Monday, October 19, 2009

పెళ్ళి పుస్తకం.. రెండో భాగం

హిందూ వివాహ ప్రాశస్త్యము

రెండవ భాగము
మహర్షిభిర్మంగళశీలవద్భి:
ఆభ్యూహితో నుష్ఠిత ఆదరేణ

చిరాదయం విశ్వజనీన ఆర్యా:
వివాహసందా నితరాం సమింధామ్||


భావం:- ఓ పూజ్యులారా ! వివాహమార్గమును రూపొందించినవారు శుభకరమైన శీలముగల మహర్షులు.
ఇది విశ్వజనీనము, ఇట్టి ఈ వివాహమార్గము ఆచంద్రార్కము మిక్కిలి ప్రకాశించు గాక!

ఉపోద్ఘాతము : దాంపత్యము సృష్ఠి ధర్మము. ఇది సర్వ జీవులకు సమానము. అందు మానవులకు బుధ్ధి ప్రసాదింపబడెను.
గనుక సంస్కారయుతమైన, ధర్మబధ్ధమైన జీవితము గడుపుట వారి కర్తవ్యమైనది. అదియే సుఖమును, ఆనందమును గలిగించును.హిందూ సంస్కృతిలో వివాహము కూడ ఒక సంస్కారము.దీనివలన మానవుడు పుట్టుక చేతనే ఋణపడియున్న దేవ, పితృ,ఋషి ఋణములలో పితృ ఋణమునుండి విముక్తుడగును.

కామము-గంధర్వశక్తి : ఉత్పత్తి, ప్రకృతి నడుపుటకు జీవరాసులే ఉపకరణ సాధనములు. జీవులచే దీనిని నడిపించుటకు, ప్రకృతి స్త్రీ పురుషుల ఆకర్షక శక్తిని ఉత్పత్తి చేయుచున్నది. దీనిని ప్రాచీనులు వివాహమునకు సంబధించిన గంధర్వుడు అని అన్నారు. గంధర్వుడగు శక్తి సోముడనబడు గ్రహాక్షరము యొక్క శక్తిపై ఆధార పడి వర్తించును. సోముడు చంద్రుని ద్వారా జీవులపై వ్యాపించి వయస్సు , లావణ్యము, ఆకర్షణము మున్నగు మనోధర్మములను కలిగించును. ఈ మనోధర్మములను ప్రకృతి మార్గము ననుసరించి పరమార్ధ సాధనములుగా వినియోగించుకొను సంస్కార మార్గమే మనువు మున్నగువారు రూపకల్పన చేసిన మంత్రపూజ, వివాహమార్గము, సంస్కారమునకు లొంగక విచ్చ్లవిడిగా వర్తించు వారి మనశ్శరీరములను ఈ గంధర్వ శక్తి యగు కామమే తుఫాను గాలిలో నావ వలె ధ్వంసము చేయును.

గృహస్థాశ్రమము ఉత్తమమైనది : ఋషుల సంప్రదాయమున దాంపత్యమునకు మానవుడు అందించు పారితోషికమే కామము, అనగా సృష్టికొరకు, ధర్మబధ్ధ మైన వంశాభివృధ్ధి కొరకు సంతానమును పొందు యజ్ఞకర్మయే కామమునకు ప్రయోజనము గాని ఇంద్రియలాలసతకుగాదుఅని చెపుతుంది.. కావుననే పూర్వము స్త్రీ, పురుషులు గ్రహములచే నిర్ణయింపబడిన కాలములందే సంభోగ ప్రక్రియను జరిపి మిగతా కాలమందు సహచరులుగా పని పాటలు చేసుకొనెడి వారు. గృహస్ఠాశ్రమము సంతతి పొందుటకు సంస్కార బధ్ధమైన ఏర్పాటు, కావున నాలుగు ఆశ్రమములలో ఉత్తమమైనదిగాఎంచబడినది. దాని పవిత్రత నిలుపుటకై స్త్రీకి పాతివ్రత్యము, పురుషునకు ఏక పత్నీ వ్రతము నియమితములైనవి.

కొసమెరుపు
దక్షిణ ఆసియా మరియు బంగ్లాదేశ్ లోని కొన్ని ప్రాంతాలలో పెళ్ళి భోజనం అయిన తర్వాత " మాలా బందాల్ " అనే ఆచారం ఉంది.
వధూవరులపై ఒక సన్నటి వస్త్రాన్ని కప్పుతారు. ఆ వస్త్రం చాటున బొరానీ అను ఒక రకమయిన పానీయాన్ని ఒకరికి మరొకరు త్రాగిస్తూ.....
క్రిందనున్న అద్దమ్లో తమ ప్రతిబింబాన్ని చూసి ఒకరినొకరు అడుగుతారు.

నువు ఏం చూస్తూన్నావు ?

ప్రేమ పూరక స్పందన :-) " నా శేష జీవితాన్ని "
ఆ తర్వాత వధూవరులు దండలు మార్చుకుంటారు. అయితే ఈ మధ్య కాలం లో ఉంగరాలు కూడా మార్చుకుంటూన్నారు.


హిందూ వివాహంలో రకాలు.... మరో టపాలో....

3 comments:

  1. శ్రీనిక గారు ముందుగా ఇలంటి మంచి శ్లొకన్ని దాని బావాన్ని చెప్పినందుకు కృతజ్ఞతలు మరియు అబినందనలు.....

    స్త్రీ కి "పాతివ్రత్యమూ"....పురుషుడికి "ఎక పత్నీ వ్రతమూ" నియమింపబద్దయని చెప్పరు అందుకు మిమ్మల్ని చాలా చాలా మెచ్చుకొవాలి ఎందుకంటె ఎవ్వరి నొతివెంట విన్న "పాతివ్రత్యమూ"
    అనే మాట తప్ప "ఎక పత్నీ వ్రతమూ" అనె మాటె వినబడదు అస్సలు మర్చిపొయారు లెండి మగవాళ్ళు. దనిని మీరు చాన్నల్ల తరవాథ మళ్ళీ గుర్థుచెసారు కద అందుకె మీకు చాలా చాలా మెచ్చుకొలు నా తరఫునుంచి.

    మరొక్క విషయం
    "ఋషుల సంప్రదాయమున దాంపత్యమునకు మానవుడు అందించు పారితోషికమే కామము, అనగా సృష్టికొరకు, ధర్మబధ్ధ మైన వంశాభివృధ్ధి కొరకు సంతానమును పొందు యజ్ఞకర్మయే కామమునకు ప్రయోజనము గాని ఇంద్రియలాలసతకుగాదుఅని చెపుతుంది"

    ఇవన్నీ దర్మ సూత్రాలే కాని ఆది నుంచీ ఆచరిస్థున్నవి కావు ఇప్పుదు ఎవ్వరూ ఆచరిస్థున్నవీ కావు...

    వీటిలో కూఒడా కొన్ని ఆచరించ తగనివి ఉన్నయని నా అబిప్రాయం....

    tholiadugu.blogspot.com

    ReplyDelete
  2. good research.

    your presentation is excellent.
    giving exotic customs is interesting

    ReplyDelete
  3. @కార్తీక్ గారు,
    మంచి కామెంటు ఇచ్చినందుకు ధన్యవాదములు,
    చరిత్ర పుటలు తిరగేస్తే పురుషాధిఖ్య సమాజమే అన్ని కాలాల్లోనూ కనిపిస్తుంది. భార్యలు మాత్రం పతివ్రతలై ఉండాలి. వారెలా ఉన్నా లోపం కాదు అని స్త్రీని శాశించే స్థాయికి సమాజం చేరుకుంది.
    ధర్మ సూత్రాలే కాని.....
    ఆది నుంచి ఆచరించక పోవడమనేదిలేదు. మనకు అనేక మంది రచించిన రామాయణాలు అందుబాటులో ఉన్నాయి. బాలకాండలో సీతారాములవారి కళ్యాణ ఘట్టములో ఈ ధర్మం ప్రస్తావన ఉంది.
    నిజానికి మన కళ్యాణాలలో చదివే అనేక మంత్రాలు వశిష్ట విశ్వామిత్రుల వారి ఆధ్వర్యంలో్ వామదేవాది వేదవేత్తలు ప్రవచించినవే.
    వీటిగురించి మరింత వివరంగా ముందు ముందు టపాలలో....
    అంతెందుకు..ఇప్పటికీ కూడా మన వివాహాల్లో శోభనం అనే తంతు
    ఒక శుభ ముహూర్తం లో జరిపించడం ఒక నిదర్శనం కాదంటారా ?
    కాలమాన పరిస్థితులకు కొన్ని సవరణలు సమంజసం అని నా అభిప్రాయం....

    @ బొల్లోజు బాబా గారు.
    It's very nice of you sir,
    your comment is really encouraging and building more confidence.

    ReplyDelete