Thursday, April 22, 2010
ప్రపంచ పుస్తక దినోత్సవ విశేషాలు ...
ఏప్రిల్ 23 ప్రపంచ పుస్తక దినోత్సవం.
పాఠకుల్లారా ప్రపంచ పుస్తక దినోత్సవ శుభాకాంక్షలు.
ఈ రోజు ప్రపంచ పుస్తక దినోత్సవం గా పరిగణించడానికి విభిన్న కధనాలున్నా చాలా మంది ఒక ఏకాభిప్రాయానికి వచ్చిన కొన్ని అంశాలు.
1. సెవాంతెస్, షేక్సిపియర్, ఇన్కా గర్సిలాసో, వేగా అను రచయితలు 1616 ఇదే రోజున మరణించారు.
2. అంతేకాదు జోసెఫ్ ప్లా, వ్లాదిమర్, మారిస్ ద్రువాం ఇలా ఇంకా చాలా చాలా మంది ప్రపంచ ప్రఖ్యాత రచయితలు ఇదే రోజున మరణించడమో, జన్మించడమో జరగడం విశేషం.
3. ఇదే రోజున సెయింట్ జార్జ్ జన్మదినాన్ని స్పెయిన్ లో జరుపుకుంటారు. ఇప్పటికీ స్పెయిన్ లో ప్రతి పుస్తక కొనుగోలు పై ఒక గులాబీని గిఫ్ట్ గా ఇస్తారు.
ఇన్ని ప్రత్యేకతలున్న ఈ రోజును1995 లో యునెస్కో ప్రపంచ పుస్తక దినం గా ప్రకటించిండమేకాదు, ప్రపంచ పుస్తక మరియు కాపీ హక్కుల దినం గా జరపాలని, రచయితలను, ప్రచురణకర్తలను, పాఠకులను, ఉపాధ్యాయులను ఈ రోజున గౌరవించాలని సూచించింది. అంతర్జాలం, మీడియా కొంతవరకూ పుస్తకం మనుగడను అడ్డుకుంటున్నాయి. అందుకే..
పుస్తకాన్ని కొందాం. పుస్తకాన్ని బ్రతికించుకొందాం.
యుకె లోను ఐర్లాండులోను ప్రపంచ పుస్తక దినం ఒక ఘనమైన వేడుకగా జరుపుకుంటారు. ఆన్ లైన్లో రచయితలు తమ రచనలను చదివి వినిపిస్తారు. పాఠశాలలలో పుస్తక పఠనా పోటీలు నిర్వహిస్తారు. వీటినే రీడథాన్ (Readathon) అనడం విశేషం. అమెరికాలోనైతే వేల కొలది ఇ-బుక్ లను నెట్ లో పెట్టి వాటిలో కొన్ని పుస్తకాల మీద బడి పిల్లలకు ఏక్సలరేటెడ్ రీడింగ్ అనే కాంపిటీషన్ పెడతారు. (ఈ కాంపిటీషన్ ని ఈ సమ్వత్సరం మా స్కూలులో ప్రవేశ పెడుతున్నాం.)
అయితే కొన్ని దేశాలలో ఈ వేడుకను వేర్వేరు రోజుల్లో జరుపుకోవడం విశేషం. ఇది ఇంకా భారతదేశం లో అంత ప్రాచుర్యమ్లోకి రాలేదు.
అసలు ఏ పుస్తకమైనా ఎందుకు చదువుతాం. ఏం అనుభవం లోకి వస్తుంది. ఏ భావనలకు లోనవుతాం. ఏ రకమైన భావోద్రేకాలు ఎలా ఉత్ధాన స్ఠాయికి చేరుకుంటాయి. పుస్తకం లోకి నడవడమంటే... పరిచయ పాత్రలలోకి మనల్ని మనం వంపుకుంటామా ? లేదా మనలని రచయిత తనలో వంపు కుంటాడా? ఇది చాలా చక్కగా బొల్లోజు బాబా గారు తన బ్లాగులో ఒక కవితలో అంటారు..
పుస్తకం లోకి నడవడమంటే.....
ఎప్పుడో, ఎక్కడో, ఎవరో
ఒకడు
దోసెడు అక్షరాల్ని
కాలానికి అర్ఘ్యమిస్తాడు.
పిడికెడు ఆలోచనల్ని ఒడిసిపట్టుకొని
పుస్తకపుటలపై చల్లుతాడు.
ఎప్పుడో, ఎక్కడో, ఎవరో
ఒకడు
ఆ పుస్తకాన్ని తెరుస్తాడు.
ఒక జీవనది వాని గుండెల్లోకి
ప్రవహించటం మొదలౌతుంది.
ఒక సంగీతమేఘం
తేనె పాటల్ని వర్షిస్తూంటుంది.
ఆ రాగ స్పర్శకు వాని మనోయవనికపై
ఓ అపరిచిత అరణ్యం మొలకెత్తుతుంది.
వేన వేల స్వప్నాల పిట్టలు
రివ్వుమంటో ఎగిరి వచ్చి
మనో వనాన వాల్తాయి.
వసంతపు మొగ్గలు
పువ్వులుగా బద్దలవుతాయి.
పరిమళపు భ్రమరాలు ఝుమ్మంటో
వాడిని చుట్టుముడతాయి.
దివా సంధ్యలు, గెలుపోటములు,
సుఖ, దు:ఖాలు, రాగ ద్వేషాలు
అనుభూతి తరువులపై వాలిన
జంట పిచ్చుకలౌతాయి.
కెలడియోస్కోపులో ని
రంగురంగు గాజుముక్కలల్లే
అవే అక్షరాలు అసంఖ్యాక చిత్రాల్ని
ఆవిష్కరిస్తూంటాయి.
ఒక నన్నయ, ఒక వేమన, ఒక గురజాడ
లిప్తపాటు మెరిసి మాయమవుతారు.
నవరసాలూ వాటి దేహాల్ని లాక్కొచ్చి
కనుల వాకిట నిలిపి
రసావిష్కరణ జరిపిస్తాయి.
శత సహస్త్ర శిరఛ్ఛేద
ఖడ్గ పరిహాసం తళుక్కుమంటుంది.
తరాల్ని కలిపే రుధిరామృతం
కాల రేఖ పై లీలగా జారుతుంది.
*************
ఏదైనా ఓ పుస్తకంలోకి నడవటమంటే
పరిచిత పాత్రలలోకి
మనల్ని మనం ఒంపు కోవటమే కదా!
బొల్లోజు బాబా
బాబా గారికి కృతజ్ఞతలతో
Subscribe to:
Post Comments (Atom)
శ్రీనిక గారూ !
ReplyDeleteపుస్తకం నా ప్రాణం. ప్రపంచ పుస్తక మరియు కాపీరైటు దినోత్సవ శుభాకాంక్షలు. బాబా గారి కవితనందించినందుకు ధన్యవాదాలు.