Showing posts with label తెలుగు కవితలు.. Show all posts
Showing posts with label తెలుగు కవితలు.. Show all posts

Sunday, November 29, 2009

మరో లోకం లో


మనం కలిసిన
ఆ మధుర క్షణాలు
ఏ కలలు, కల్పనలు లేని
మరో లోకం లో
మనం మనకోసమే
అనుకున్నాం

ఏదో ఒక రోజు
కాలం ఈ సందేశాన్ని
నీ ముందు నిలబెడుతుంది.
నీవు లేని
నన్నుని చూస్తావు
పుడమి ఎదపై ముద్దాడిన
మన పాదముద్రికలని
నువు చూడకపోవు
పొన్నాయి చెట్టుకింద
నీ వడిలో నానుదుట
రాలిన పూవు
నీ ముద్దుతో
పొందిన అమరత్వాన్ని
నువు గుర్తించకపోవు
మన గుసగుసలు
గాలి వినిపించక పోదు
కిలకిలరావాలలో
పరిమళించిన ఆశలు
వినబడకపోవు

నీ రాకకై ఈ తోట
పూల పానుపు
పరిచింది..
ఒక్క భ్రమరం కోసం
వలపు రంగులద్దుకుని
మత్తుగా నీకోసం
వేచి చూసే వేల సుమాల్లో
నను గుర్తించ గలవా ప్రియా...


Wednesday, November 11, 2009

ప్రతిసారీ మొదటిసారే....

ప్రతిసారి మొదటి సారిలా
ఏ గది మూలనో
అలజడి రేగి

రాత్రి అదే సమయానికి
కిటికీ తెరిచే సరికి
ఎదురింటి గుమ్మంలో
అఛిద్రమైన చీకట్లో
నాకోసం
నీవు...

కాలం జారిపోతూ
చిదిమిన చివరి
క్షణం నుండి
నీ కోసం
నేను...

చేరువయ్యే కొద్దీ
దూరమై
దూరమయ్యే కొద్దీ
చేరువయ్యే మనకి
ఎచటి నుండో
మూగ రాగాలు
మోసుకొస్తూంది ఆమని

నేనేనా...

విరితావులపై
ఇంద్రధనుస్సు
వలిగిపోయిందేమో...
నీ కురుల పానుపు మీద
పవళించాలని
పూలన్నీ మత్తుగా
నీ కోసం...

Sunday, September 20, 2009

మళ్ళీ వికసించనీ...


ఇదిగో ఇక్కడే
నా బాల్యం లో
సీతాకోక చిలుకలు
రెక్కల్ని రెపరెప లాడిస్తూ
ఋతువుల్ని రాల్చి వెళ్ళిపోయాయి.
కాని అవి వాలిన పూలు
నాలో ఇంకా వాడిపోలేదు....
వర్తమాన పొరల్లో
గతం ఎంత చుట్టుకుపోతున్నా
నాలో స్మృతులు మాత్రం
మంచు బిందువంత
స్వచ్చంగా ఉన్నాయి....
ఇదిగో ఇక్కడే
నా బాల్యంలో
నే నడిచిన దారుల్లో
చెరిగిపోయిన
నా పాదముద్రికలు
నాకింకా కనిపిస్తూనే ఉన్నాయి.....
అదృశ్య దృశ్యాలన్నీ
హృదయాకాశంలో
నక్షత్రాల్లా మెరుస్తూనే ఉన్నాయి.
మనసంతా
వెన్నెల వెలుగుతూనే ఉంది.....
నా బాల్యం
నా వైపొకసారి చూసి
ఎటో వెళ్ళి పోయింది
గంట మ్రోగంగానే
పరుగులు తీసిన బడి పిల్లాడిలా
నేను మాత్రం
ఖాళీ అయిన తరగతి గదిలా .....
ఓ ప్రభూ !
అన్నిటికీ పునర్జన్మ నిచ్చావు
కాలానికి తప్ప
అందమయిన ఆ పుష్పాన్ని
మళ్ళీ వికసించనీ...
మధురమయిన ఆ రోజుల్ని
మళ్ళీ ఉదయించనీ....