Monday, November 2, 2009

పెళ్ళి పుస్తకం - ఐదవ భాగం


హిందూ వివాహ ప్రాశస్త్యము.
ఐదవ భాగము - ఎ
రోజూ ఉదయాన్నే లేచే నాకు ఆదివారం వచ్చేసరికి చాలా బధ్ధకం వచ్చేస్తుంది. ఆయన మాత్రం ఉదయాన్నే లేచి రైతుబజారు కెళ్ళి కూరలు తెచ్చి పడేస్తారు. ఈ వారం ఆయనలేరు. నేనే వెళ్ళాలి. తప్పదు. పిల్లలింకా లేవలేదు. గబగబా తయారయి బండేసుకుని బయలుదేరాను. వచ్చేటపుడు నీలిమ వాళ్ళింటికి వెళ్ళాను.నీలిమ నా టెంత్ క్లాస్ మేట్. పాపం పెళ్ళయిన సం వత్సరానికే భర్త పోయాడు. సర్వీసులో చనిపోయాడు కాబట్టి దానికి రెవెన్యూ డెపార్ట్ మెంటులో జాబ్ ఇచ్చారు. అత్తమామలతో ఇక్కడే ఉంటుంది. మా సర్కిల్ లో తనెపుడూ అసలు పెళ్ళెందుకు చేసుకోవాలి. నేనసలు పెళ్ళేచేసుకోను. ఏకాకిగానే బ్రతికేస్తాను అని అంటూండేది. దీని మీదే ఎక్కువ చర్చలు జరిపేవాళ్ళం. అయితే అవి పెళ్ళి మీద ఎక్కువ అవగాహన లేని రోజులు. గుమ్మమ్లో ముగ్గు పెడుతూన్న నీలిమ నవ్వుతూ ఇంట్లోకి తీసుకెళ్ళింది. అత్తగారికి మావగారికి నేనంటే బాగా ఇష్టం. నీ బ్లాగ్ సీరియల్ ఎంతవరకూ వచ్చిందమ్మా అంకుల్ అడిగారు. బాగానే వస్తుందంకుల్. నాకు బ్రూ కాఫీ అంటే ఇష్టం అని నీలిమకి తెల్సు. ఒక లార్జ్ కప్ నిండా తీసుకొచ్చి తన రూంలోకి తీసుకుపోయింది. ఆనాటి నీలిమకి ఈ నీలిమకి ఎంత తేడా! కళ్ళల్లో కమ్ముకున్న దైన్యం. నీ సీరియల్ చదువుతున్నానే. చాలా బాగా రాస్తూన్నావు. ఈ వారం పెళ్ళి - దాని ఆవశ్యకత గురించి వ్రాయవే. అని తల దించుకుంది. అలాగేనే.. ఎపుడు కలిసినా దాన్ని చూస్తే ఎక్కువ సేపు ఉండలేను. బయలుదేరుతూంటే.. వాడులేని లోటు ఎవరం తీర్చలేమమ్మా. కనీసం నీవైనా అపుడపుడూ వస్తూండమ్మా. మీలాటి వాళ్ళని చూసైనా తను మళ్ళీ పెళ్ళి చేసుకుంటుంది. గేటు వరకూ వచ్చి నెమ్మదిగా ఆంటీ అన్నారు. నా కళ్ళల్లో నీళ్ళు తిరిగినయ్. తల్లి లాంటి అత్తగారు. అందుకే ఈ ఎపిసోడ్ నీలిమకు, నీలిమలాంటి వాళ్ళకూ అంకితం.
వివాహం - ఆవశ్యకత

తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మానవుడు పుడుతూనే ఋణపడుతున్నాడు. ఈ ఋణం తీరాలంటే తన వంశాన్ని నిలబెట్టి పితృదేవతలకు తృప్తి కలిగించాలి. సృష్టి ఆదినుంచీ తన వరకు వచ్చిన వంశాన్ని నిలబెట్టుకోవడానికి అతడు తనకు అన్ని విధాలా తగిన కన్యను వివాహమాడాలి. ధర్మ వివాహం వల్ల పుట్టిన సంతానమే పితృదేవతలను తృప్తి పరుస్తుంది. వంశాన్ని నిలబెడుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే సకల ప్రాణులకూ శాంతియుత సహజీవనం, ఇహపర సౌఖ్యాలు కలిగిలా మహర్షులు ధర్మ శాస్త్రాలను బోధించారు. మానవ జీవితానికి నాలుగు ఆశ్రమాలున్నాయి. అవి.
1. బ్రహ్మచర్యం 2. గృహస్థం 3. వానప్రస్థం 4. సన్యాసం
వీటిలో గృహస్థాశ్రమం అన్ని విధాలా అందరికి ఆశ్రయింపదగినది.
యధా మాతార మాశ్రిత్య సర్వేజీవంన్తిజ న్తవ: ! తధా గృహస్థమాశ్రిత్య సర్వే జీవన్తి మానవా: !!
లోకములో ధర్మార్ధకామరూప పురుషార్ధాలలో మానవునికి భార్యవలనగాని పరిపూర్ణత లభించదు,కనుకనే వివాహ సమయమ్లో అనాదిగా వరునిచే ఈ ప్రతిజ్ఞ చేయించడం జరుగుతూంది.
" ధర్మేచ, అర్ధేచ, కామేచ, త్రయైషా నాతిచరితవ్యా " అని కన్యాదాత చెప్పగా వరుడు... " నాతి చరామి " ఈమె నతిక్రమించి నేను నడువను" అని ప్రతిజ్ఞ చేస్తాడు.
ఈ వివాహ మనే సంస్కారం ఉంటేనే లోకం లో మనమెన్నో వైపరీత్యాలను చూస్తూన్నం. అసలు ఈ సంస్కారమే లేకపోతే లోకమెంత అస్తవ్యస్తమై పోతుందో ఊహించలేం. లోకమ్లో అనాదిగా మానవుని బుధ్ధిబలం ,ఆత్మ సంస్కారం పెరుగుతున్నదంటే దానికి పరోక్షంగాను, ప్రత్యక్షంగాను ఈ వివాహం కారణం అని చెప్పక తప్పదు. వివాహం చేసుకునే వయసు వచ్చినా వివాహం చేసుకోని స్త్రీని చూస్తే సంఘం ఏమనుకుంటుంది ? అలగే వివాహం చేసుకోని పురుషున్ని చూస్తే ఏమని అభిప్రాయపడుతుంది. వారు సన్యశిస్తే ఏ ప్రశ్నాలేదు. లేదా భీష్మునివలె ఆజన్మ బ్రహ్మచర్య దీక్ష వహించినా బాధలేదు. కనుకనే స్మృతికారులు స్త్రీ పురుషులకు వివాహ సమయాన్ని గూడా నిర్ణయించారు. ఒక రకంగా ఆలోచిస్తే ఆకాశమ్లో విహరించే చంచలమైన పురుషుని మంస్సనే గాలిపటానికి దార (భార్య) బలమైన దారం లాంటిది. ఆ రెంటి సమ్మేళనమే వివాహం. వివాహం జరిగితే మానవ జీవితం లో ఒక నిండుదనం కనబడుతుంది. భార్యాభర్తలు శారీరకంగా వేరైనా మానశికంగా ఒకటై సమానంగానే అన్ని అనుభూతులను ఒకటిగా అనుభవిస్తూ మధురంగా ఈ వివాహ జీవితం లో కాలం గుడుపుతారు. ఏడు జన్మల సంబంధం వారిద్దరికి ఉన్నట్టు మన హిందూ ధర్మం చెపుతుంది. వేరేచోట్ల పుట్టినా వేరే వాతావరణం లో పెరిగినా వివాహమైన తరువాత ఇద్దరి అనుభూతులూ ఒకటౌతాయి. భగవంతుని సంకల్ప ప్రకారమే వారిద్దరూ తగిన సమయమ్లో దగ్గరౌతారు. కనుకనే " వివాహాలు విధి నిర్ణీతాలు " అంటారు పెద్దలు.
కొస మెరుపు:

కంగ్రా లోయ లోని 'గద్ది' అను గిరిజన జాతిలోపెళ్ళి చాలా ముఖ్యమైనది. పెళ్ళికాని వారు చనిపోయిన తర్వాత వారి ఆత్మలు దయ్యాలై తిరుగుతాయని వారి నమ్మకం. వరుడు తెల్లని బట్టల్లో నుదుటిన విభూదితో శివుడిలా తయారవుతాడు. వరుడు ఒక బిక్షగాని వలె ఒక బొచ్చె (బిక్షగాని చేతిలో ఉండే ఒక గిన్నె)పట్టుకుని వధువు ఇంటివద్ద పిల్లని తనకు ఇచ్చి వివాహం చేయమని యాచిస్తాడు. వధువు తల్లి అతనికి రుచికరమైన ఆహారాన్ని పెట్టటం ద్వారా తమ ఇష్ఠాన్ని తెలియచేస్తుంది. ఆ తర్వాత సాంప్రదాయ వివాహ వేడుకలు జరుగుతాయి.

హిందూ వివాహ ప్రాశస్త్యము - ఐదవ భాగము - బి
తరువాయి టపాలో

2 comments:

  1. Why there is not something about freedom.

    ReplyDelete
  2. అమ్మే విసిరేసింది
    మదనపల్లె, కురబలకోట, న్యూస్‌టుడే: ఆమెపేరు షబానా.. వయస్సు 28. నయం కాని తీవ్రమైన వ్యాధితో బాధపడుతున్న ఆమెను గ్రామస్థులు రానివ్వలేదు. ఆసుపత్రిలోనూ ఆదరణ లభించలేదు. చివరికి సొంత తల్లి ఆమెను తీసుకెళ్లి ప్రాణం ఉండగానే జనసంచారం లేని ప్రాంతంలో పడేసింది. కొన ఊపిరితో ఉన్న షబానా తుదిశ్వాస విడిచింది. సమాజంలో మానవతా విలువలు దిగజారిపోతున్నాయనడానికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తోంది షబానా ఉదంతం.మదనపల్లెలోని ప్రభుత్వాసుపత్రిలో తల్లి ప్యారేజాన్ చేర్పించి పట్టించుకోవడం మానేసింది. తోటి రోగుల ఈసడింపునకు గురైంది. ఆమెను తీసుకెళ్లాలని అందరూ పట్టుబట్టడంతో ఆమె తల్లి ఆటోలో కురబలకోట రైల్వేస్టేషన్ సమీపంలోని పొలాల్లో వదిలేసింది. ఈనాడు 28.7.2007
    ఇటువంటి వారికి పెళ్ళి పిల్లలు అవసరమా?

    ReplyDelete