Showing posts with label హిం దూ వివాహాలు.. Show all posts
Showing posts with label హిం దూ వివాహాలు.. Show all posts

Sunday, April 10, 2022

పెళ్ళిలో జీలకర్ర, బెల్లం ఎందుకు ? పద్నాల్గవ భాగం

వివాహ ప్రక్రియ లోని ముఖ్యమయిన వాటికి వివరణ పెళ్ళిపుస్తకం..14 వ భాగం. కాశీకి పోవుట: బ్రహ్మచారి చదువు ముగిసిన పిమ్మట గురువు ఆజ్ఞగొని యాత్రకు మరలుట (సమావర్తనము) ఒక ఆచారముగా ఉండేది (ఇప్పటికీ కొన్ని వర్ణాలలో ఈ తంతు ను చూడగలం). ఆ యాత్ర ఒక సమ్వత్సరం పరిమితి ఉండేది. ఆ దీక్షలో గురువు శిష్యునకు క్షురకర్మ(గుండు గీయించి) చేయించి, నూతన వస్త్ర ధారణ గావించి తర్వాత గురుదక్షిణ, దానితో ఆవును, దూడను, ఎద్దును స్వీకరించి సమావర్తనము చేయిస్తారు. ఈ సమయమున గొడుగు, చెప్పులు మొదలగు సామాగ్రిని సంసిధ్ధము చేసికొని, గురువునకు ఈ సామాన్లని దానము చేసి, బ్రాహ్మణులను పూజించి ప్రతి లోపమునకు ప్రాయశ్చిత్తముగా వారి అనుగ్రహమును పొంది బయలుదేరవలెను. ఈ తంతునే కాశీకి పోవుట అని క్లుప్తంగా అంటారు. పాద యాత్ర చేస్తున్న స్నాతకుని చేరి కన్యాదాత తన పుత్రికను దానము చేయుదననియు, అగ్నిసాక్షిగా పాణిగ్రహణము చేయుమనియు కోరును. అపుడు స్నాతకుడు కాశీ ప్రయాణము విరమించుకొని కన్యను వివాహ మాడతాడు. మధుపర్కము : వరుడు అలంకృతుడై మంగళగీతికలతో, వేదమంత్రములతో చక్కని వాహనమున పెండ్లివారి యింటికి బయలుదేరును. వీరిని ఆహ్వానించి కన్యాదాత మధుపర్కము నొసగును. వరుడు మత్రపూతకముగా మధుపర్కమును స్వీకరించును. మధుపర్కమనగా తీయని పానీయం. మధువు (తేనె)తో పాలు మొదలగు వాటిని కలిపి తయారు చేయుదురు. ఇది సేవించిన తర్వాత వరుని వస్త్రాదులతో సన్మానిస్తారు. ఇది తెలియక మధుపర్కములు అనగా పెళ్ళిలో కట్టుకొను వస్త్రములు అను పొరపాటు అభిప్రాయం నేడు వ్యాపించింది. ఇంకా విచిత్రమేమంటే " జరీ మధుపర్కములు " అను పద ప్రయోగాలు కూడా అజ్ఞానము వలన తయారయినవి. గౌరీ పూజ లేదా లక్ష్మీపూజ : వధువు ఈ పూజ చేయుట వలను వధువునకు మాంగల్యాభివృధ్ధి కలుగును. కన్యాదాత వరుని పూజించుట : కన్యాదాత వరుని పాదములు కడిగి పూజించును. నిజానికి వరుడు కన్యాదాత కన్నా వయసులో చిన్నవాడు. వయసులో పెద్దవాడు తనకన్న చిన్నవాని పాదములు తాకుట, కడుగుట సామాన్యముగా లోకాచారము కాదుగాని, ఇది వివాహములో ఆచారము. దీనికి కారణము మంత్రములలో చెప్పబడింది. ఇక్కడ వరుడు లక్ష్మీనారాయణ స్వరూపుడు. ఇతడిని పూజించి, కాళ్ళని కడిగి, జలధారతో కన్యను దానమిచ్చుట (కన్య ధారపోయుట) మహాభాగ్యముగా భావించబడును. జీలకర్ర, బెల్లము : శుభముహూర్త సమయమున వధూవరుల మధ్య తెరతొలగిస్తారు. ఒకరినొకరు చూసుకున్న తరువాత జీలకర్ర , బెల్లము కలిపిన ముద్దను ఒకరి తలపై ఒకరు నిలిపి చేతితో తాకుతారు. పూర్వకాలములో పదార్ధ విజ్ఞాన శాస్త్రవేత్తలు (Material Scientists) జీలకర్ర బెల్లము కలిపి నూరినా, నలిపినా ధన సంజ్ఞక విద్యుత్తు (Positive electric charge) ఉత్పత్తి అగునని వర్ణించారు. జీలకర్ర బెల్లముతో ఘర్షణ చేస్తే అలాగే జరుగునని నిరూపించ బడింది. వేద కల్పము తెలిసిన పెద్దలు దీనిని గ్రహించి వధూవరుల పరస్పర జీవశక్తుల ఆకర్షణకు తోడ్పడునట్లుగా జీలకర్ర బెల్లము తాకుట ఒక ఆచారముగా చేసారు. దీనివలన దృష్టి కలుపుట, మనస్సు సంకల్పించుట సంభవించునని నమ్మకము. అరుంధతి దర్శనము : వివాహ ప్రక్రియలో వధూవరులను అరుంధతీ దర్శనం చేయిస్తారు. అరుంధతి అనగా ఎటువంటి పరిస్థితిలోనూ ధర్మమునకు హాని కలిగింపనిది అని అర్ధం. నూతన దంపతులు కామమునకే ప్రాధాన్యమీయకుండా ధర్మమునకే ప్రాధాన్యమిచ్చి లోకములో ఆదర్శ దంపతులుగా మెలుగుటకు కావలసిన దీవెనలు అరుంధతీ వశిష్టుల దర్శనము వలన పొందింపచేయటమే మన పెద్దల ఉద్దేశ్యము. కొసమెరుపు: ఒక యువతి త్రాచుపాముతో ప్రేమలో పడి పెళ్ళాడిన ఉదంతం 07.06.2006 న రెండువేల మంది సమక్షమ్లో జరిగింది. ఒరిస్సా రాజధానికి దగ్గరలొ అటాలా పల్లెకు చెందిన బింబాలా దాస్(30) అనేయువతి తాను తాచుపాముని ప్రేమిచానని పెళ్ళాడతానని ప్రకటించింది. మూఢనమ్మకాలకు నిలయమైన ఆ గ్రామ ప్రజలు పాము పుట్ట పక్కనే వివాహ వేదిక చేసి మంత్రోఛ్ఛారణతో తంతు నిర్వహించారు. వరుడు (పాము) పాపం ఎంతకీ పుట్టలోంచి రాకపోవడంతో పాము లోహ ప్రతిమను పెట్టి తంతు కానిచ్చేసారు.

Saturday, October 24, 2009

పెళ్ళి పుస్తకం - మూడో భాగం.




హిందూ వివాహ ప్రాశస్త్యము.
మూడవ భాగం.

దీపావళీ దగ్గరపడిందంటేనే మనసెంతో ఆనందంగా ఉంటుంది. తర్వాత కార్తీకమాసం నిత్యపూజలు భగవన్నామస్మరణ ..మనసంతా ప్రశాంతంగా ఉంటుంది. మొదటి కార్తీక సోమవారం పూజకి సామాన్లు కొనడానికి శివాలయం వీధి వైపు బయలుదేరుతుండగా విజయ నుంచి ఫోనొచ్చింది. నా క్లాస్ మేట్. మధ్యే బదిలీ అయి వచ్చారు. ఫోను లిఫ్టు చేసాను.
హలో విజయా! బాగున్నావా?
బాగున్నానే..
నిన్న రాత్రే చాలా సేపు మాట్లాడుకున్నాం. వారం లో రెండు మూడు సార్లు ఫోనులో మాట్లాడుకుంటాం. నెలకొకసారైనా వీకెండ్ హోటల్లోనో ఎంజాయ్ చేస్తాం. అయితే ఏమిటి సంగతి ఇంత సడన్గా.
ఏమిటే విజయా!
. ఏమ్లేదే.మేము శ్రీకాకుళం లోఉన్నపుడు మా మరిది వికాశ్ లేడా. అతను అమ్మాయితో ప్రేమలో పడ్డాడే. ఎలగోలా అతని మనసు మళ్ళించి, ఇక్కడకి ట్రాంసఫర్ పెట్టించుకుని ఇక్కడకు వచ్చేసాం. కానీ ఇప్పుడు అతను ఉదయం నుంచి కనిపించట్లేదే.
అక్కడ అమ్మాయి కూడా...
లేచి పోయారా.....
హా. అంతే కావచ్చు .మాకేమో ఊరు కొత్త. స్టేషన్ లో రిపొర్టివ్వడాలు.... మీవారికి వీలైతే..
ఏయ్. ఏంటే అలా కంగారు పడి పోతావు. మేమిద్దరం బయలుదేరి వస్తున్నాం.
బజారు నించి వస్తూ..వాళ్ళింటికి వెళ్ళాం. ఇల్లంతా శ్మశాన వాతావరణం. పిల్లలకేమీ పెట్టినట్లు లేరు. మేంతెచ్చిన ప్రసాదాలు ఆబగా తినేసారు. మావారు, విజయ హస్బెండ్ బయటకి వెళ్ళిపోయారు.
విజయ వాళ్ళ పెద్దపాప తన్మయి చాల ఇంక్విసిటివ్. మెల్లగా నాదగ్గరకు వచ్చి చేరిపోయింది. ఆంటీ. పెళ్ళిళ్ళ గురించి నీకు బాగా తెలుసని అమ్మ ఎన్నోసార్లు చెప్పింది.
ఇపుడు బాబాయి ఎవరిష్ఠం లేకుండా పెళ్ళి చేసుకుంటున్నాడు కదా. ఇదేం రకమయిన పెళ్ళి. వయసుకి మించిన ప్రశ్న అయినా చెప్పాలని అనిపించింది. క్లుప్తంగా చెప్పాను.

ఇదుగో అప్పుడే విషయాలన్నీ బ్లాగులో పెట్టాలన్న ఆలోచన వచ్చింది.

మన పూర్వీకులు వివిధ రకాల వివాహాలని ఒక పద్యం లో చక్కగా పొందు పరిచారు.

బ్రాహ్మాదైవస్తదైవార్ష:ప్రాజాపత్య:తధాసుర:

గాంధర్వో రాక్షస్తశ్చైవ పైశాచశ్చాష్టయో ధమ:

1.
బ్రాహ్మం 2. దైవం 3. ఆర్షం 4. ప్రాజాపత్యం

5.
అసురం 6. గాంధర్వం 7. రాక్షసం 8. పైశాచం.

1.
బ్రాహ్మం: సర్వ లక్షణ సంపన్నుడైన వరుని ఆహ్వానించి యధాశక్తిగా
అలంకరించిన
కన్యను అతనికి ఉదక పూర్వకంగా
దానం చేస్తే అది బ్రాహ్మ వివాహ మంటారు. ఇలా వివహం చేసుకున్న దంపతులకు పుట్టిన వాడు పదితరాలకు పితృదేవతలను, పదితరాల వరకూ పుత్రాదులను, పవిత్రులను చేస్తాడు.

2.
దైవం : యజ్ఞాన్ని చేసేటప్పుడు అక్కడ ఋత్విక్కుగా వున్న వరుడికి అలంకరించిన కన్యను దానం చేయడం దైవవివాహమంటారు. ఇలా పెండ్లి చేసుకున్న వారికి పుట్టినవాడు 7 తరాల ముందువారిని, 7 తరాల తరువాత వారిని కూడా తరింపజేస్తాడు.

3.
ఆర్షం : రెండు ఆవులను తీసుకుని కన్యాదానం చేస్తే అది ఆర్షవివాహ మౌతుంది. ఇలా పెండ్లి చేసుకున్న వారికి పుట్టిన వాడు ముందు మూడు తరాలను తర్వాత మూడు తరాలను తరింపజేస్తాడు.

4.
ప్రాజాపత్యం : " కలిసి ఉండి ధర్మాన్ని ఆచరించండి " అని ప్రతిజ్ఞ చేయించి కన్యాదానం చేస్తే అది ప్రజాపత్యమౌతుంది.
ఇలా పెండ్లయినవారికి పుట్టిన వారు ముందు 6 తరాలను, తరువాత 6 తరాలను తనను కూడా తరింపచేస్తాడు.

5.
అసురం : వరుని దగ్గర డబ్బు తీసుకుని కన్యాదానం చేస్తే అది అసుర వివాహం అవుతుంది.

6.
గాంధర్వం : పరస్పరానురాగాన్ననుసరించి రహస్యంగా చేసుకునేది గాంధర్వ వివాహం.

7.
రాక్షసం : యుధ్ధం చేసి కన్యనపహరించి చేసుకుంటె అది రాక్షస వివాహం అవుతుంది.

8.
పైశాచం : కన్యను మారువేషమ్లోనో, నిద్ర పోతూండగానో అపహరిస్తే అది పైశాచ వివాహమౌతుంది.
కొస మెరుపు:
ఘనా దేశం లో ఆసాంటే అను తెగవారిలో మగవాడు వధువు ఇంటి తలుపు తడతాడు. వరుని తల్లి ,అతని మేనమామ వధువు ఇంటి కి వెళ్ళి వివాహాన్ని పర్తిపాదిస్తారు.

వివాహ స్వరూపం ....మరో టపాలో...