Saturday, October 3, 2009

ఎక్కడున్నావు....?

ఎక్కడున్నావు.....?

ఎక్కడున్నావు ప్రియా....
తల్లి చన్మొన వైపు చూసే శిశువులా
నీ శ్వేత సౌధమ్లో నీవైపే చూస్తున్న
మొక్కలకి నీరు పోస్తూన్నావా ?

నీ మదిలో నిలిపిన
సౌశీల్య మూర్తికి
నా ఆత్మని,హృదయాన్ని
త్యాగం చేస్తున్నావా ?


సత్యాన్వేషణ గ్రంధాలలో
దివ్య జ్ఞానివై నిక్షిప్తమై ఉన్నావా ?
ఆలయాల్లో ప్రార్ధిస్తూన్నావా?
నీ కలల సాకారానికి
ప్రకృతిని ఆరాధిస్తూన్నావా ?


గుడిశె గుండెల దైన్యాన్ని
నీ మధుర వచనాలతో స్పర్శిస్తూ
దాతృత్వంతో వాని
దోశిలి నింపుతూన్నావా ?


నీకు జ్ఞాపకముందా ?
మనం కలిసిన ఆ రోజు
తేజోమయమయిన నీ శక్తి
మనల్ని ఆవహించిన వేళ
ప్రేమ దేవతలు తేలియాడుతూ
నిన్ను కొనియాడుతున్నారు...

నీకు గుర్తుందా ?
హృదయాన్ని
గాయాల్నుండి కాపాడే
హృదయ కోశము వలే
మానవతా వృక్షపు చల్లని నీడలో
మనల్ని మనం రక్షించుకున్నట్లు...


మనలోనే మనం దాగి పోతూ
ఒకరిలో మరొకరు ఒదిగిపోతూ
చేయి చేయి కలుపుకుంటూ
అడివంతా అలుముకున్న
మన అడుగులు
నీకు గుర్తేనా ?


నీకు వీడ్కోలు ఇచ్చినపుడు
నా పెదవులపై ముద్దాడినట్లు
నీకు గుర్తుందా ?
ప్రేమతో బంధించిన
అధరాలు... తెలుపలేని
మర్మాలెన్నో తెలిపినవి
అదొక దీర్ఘ శ్వాశకు
ఊపిరి పోసింది.
ఆధ్యాత్మిక ప్రపంచమ్లోకి
నను తీసుకెళ్ళి
మలి కలయిక వరకూ
స్వస్థత పరచింది...


నీవు నను మరి మరి
ముద్దాడుతూన్నపుడు,
నీ బుగ్గలపై కన్నీరు
జాలువారుతూన్నపుడు...
నీలో రగులుతున్న
వేడి నిట్టూర్పులు
నాకింకా గుర్తున్నాయి
ఈ అలలు నాలాగునే
ఎన్ని మార్లు తీరాన్ని
ముద్దాడినా
తనివి తీరదు...

ప్రేమ పొత్తిళ్ళలో
మన ఆత్మలు సురక్షితంగా
కలిసే ఉంటాయి
మరణం సంభవించి
భగవంతుణ్ణి చేరేవరకూ...

నిష్క్ర మించు ప్రియా
ప్రేమదేవత నిన్ను
ప్రతినిధిగా
ఎంచుకొంది
ఆ సౌందర్య రాశి
జీవన మాధుర్యపు
పాత్రికను తన
ఆశ్రితులకి అందిస్తూంది...
నా రిక్త హస్తాలకి
నీ ప్రేమ
ఒక సాంత్వన
నీ జ్ఞాపకం
ఒక శాశ్వత బంధం


నా మరో... నేనువి.. నువ్వు
ఈ నిశీధి నీడలలో
మేల్కొని ఉన్నావా?
ఈ శీతల తెమ్మెరలు
నా హృదయ
ప్రతి..స్పందననీ
తెలుపనీ...

నా ముఖాన్ని
నీ స్మృతులలో
లాలిస్తూన్నావా?
ఆ రూపం
నాదెంతమాత్రమూ కాదు
విషాదపు నీలి నీడలు
నన్ను పరాన్ముఖుణ్ణి చేసాయి...


కన్నీళ్ళతో శుష్కించిన
నా కనులు
నీ రూపాన్ని
ప్రతిబింబించాయి
తడారిన నా పెదవులపై
నీ ముద్దులు
తేనెలొలికించాయి...

ఎక్కడున్నావు ప్రియా?
సముద్ర ఘోషను మించిన
నా వేదనని వింటూన్నావా?


నా చివరి శ్వాసని
నీ దరికి చేర్చగలిగే శక్తి
ఈ గాలికి ఉందా?
నా అభ్యర్ధనని
రహశ్యంగా చేరవేసే శక్తి
ఏ దేవతకైనా ఉన్నదా?


ప్రియా... నీ రాహిత్యం
నను నిర్వీరుణ్ణి చేసింది
శోక దేవత తన హృదయంపై
నను పోత పోసుకుంది
వేదన నను జయించింది...



నీ చిరు దరహాసాన్ని
వ్యాపించనీ
అది చేరి నను
జీవింపచేస్తుంది.
నీ సువాసనలని
ఈ గాలిలో వెదజల్లు
అవి చేరి నేను
పునర్జీవుణ్ణవుతాను...


నీకు తెలుసా ప్రియా
ఈ ప్రకృతికి ఎంత స్వార్ధమో
అందమైన వన్నీ
తనతోనే ఉంచుకుంటుంది
అందరూ తననే
ఆరాధించాలనేమో..
నీవు కూడా అంతే కదూ...


ఎంత గొప్పది ప్రేమ !
యుగ యుగాలుగా
వశం కాని దేది?
దాని ముందు నేనెంత?






8 comments:

  1. చాలా బాగుంది. చాలా కాలానికి నా "కాలంతో సాగే నా ఈ గానం, కాదనవనే నీకు అంకితం!" http://maruvam.blogspot.com/2009/03/blog-post_09.html తెరిచి చదువుకున్నాను.

    ReplyDelete
  2. ప్రతి జీవినీ పలకరింపచేసేది
    ఆశలన్నింటినీ రేకెత్తింపచేసేది
    అలసిన హ్రుదయానికి హాయి నిచ్హేది
    అణువణువు ధారపోసేది
    ఈ ప్రక్రుతిలో విలీన మైన ప్రేమ కోసమే .....
    మనసులో స్థిరపడిపోయిన ప్రేమ ఎలా విడి పోతుంది!
    మనసులోని ప్రేమ ఎక్కడికి పోతుంది?

    ReplyDelete
  3. కవిత బాగుంది శ్రీనిక గారు.

    మీ చేప పిల్లలు చాలా బాగానచ్చేశాయి. ఎంతంటే వెంటనే నా బ్లాగ్ లో పెట్టుకునేంత :-)

    ReplyDelete
  4. నేను మీ బ్లాగు కి కొత్త అండి.
    నీకు తెలుసా ప్రియా
    ఈ ప్రకృతికి ఎంత స్వార్ధమో
    అందమైన వన్నీ
    తనతోనే ఉంచుకుంటుంది
    అందరూ తననే
    ఆరాధించాలనేమో..
    నీవు కూడా అంతే కదూ...

    ఈ లైన్లు చాలా చాలా బాగున్నయండి

    కాని ఒక్క విష్యం పృకౄతి లో ఎన్ని అందాలున్నా అవి కూడా స్త్రీ అందానికి బందీలు కావలసిందెనేమో.

    ReplyDelete
  5. అమ్మో!!! ఎంత బాగారాసారండి!

    ReplyDelete
  6. మీ సైట్ జల్లెడ, కూడలి, హారంలో కలపలేదనుకుంటా, అక్కడ అప్ డేట్ రావటం లేదు.

    ReplyDelete
  7. నా చివరి శ్వాసని
    నీ దరికి చేర్చగలిగే శక్తి
    ఈ గాలికి ఉందా?

    ఈ లైన్లు మాత్రం అద్భుతం. మిగతా కవితలో కొంత క్లుప్తత సాధించవచ్చు. మంచి కవిత్వం చదవండి.

    ReplyDelete