Tuesday, October 27, 2009

పెళ్ళి పుస్తకం --నాల్గవ భాగం


హిందూ వివాహ ప్రాశస్త్యము.
నాల్గవ భాగము
మొదటి కార్తీక సోమవారం బాగా జరిగింది. మా ఫ్లాట్ లో వాళ్ళందరూ కలిసి రెండు ఆటోలలోనూ,
ఉన్నవాళ్ళు వారి కార్ల లోను శివాలయానికి వెళ్ళాం. పిక్ నిక్ ఎక్కడ జరుపుకోవాలన్న విషయం చర్చకి వచ్చింది..
మగ వాళ్ళందరూ అన్నవరం వెళదామని, ఆడవాళ్ళు దేవిపురం వెళదామని ప్రపోస్ చేసాం.
అప్పటివరకూ ఆలయం పార్క్ లో ఆటలాడుకుంటూన్న పిల్లలకి ఎలా తెలిసిందో ఏమో...
ఒక్కసారిగా వచ్చి ...మేమందరం ఆల్రెడీ డిసైడ్ అయి పోయాం. లాస్టియర్ కూడా మీరు తీసుకెళ్ళిన చోటుకే వచ్చాం .
ఈసారి అలా జరగడానికి వీల్లేదు. మేమంతా ' జూ ' కి వెళ్ళాలనుకుంటూన్నాం. వస్తే మీరు మాతో రండి.
లేదంటే గుంటూరు తాతయ్య ని తీసుకుని మేమంతా జూకి వెళతాం.
మా అందరి చూపులు ఒక్క సారిగా గుంటూరు తాత గారి మీదకు మళ్ళినయ్...
ఇందులో ఆయన ప్రమేయమేమి లేదు. ఇది మా స్వంత నిర్ణయమే.
మా ఫ్లాట్ లలో ఒక ఫామిలీ గుంటూరునించి వచ్చి సెటిల్ అయ్యారు.
వారింట్లో పెద్దాయనకి పిల్లలంటే చాలా ఇష్టం.
అందరూ ఆయన్ని గుంటూరు తాతయ్య అని పిలుస్తారు.
ఇంతలో రెండవ ఫ్లోర్ లో ఉండే చిన్నిపాప మేఘన (3rd class)
నా దగ్గరకి వచ్చి ..
Hanti, I have never seen a zoo, hanti. I want to see animals.
I want to climb on elephant. Please hanti, let us go to the zoo hanti,
please hanti, please hanti.....
మేఘన అంటే అందరకీ ఇష్టమే. అయినా మిగిలిన వాళ్ళని తృణీకరించలేము.
O.K. O.K. ఇళ్ళకి వెళ్ళాకా మూడు ప్లేసులకి డ్రా వేద్దాం.
ఆ మర్నాడు డ్రా తీయడము అందులో జూ రావడమూ పిల్లలందరికి ఆనందమైపోయింది.
చక చకా ఏర్పాట్లు కూడా జరిగిపోయాయి.
భోజనాలయిన తర్వాత ఏదో వినోద కార్యక్రమాల్లో భాగంగా..డ్రాలో నేనొక ఉపన్యాసం ఇవ్వాలి.
అప్పటికే మావాళ్ళలో కొద్దిమందికి నా బ్లాగోపాఖ్యానం గురించి తెలిసింది..
వివాహ స్వరూపం గురించి చెప్పమన్నారు.
మావారు నాకేసి గర్వంగా చూడటం నాకెంతో ఆనందంగా ఉంది.

అందరికీ నమస్కారం.

కార్తీక మాస వన భోజనాల పర్వ దినాన మనందరం ఇలా కలసి ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది.
మీలో చాలామంది పెళ్ళి చేసుకున్నవారే..పెళ్ళిళ్ళు చేసినవారే..
ఇపుడు నేచెప్పబోయేవిషయాలు మీకందరకు తెలిసినవే.
అయితే మన హిందూ సంప్రదాయం లోని వివాహ వ్యవస్ఠ కి విదేశాలలో మంచి పేరుంది.
దురదృష్ఠవశాత్తూ మన హిందువులు మాత్రం పాశ్చాచ్య నాగరికతకై పాకులాడుతున్నారు.
ఈ సాంప్రదాయాన్ని మన భావితరాలకి అందించాలనే తపనతో నా బ్లాగులో హిందూ వివాహ ప్రాశస్త్యం గురించి టపా చేస్తూన్నాను.
ఐతే ఈరోజు మీకు సింపుల్ గా వివాహ స్వరూపం గురించి వివరిస్తాను.

హిందూ వివాహ స్వరూపము.
పెద్దలు సుముహూర్తం నిశ్చయం చేసిం తరువాత అంకురారోపణం, దేవతాహ్వానం చేస్తారు.
వరుడు తన ఇంట్లోనే స్నాతక వ్రతం( కొన్ని వర్ణాలలో మాత్రమె) చేసుకుంటాడు.
వధూవరులు ఇద్దరూ మంగళ స్నానాలు చేస్తారు. వినాయకుణ్ణి వివాహం నిర్విఘ్నంగా జరగాలని పూజించి పుణ్యాహవాచనం చేస్తారు. కంకణాలను పూజించి ముందు వరునికి కడతారు.
ఇవెందుకు కడతారో తెలుసా ?
కంకణం కట్టడం వలన ఎటువంటి మైలలు వచ్చినా అతనికి సోకవు.
తరువాత కన్యచే గౌరీపూజ, కంకణపూజ చేయించి కన్యకు కూడా కంకణం కడతారు.
తరువాత వరపూజ.
వరపూజ అంటే...కన్యాదాత వరుడి కాళ్ళు కడిగి మధుపర్కం ఇస్త్తాడు. వరుడికి వస్త్రాభరణాలిస్తారు.
తరువాత సన్నటి తెర ను మధ్య పట్టుకుని కన్యను రప్పించి కన్యాదానం చేస్తారు.
తరువాత ఇతర దానాలు కూడా చేస్తారు.
వధూవరుల గోత్రనామాలతో పూజ చేయిస్తారు.
కన్నాదాత వరునిచే ధర్మార్ధకామాలలో ఈ కన్యను విడువనని ప్రమాణం చేయిస్తాడు.
సుమూహర్త సమయమ్లో వధూవరులిద్దరూ ఒకరి తలపై ఇంకొకరు జీలకర్ర, బెల్లం పెట్టి
అందరి సమక్షమ్లో దంపతు లైనట్లు పరిగణింపబడతారు.
నిజానికి వివాహం అంటే ఇదే. మంగళ సూత్రధారణ కాదు.
తరువాత తెర తీస్తారు.
శుభ సమయం లో వరుడు వధువును చూస్తాడు.
నూతన దంపతలిద్దరినీ పక్క పక్కన కూర్చోపడతారు.
తరువాత కన్య శిరస్సు మీద కాడి ( బండికి గాని, నాగలికి గాని
రెండెద్దుల మధ్యఉండే కర్ర )కి ఉండే
రంధ్రం గుండా బంగారు వస్తువు ని ఉంచి వరుడు అభిషేకం చేస్తాడు.
వధువుకి కొత్తబట్టలు ఇస్తారు.
వరుడు వధువు నడుమునకు ధర్మతాడు కడతాడు.
తదుపరి పెద్దలందరూ కళ్ళకి అద్దుకున్న మంగళసూత్రాన్ని వధువు మెడలో
రెండు గట్టి ముళ్ళనూ, మూడవది వదులుగానూ కడతాడు.
పెద్దల ఆశీస్సు లు పొంది, తలంబ్రాలు పోసుకుంటారు.
బ్రహ్మ ముడులు వేసిన తరువాత కన్య చేయి పట్టుకుని వరుడు
ఏడడుగులు నడిపిస్తాడు.
తరువాత ప్రధాన హోమం , ప్రవేశ హోమం, సదశ్యం , నాకబలి ,
అప్పగింతలు వగైరా జరుగుతాయి.
ఇది స్థూలంగా వివాహ స్వరూపం.

అందరి కరతాళ ధ్వనుల మధ్య నేను
మావారి కళ్ళల్లో సన్నని కన్నీటి పొర గమనించక పోలేదు....

వివాహ ప్రశస్తి ...మరో టపాలో..





Sunday, October 25, 2009

మాయా ఏంజిలౌ

అమెరికా జాత్యహంకారపు పడగ నీడలోఅణగద్రొక్కబడిన నల్ల జాతి బానిస జీవుల జీవితాలలో తమ రచనలతో వెలుగులు నింపిన అతికొద్దిమంది నల్లజాతీయులలోమాయా ఏంజిలౌ ఒకరు.విలక్షణమైన వ్యక్తిత్వం, నిర్మొహమాటమైన వైఖరి ఈమె రచనల్లో కనిపిస్తుంది. బహుముఖ ప్రజ్ఞాశాలి వివిధ రచనా ప్రక్రియలలో అసాధారాణ ప్రతిభ ఆవిడ సొంతం. Still I rise, On the pulse of morning, Life doesn't frighten me etc., అనే కవితలుI know why the caged bird sings, The heart of a woman అనే ఆత్మకధలు ఆమెకి బాగా పేరు తెచ్చిన రచనలు.

Still I rise


నీ దుర్భాష్యాలతో, అబధ్ధాలతో
నాకు హేయమైన చరిత్ర సృష్ఠించవచ్చు
నీ ఉక్కు పాదాలతో నను
భూస్థాపితం చేయవచ్చు
అయినప్పటికీ
నేను ఉదయిస్తాను
గోధూళినై..

నా ఆత్మవిశ్వాశం నిన్ను కలవర పరుస్తోందా?
నీవెందుకు దుఖ:సాగరంలో మునిగిపోయావు ?
నా ఇంట్లో చమురుబావులు న్నంత
గర్వంతో నేను నడుస్తున్నందుకా ?


సూర్య చంద్రుల్లా

తీరాల్ని తాకే అలల్లా
ఉవ్వెత్తున ఎగిసె పడే

ఆశల ఉప్పెనలా
ఉదయిస్తాను

ఆత్మఘోషతో అచేతననై
కన్నీటిధారలతో తలదించి విగతనై
నీముందు
నిలబడాలనుకుంటున్నావు కదూ..

నా అహంకారం నిను బాధిస్తూందా ?
ఎందుకంటే నా పెరట్లో
నేనేవో
బంగారు గనులు తవ్వుతున్నంత
ఆనందంగా వున్నాను..
ఇదొక ఘోర విపత్తనిపిస్తోందా?


నీ మాటల తూటాలతో

నను కాల్చివేయవచ్చు

నీ చూపుల్తోనను

తునాతునకలు చేయవచ్చు

నీ ద్వేషాగ్నిలో

నను భస్మం చేయవచ్చు
అయినప్పటికీ ఉదయిస్తాను
అనంత వాయువునై

నా సౌందర్యం

నిను కలవర పెడుతోంది కదూ
....
నా వాంఛలు తీరినట్లు

నేనేదో కానుకలు పొందుతున్నట్లు

నే చేస్తూన్న నాట్యం
ఆశ్చర్యంగా ఉందికదూ ...

చరిత్ర చీకటి
పుటల్లోంచి
ఉదయిస్తాను..

గాయాలమయమైన
గతం
మూలాల నుండి
ఉదయిస్తాను

ప్రతికెరటం లోను

ఉవ్వెత్తున ఎగిసిపడే వెల్లువతో

జలిస్తూ విశ్వవ్యాపితమైన

నల్ల సముద్రాన్ని నేను


భయాన్నీ, భీకర రాత్రులను చేధించి
సర్వశోభితమైన అరుణ కిరణాల్లా
ఉదయిస్తాను
తరతరాల వారసత్వ
పోరాట పటిమను
మీ కందిస్తూ
బానిస బ్రతుకుల పాలిట
ఒక అందమైన స్వప్నంలా
ఒక ఆశలా

ఉదయిస్తాను...

Saturday, October 24, 2009

పెళ్ళి పుస్తకం - మూడో భాగం.




హిందూ వివాహ ప్రాశస్త్యము.
మూడవ భాగం.

దీపావళీ దగ్గరపడిందంటేనే మనసెంతో ఆనందంగా ఉంటుంది. తర్వాత కార్తీకమాసం నిత్యపూజలు భగవన్నామస్మరణ ..మనసంతా ప్రశాంతంగా ఉంటుంది. మొదటి కార్తీక సోమవారం పూజకి సామాన్లు కొనడానికి శివాలయం వీధి వైపు బయలుదేరుతుండగా విజయ నుంచి ఫోనొచ్చింది. నా క్లాస్ మేట్. మధ్యే బదిలీ అయి వచ్చారు. ఫోను లిఫ్టు చేసాను.
హలో విజయా! బాగున్నావా?
బాగున్నానే..
నిన్న రాత్రే చాలా సేపు మాట్లాడుకున్నాం. వారం లో రెండు మూడు సార్లు ఫోనులో మాట్లాడుకుంటాం. నెలకొకసారైనా వీకెండ్ హోటల్లోనో ఎంజాయ్ చేస్తాం. అయితే ఏమిటి సంగతి ఇంత సడన్గా.
ఏమిటే విజయా!
. ఏమ్లేదే.మేము శ్రీకాకుళం లోఉన్నపుడు మా మరిది వికాశ్ లేడా. అతను అమ్మాయితో ప్రేమలో పడ్డాడే. ఎలగోలా అతని మనసు మళ్ళించి, ఇక్కడకి ట్రాంసఫర్ పెట్టించుకుని ఇక్కడకు వచ్చేసాం. కానీ ఇప్పుడు అతను ఉదయం నుంచి కనిపించట్లేదే.
అక్కడ అమ్మాయి కూడా...
లేచి పోయారా.....
హా. అంతే కావచ్చు .మాకేమో ఊరు కొత్త. స్టేషన్ లో రిపొర్టివ్వడాలు.... మీవారికి వీలైతే..
ఏయ్. ఏంటే అలా కంగారు పడి పోతావు. మేమిద్దరం బయలుదేరి వస్తున్నాం.
బజారు నించి వస్తూ..వాళ్ళింటికి వెళ్ళాం. ఇల్లంతా శ్మశాన వాతావరణం. పిల్లలకేమీ పెట్టినట్లు లేరు. మేంతెచ్చిన ప్రసాదాలు ఆబగా తినేసారు. మావారు, విజయ హస్బెండ్ బయటకి వెళ్ళిపోయారు.
విజయ వాళ్ళ పెద్దపాప తన్మయి చాల ఇంక్విసిటివ్. మెల్లగా నాదగ్గరకు వచ్చి చేరిపోయింది. ఆంటీ. పెళ్ళిళ్ళ గురించి నీకు బాగా తెలుసని అమ్మ ఎన్నోసార్లు చెప్పింది.
ఇపుడు బాబాయి ఎవరిష్ఠం లేకుండా పెళ్ళి చేసుకుంటున్నాడు కదా. ఇదేం రకమయిన పెళ్ళి. వయసుకి మించిన ప్రశ్న అయినా చెప్పాలని అనిపించింది. క్లుప్తంగా చెప్పాను.

ఇదుగో అప్పుడే విషయాలన్నీ బ్లాగులో పెట్టాలన్న ఆలోచన వచ్చింది.

మన పూర్వీకులు వివిధ రకాల వివాహాలని ఒక పద్యం లో చక్కగా పొందు పరిచారు.

బ్రాహ్మాదైవస్తదైవార్ష:ప్రాజాపత్య:తధాసుర:

గాంధర్వో రాక్షస్తశ్చైవ పైశాచశ్చాష్టయో ధమ:

1.
బ్రాహ్మం 2. దైవం 3. ఆర్షం 4. ప్రాజాపత్యం

5.
అసురం 6. గాంధర్వం 7. రాక్షసం 8. పైశాచం.

1.
బ్రాహ్మం: సర్వ లక్షణ సంపన్నుడైన వరుని ఆహ్వానించి యధాశక్తిగా
అలంకరించిన
కన్యను అతనికి ఉదక పూర్వకంగా
దానం చేస్తే అది బ్రాహ్మ వివాహ మంటారు. ఇలా వివహం చేసుకున్న దంపతులకు పుట్టిన వాడు పదితరాలకు పితృదేవతలను, పదితరాల వరకూ పుత్రాదులను, పవిత్రులను చేస్తాడు.

2.
దైవం : యజ్ఞాన్ని చేసేటప్పుడు అక్కడ ఋత్విక్కుగా వున్న వరుడికి అలంకరించిన కన్యను దానం చేయడం దైవవివాహమంటారు. ఇలా పెండ్లి చేసుకున్న వారికి పుట్టినవాడు 7 తరాల ముందువారిని, 7 తరాల తరువాత వారిని కూడా తరింపజేస్తాడు.

3.
ఆర్షం : రెండు ఆవులను తీసుకుని కన్యాదానం చేస్తే అది ఆర్షవివాహ మౌతుంది. ఇలా పెండ్లి చేసుకున్న వారికి పుట్టిన వాడు ముందు మూడు తరాలను తర్వాత మూడు తరాలను తరింపజేస్తాడు.

4.
ప్రాజాపత్యం : " కలిసి ఉండి ధర్మాన్ని ఆచరించండి " అని ప్రతిజ్ఞ చేయించి కన్యాదానం చేస్తే అది ప్రజాపత్యమౌతుంది.
ఇలా పెండ్లయినవారికి పుట్టిన వారు ముందు 6 తరాలను, తరువాత 6 తరాలను తనను కూడా తరింపచేస్తాడు.

5.
అసురం : వరుని దగ్గర డబ్బు తీసుకుని కన్యాదానం చేస్తే అది అసుర వివాహం అవుతుంది.

6.
గాంధర్వం : పరస్పరానురాగాన్ననుసరించి రహస్యంగా చేసుకునేది గాంధర్వ వివాహం.

7.
రాక్షసం : యుధ్ధం చేసి కన్యనపహరించి చేసుకుంటె అది రాక్షస వివాహం అవుతుంది.

8.
పైశాచం : కన్యను మారువేషమ్లోనో, నిద్ర పోతూండగానో అపహరిస్తే అది పైశాచ వివాహమౌతుంది.
కొస మెరుపు:
ఘనా దేశం లో ఆసాంటే అను తెగవారిలో మగవాడు వధువు ఇంటి తలుపు తడతాడు. వరుని తల్లి ,అతని మేనమామ వధువు ఇంటి కి వెళ్ళి వివాహాన్ని పర్తిపాదిస్తారు.

వివాహ స్వరూపం ....మరో టపాలో...

Monday, October 19, 2009

పెళ్ళి పుస్తకం.. రెండో భాగం

హిందూ వివాహ ప్రాశస్త్యము

రెండవ భాగము
మహర్షిభిర్మంగళశీలవద్భి:
ఆభ్యూహితో నుష్ఠిత ఆదరేణ

చిరాదయం విశ్వజనీన ఆర్యా:
వివాహసందా నితరాం సమింధామ్||


భావం:- ఓ పూజ్యులారా ! వివాహమార్గమును రూపొందించినవారు శుభకరమైన శీలముగల మహర్షులు.
ఇది విశ్వజనీనము, ఇట్టి ఈ వివాహమార్గము ఆచంద్రార్కము మిక్కిలి ప్రకాశించు గాక!

ఉపోద్ఘాతము : దాంపత్యము సృష్ఠి ధర్మము. ఇది సర్వ జీవులకు సమానము. అందు మానవులకు బుధ్ధి ప్రసాదింపబడెను.
గనుక సంస్కారయుతమైన, ధర్మబధ్ధమైన జీవితము గడుపుట వారి కర్తవ్యమైనది. అదియే సుఖమును, ఆనందమును గలిగించును.హిందూ సంస్కృతిలో వివాహము కూడ ఒక సంస్కారము.దీనివలన మానవుడు పుట్టుక చేతనే ఋణపడియున్న దేవ, పితృ,ఋషి ఋణములలో పితృ ఋణమునుండి విముక్తుడగును.

కామము-గంధర్వశక్తి : ఉత్పత్తి, ప్రకృతి నడుపుటకు జీవరాసులే ఉపకరణ సాధనములు. జీవులచే దీనిని నడిపించుటకు, ప్రకృతి స్త్రీ పురుషుల ఆకర్షక శక్తిని ఉత్పత్తి చేయుచున్నది. దీనిని ప్రాచీనులు వివాహమునకు సంబధించిన గంధర్వుడు అని అన్నారు. గంధర్వుడగు శక్తి సోముడనబడు గ్రహాక్షరము యొక్క శక్తిపై ఆధార పడి వర్తించును. సోముడు చంద్రుని ద్వారా జీవులపై వ్యాపించి వయస్సు , లావణ్యము, ఆకర్షణము మున్నగు మనోధర్మములను కలిగించును. ఈ మనోధర్మములను ప్రకృతి మార్గము ననుసరించి పరమార్ధ సాధనములుగా వినియోగించుకొను సంస్కార మార్గమే మనువు మున్నగువారు రూపకల్పన చేసిన మంత్రపూజ, వివాహమార్గము, సంస్కారమునకు లొంగక విచ్చ్లవిడిగా వర్తించు వారి మనశ్శరీరములను ఈ గంధర్వ శక్తి యగు కామమే తుఫాను గాలిలో నావ వలె ధ్వంసము చేయును.

గృహస్థాశ్రమము ఉత్తమమైనది : ఋషుల సంప్రదాయమున దాంపత్యమునకు మానవుడు అందించు పారితోషికమే కామము, అనగా సృష్టికొరకు, ధర్మబధ్ధ మైన వంశాభివృధ్ధి కొరకు సంతానమును పొందు యజ్ఞకర్మయే కామమునకు ప్రయోజనము గాని ఇంద్రియలాలసతకుగాదుఅని చెపుతుంది.. కావుననే పూర్వము స్త్రీ, పురుషులు గ్రహములచే నిర్ణయింపబడిన కాలములందే సంభోగ ప్రక్రియను జరిపి మిగతా కాలమందు సహచరులుగా పని పాటలు చేసుకొనెడి వారు. గృహస్ఠాశ్రమము సంతతి పొందుటకు సంస్కార బధ్ధమైన ఏర్పాటు, కావున నాలుగు ఆశ్రమములలో ఉత్తమమైనదిగాఎంచబడినది. దాని పవిత్రత నిలుపుటకై స్త్రీకి పాతివ్రత్యము, పురుషునకు ఏక పత్నీ వ్రతము నియమితములైనవి.

కొసమెరుపు
దక్షిణ ఆసియా మరియు బంగ్లాదేశ్ లోని కొన్ని ప్రాంతాలలో పెళ్ళి భోజనం అయిన తర్వాత " మాలా బందాల్ " అనే ఆచారం ఉంది.
వధూవరులపై ఒక సన్నటి వస్త్రాన్ని కప్పుతారు. ఆ వస్త్రం చాటున బొరానీ అను ఒక రకమయిన పానీయాన్ని ఒకరికి మరొకరు త్రాగిస్తూ.....
క్రిందనున్న అద్దమ్లో తమ ప్రతిబింబాన్ని చూసి ఒకరినొకరు అడుగుతారు.

నువు ఏం చూస్తూన్నావు ?

ప్రేమ పూరక స్పందన :-) " నా శేష జీవితాన్ని "
ఆ తర్వాత వధూవరులు దండలు మార్చుకుంటారు. అయితే ఈ మధ్య కాలం లో ఉంగరాలు కూడా మార్చుకుంటూన్నారు.


హిందూ వివాహంలో రకాలు.... మరో టపాలో....

Sunday, October 18, 2009

పెళ్ళి పుస్తకం

ప్రపంచంలో ఏ మతం లోను లేని విభిన్న ఆచారాలు, వ్యవహారాలు , నియమాలు, కట్టుబాట్లు, మన హిందూ మతం లో ఉన్నాయి అనడం లో సందేహం లేదు.
హిందూ ధర్మ శాస్త్రంలో వివాహము ఒక పవిత్ర బంధమే కాని ఒప్పందం కాదు. ఒక జీవిత కాలపు అనుబంధం. ఒకే భార్య, భర్త అనే ఒక నియమానికి స్త్రీ, పురుషులు కట్టుబడివున్న ఒక సామోజిక బంధం దాంపత్యం ఒక సృష్ఠి కార్యం.

మానవుని జీవితం లోని నాలుగు దశలలోని రెండవ దశ గృహస్తాశ్రమము.
హిందువునికి వివాహము పితృ ఋణము తీర్చుకునే అనేక సాధనాలలో ఒకటి గా చెప్పబడుచున్నది.
హిందూ సిధ్ధాంతం లో వివాహం ఆధ్యాత్మిక పరిణితి కే గాని మానవ అవసరానికి కాదని కూడ చెప్పబడుచున్నది.

వివాహ మను ప్రక్రియ ద్వారా ఆత్మ బంధువులైన స్త్రీ,పురుషులు ప్రేమానురాగాలతో వారి బంధాన్ని బలోపేతం చేసుకుంటారు.

వివాహం వివిధ మతాలలో వివిధ రకాలుగా జరుగుతుంది. మతమేదయినా విధానమేదయినా వివహబంధం లోని పరమార్ధంలో మాత్రం ఏమాత్రం వ్యత్యాసాలు కనిపించవు.
చాలామందికి తమ తమ మతాల్లోని వివాహ ప్రక్రియలోని ఆచారాల గురించి, రకరకాల తంతుల గురించి తెలియక పోవచ్చు .

ప్రపంచం లోని ప్రధాన మతాల్లో జరిగే వివాహ విధానాల గురించి వాటి ప్రాశస్త్యము గురించి ఇక్కడ తెలుసుకుందాం.
ఇవన్నీ ఆయా మత గ్రంధాలను చదివి, మత పెద్దలను అడిగి తెలుసుకున్నవే గాని నా స్వంత అభిప్రాయాలు కావని మనవి. మొదటగా హిందూమతం లోని వివాహం గురించి తెలుసుకుందాం.
హిందూ వివాహ : ప్రాశస్త్యము.
ఒకటవ భాగము
వివాహ: శబ్దార్ధం :
సంస్కృత భాషలో " వహ్ " అనే ధాతువునకు ప్రాపణం అర్ధంగా చెప్పుతారు. ప్రాపణమంటే పొందించడం. వి + వహ్ + షుయ్= వివాహా: " ఆ" ధాతువునకు విశేషార్ధకమైన " వి" అనే ఉపసర్గ చేర్చి " షుయ్ " అనే ప్రత్యయాన్ని చేరిస్తే ' వివాహం ' అనే పదం ఏర్పడింది. అంటే వివహా: పదానికి విశేష ప్రాపణం - ప్రత్యేకమైన సమర్ప్ణ అని అర్ధం. అది అనేక విధాలుగా ఉంటుంది. ఒకే అణువులోంచి రెండు భాగాలుగా విడిపోయిన దంపతులను తిరిగి ఒకరివద్దకింకొకరిని చేర్చుటయని కాని, అగ్ని హాత్రాది సాక్షి గా ఈ కన్య భవిష్యజ్జీవిత లత కల్లుడుగా ఉండి ధర్మార్ధ కామాలనే పురుషార్ధాలను సమానంగా అనుభవింప జేస్తానని వరుడు ఆమె నిర్వహణ గురించి ప్రతిజ్ఞ చేసి శుభసంప్రదాయమని కాని, అనేక రకాలుగా దాన్ని నిర్వచిస్తారు.
ఈ వివాహా: పదానికి 1. పరిణయం 2. ఉద్వాహాం 3. కల్యాణం 4. పాణి గ్రహణం 5. పాణిపీడనం
6. పాణిబంధం 7. దారోపసంగ్రహం 8. దారపరిగ్రహం 9. దార కర్మ 10. దారక్రియ
అనేవి ప్రసిధ్ధ సంస్కృత పర్యాయ పదములు.

మరో టపాలో మరికొంచెం....


కొసమెరుపు

ఆఫ్రికాలోని కొన్ని గిరిజన తెగలలో వివాహాలు చాలా విచిత్రంగా జరుగుతాయి. బహుసా ప్రపంచమ్లో ఏ తెగలోనూ ఇటువంటి వివాహాలు జరగవేమో.
అమెరికన్ సివిల్ వార్ జరుగుతున్నకాలం లోదక్షిణాఫ్రికా బానిసల వివాహాలను అనుమతించేవారు కాదు.ఆ సమయం లో దక్షిణాఫ్రికా మారుమూల ప్రాంతాలలో సాంప్రదాయ వివాహ ప్రక్రియకి
ప్రత్యామ్నాయంగా ఈ ఆచారం పుట్టిందని చెపుతారు.

ఇంతకీ ఈ తంతు ఏమంటే " చీపురు మీదనుండి గెంతడం " విచిత్రం గా ఉందికదూ..
చీపురు ఒకటి నేల మీద పెడతారు. దాని మీదనుంచి వధూవరులు గెంతడమే. పాతని తుడిచి కొత్తని ఆహ్వానించడం, ఒంటరి జీవితాన్ని వదలి జంట జీవితాన్నిఅనుభవించడం ఇందులోని పరమార్ధం.


Saturday, October 3, 2009

ఎక్కడున్నావు....?

ఎక్కడున్నావు.....?

ఎక్కడున్నావు ప్రియా....
తల్లి చన్మొన వైపు చూసే శిశువులా
నీ శ్వేత సౌధమ్లో నీవైపే చూస్తున్న
మొక్కలకి నీరు పోస్తూన్నావా ?

నీ మదిలో నిలిపిన
సౌశీల్య మూర్తికి
నా ఆత్మని,హృదయాన్ని
త్యాగం చేస్తున్నావా ?


సత్యాన్వేషణ గ్రంధాలలో
దివ్య జ్ఞానివై నిక్షిప్తమై ఉన్నావా ?
ఆలయాల్లో ప్రార్ధిస్తూన్నావా?
నీ కలల సాకారానికి
ప్రకృతిని ఆరాధిస్తూన్నావా ?


గుడిశె గుండెల దైన్యాన్ని
నీ మధుర వచనాలతో స్పర్శిస్తూ
దాతృత్వంతో వాని
దోశిలి నింపుతూన్నావా ?


నీకు జ్ఞాపకముందా ?
మనం కలిసిన ఆ రోజు
తేజోమయమయిన నీ శక్తి
మనల్ని ఆవహించిన వేళ
ప్రేమ దేవతలు తేలియాడుతూ
నిన్ను కొనియాడుతున్నారు...

నీకు గుర్తుందా ?
హృదయాన్ని
గాయాల్నుండి కాపాడే
హృదయ కోశము వలే
మానవతా వృక్షపు చల్లని నీడలో
మనల్ని మనం రక్షించుకున్నట్లు...


మనలోనే మనం దాగి పోతూ
ఒకరిలో మరొకరు ఒదిగిపోతూ
చేయి చేయి కలుపుకుంటూ
అడివంతా అలుముకున్న
మన అడుగులు
నీకు గుర్తేనా ?


నీకు వీడ్కోలు ఇచ్చినపుడు
నా పెదవులపై ముద్దాడినట్లు
నీకు గుర్తుందా ?
ప్రేమతో బంధించిన
అధరాలు... తెలుపలేని
మర్మాలెన్నో తెలిపినవి
అదొక దీర్ఘ శ్వాశకు
ఊపిరి పోసింది.
ఆధ్యాత్మిక ప్రపంచమ్లోకి
నను తీసుకెళ్ళి
మలి కలయిక వరకూ
స్వస్థత పరచింది...


నీవు నను మరి మరి
ముద్దాడుతూన్నపుడు,
నీ బుగ్గలపై కన్నీరు
జాలువారుతూన్నపుడు...
నీలో రగులుతున్న
వేడి నిట్టూర్పులు
నాకింకా గుర్తున్నాయి
ఈ అలలు నాలాగునే
ఎన్ని మార్లు తీరాన్ని
ముద్దాడినా
తనివి తీరదు...

ప్రేమ పొత్తిళ్ళలో
మన ఆత్మలు సురక్షితంగా
కలిసే ఉంటాయి
మరణం సంభవించి
భగవంతుణ్ణి చేరేవరకూ...

నిష్క్ర మించు ప్రియా
ప్రేమదేవత నిన్ను
ప్రతినిధిగా
ఎంచుకొంది
ఆ సౌందర్య రాశి
జీవన మాధుర్యపు
పాత్రికను తన
ఆశ్రితులకి అందిస్తూంది...
నా రిక్త హస్తాలకి
నీ ప్రేమ
ఒక సాంత్వన
నీ జ్ఞాపకం
ఒక శాశ్వత బంధం


నా మరో... నేనువి.. నువ్వు
ఈ నిశీధి నీడలలో
మేల్కొని ఉన్నావా?
ఈ శీతల తెమ్మెరలు
నా హృదయ
ప్రతి..స్పందననీ
తెలుపనీ...

నా ముఖాన్ని
నీ స్మృతులలో
లాలిస్తూన్నావా?
ఆ రూపం
నాదెంతమాత్రమూ కాదు
విషాదపు నీలి నీడలు
నన్ను పరాన్ముఖుణ్ణి చేసాయి...


కన్నీళ్ళతో శుష్కించిన
నా కనులు
నీ రూపాన్ని
ప్రతిబింబించాయి
తడారిన నా పెదవులపై
నీ ముద్దులు
తేనెలొలికించాయి...

ఎక్కడున్నావు ప్రియా?
సముద్ర ఘోషను మించిన
నా వేదనని వింటూన్నావా?


నా చివరి శ్వాసని
నీ దరికి చేర్చగలిగే శక్తి
ఈ గాలికి ఉందా?
నా అభ్యర్ధనని
రహశ్యంగా చేరవేసే శక్తి
ఏ దేవతకైనా ఉన్నదా?


ప్రియా... నీ రాహిత్యం
నను నిర్వీరుణ్ణి చేసింది
శోక దేవత తన హృదయంపై
నను పోత పోసుకుంది
వేదన నను జయించింది...



నీ చిరు దరహాసాన్ని
వ్యాపించనీ
అది చేరి నను
జీవింపచేస్తుంది.
నీ సువాసనలని
ఈ గాలిలో వెదజల్లు
అవి చేరి నేను
పునర్జీవుణ్ణవుతాను...


నీకు తెలుసా ప్రియా
ఈ ప్రకృతికి ఎంత స్వార్ధమో
అందమైన వన్నీ
తనతోనే ఉంచుకుంటుంది
అందరూ తననే
ఆరాధించాలనేమో..
నీవు కూడా అంతే కదూ...


ఎంత గొప్పది ప్రేమ !
యుగ యుగాలుగా
వశం కాని దేది?
దాని ముందు నేనెంత?