటే ఇష్టం అని నీలిమకి తెల్సు. ఒక లార్జ్ కప్ నిండా తీసుకొచ్చి తన రూంలోకి తీసుకుపోయింది. ఆనాటి నీలిమకి ఈ నీలిమకి ఎంత తేడా! కళ్ళల్లో కమ్ముకున్న దైన్యం. నీ సీరియల్ చదువుతున్నానే. చాలా బాగా రాస్తూన్నావు. ఈ వారం పెళ్ళి - దాని ఆవశ్యకత గురించి వ్రాయవే. అని తల దించుకుంది. అలాగేనే.. ఎపుడు కలిసినా దాన్ని చూస్తే ఎక్కువ సేపు ఉండలేను. బయలుదేరుతూంటే.. వాడులేని లోటు ఎవరం తీర్చలేమమ్మా. కనీసం నీవైనా అపుడపుడూ వస్తూండమ్మా. మీలాటి వాళ్ళని చూసైనా తను మళ్ళీ పెళ్ళి చేసుకుంటుంది. గేటు వరకూ వచ్చి నెమ్మదిగా ఆంటీ అన్నారు. నా కళ్ళల్లో నీళ్ళు తిరిగినయ్. తల్లి లాంటి అత్తగారు. అందుకే ఈ ఎపిసోడ్ నీలిమకు, నీలిమలాంటి వాళ్ళకూ అంకితం.
వివాహం - ఆవశ్యకత

తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మానవుడు పుడుతూనే ఋణపడుతున్నాడు. ఈ ఋణం తీరాలంటే తన వంశాన్ని నిలబెట్టి పితృదేవతలకు తృప్తి కలిగించాలి. సృష్టి ఆదినుంచీ తన వరకు వచ్చిన వంశాన్ని నిలబెట్టుకోవడానికి అతడు తనకు అన్ని విధాలా తగిన కన్యను వివాహమాడాలి. ధర్మ వివాహం వల్ల పుట్టిన సంతానమే పితృదేవతలను తృప్తి పరుస్తుంది. వంశాన్ని నిలబెడుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే సకల ప్రాణులకూ శాంతియుత సహజీవనం, ఇహపర సౌఖ్యాలు కలిగిలా మహర్షులు ధర్మ శాస్త్రాలను బోధించారు. మానవ జీవితానికి నాలుగు ఆశ్రమాలున్నాయి. అవి.
1. బ్రహ్మచర్యం 2. గృహస్థం 3. వానప్రస్థం 4. సన్యాసం
వీటిలో గృహస్థాశ్రమం అన్ని విధాలా అందరికి ఆశ్రయింపదగినది.
యధా మాతార మాశ్రిత్య సర్వేజీవంన్తిజ న్తవ: ! తధా గృహస్థమాశ్రిత్య సర్వే జీవన్తి మానవా: !!
లోకములో ధర్మార్ధకామరూప పురుషార్ధాలలో మానవునికి భార్యవలనగాని పరిపూర్ణత లభించదు,కనుకనే వివాహ సమయమ్లో అనాదిగా వరునిచే ఈ ప్రతిజ్ఞ చేయించడం జరుగుతూంది.
" ధర్మేచ, అర్ధేచ, కామేచ, త్రయైషా నాతిచరితవ్యా " అని కన్యాదాత చెప్పగా వరుడు... " నాతి చరామి " ఈమె నతిక్రమించి నేను నడువను" అని ప్రతిజ్ఞ చేస్తాడు.
ఈ వివాహ మనే సంస్కారం ఉంటేనే లోకం లో మనమెన్నో వైపరీత్యాలను చూస్తూన్నం. అసలు ఈ సంస్కారమే లేకపోతే లోకమెంత అస్తవ్యస్తమై పోతుందో ఊహించలేం. లోకమ్లో అనాదిగా మానవుని బుధ్ధిబలం ,ఆత్మ సంస్కారం పెరుగుతున్నదంటే దానికి పరోక్షంగాను, ప్రత్యక్షంగాను ఈ వివాహం కారణం అని చెప్పక తప్పదు. వివాహం చేసుకునే వయసు వచ్చినా వివాహం చేసుకోని స్త్రీని చూస్తే సంఘం ఏమనుకుంటుంది ? అలగే వివాహం చేసుకోని పురుషున్ని చూస్తే ఏమని అభిప్రాయపడుతుంది. వారు సన్యశిస్తే ఏ ప్రశ్నాలేదు. లేదా భీష్మునివలె ఆజన్మ బ్రహ్మచర్య దీక్ష వహించినా బాధలేదు. కనుకనే స్మృతికారులు స్త్రీ పురుషులకు వివాహ సమయాన్ని గూడా నిర్ణయించారు. ఒక రకంగా ఆలోచిస్తే ఆకాశమ్లో విహరించే చంచలమైన పురుషుని మంస్సనే గాలిపటానికి దార (భార్య) బలమైన దారం లాంటిది. ఆ రెంటి సమ్మేళనమే వివాహం. వివాహం జరిగితే మానవ జీవితం లో ఒక నిండుదనం కనబడుతుంది. భార్యాభర్తలు శారీరకంగా వేరైనా మానశికంగా ఒకటై సమానంగానే అన్ని అనుభూతులను ఒకటిగా అనుభవిస్తూ మధురంగా ఈ వివాహ జీవితం లో కాలం గుడుపుతారు. ఏడు జన్మల సంబంధం వారిద్దరికి ఉన్నట్టు మన హిందూ ధర్మం చెపుతుంది. వేరేచోట్ల పుట్టినా వేరే వాతావరణం లో పెరిగినా వివాహమైన తరువాత ఇద్దరి అనుభూతులూ ఒకటౌతాయి. భగవంతుని సంకల్ప ప్రకారమే వారిద్దరూ తగిన సమయమ్లో దగ్గరౌతారు. కనుకనే " వివాహాలు విధి నిర్ణీతాలు " అంటారు పెద్దలు.
కొస మెరుపు:

కంగ్రా లోయ లోని 'గద్ది' అను గిరిజన జాతిలోపెళ్ళి చాలా ముఖ్యమైనది. పెళ్ళికాని వారు చనిపోయిన తర్వాత వారి ఆత్మలు దయ్యాలై తిరుగుతాయని వారి నమ్మకం. వరుడు తెల్లని బట్టల్లో నుదుటిన విభూదితో శివుడిలా తయారవుతాడు. వరుడు ఒక బిక్షగాని వలె ఒక బొచ్చె (బిక్షగాని చేతిలో ఉండే ఒక గిన్నె)పట్టుకుని వధువు ఇంటివద్ద పిల్లని తనకు ఇచ్చి వివాహం చేయమని యాచిస్తాడు. వధువు తల్లి అతనికి రుచికరమైన ఆహారాన్ని పెట్టటం ద్వారా తమ ఇష్ఠాన్ని తెలియచేస్తుంది. ఆ తర్వాత సాంప్రదాయ వివాహ వేడుకలు జరుగుతాయి.

హిందూ వివాహ ప్రాశస్త్యము - ఐదవ భాగము - బి
తరువాయి టపాలో