సమూహం లో నేను |
ఒంటరినై పోతూంటాను
దేహం లోని రక్తనాళాలన్నీ
హృదయం లోకే చేరుకున్నట్లు
ఒక్కరొక్కరూ నాలో కలసిపోతూంటారు
అపుడు నేను అనేక నేనులుగా
విడిపోయి నన్ను నేను
ఒక్కొక్కరిలో వంపుకుంటూంటాను
నేనంటూ ఏమీ మిగలకుండా..
సమూహం లో సంచరిస్తూనే
నన్ను నేను మొలకెత్తుకుంటూ
పూలని, ముళ్ళనీ పంచిపెడుతూ
నాదికాని ప్రపంచమ్లో
నాకంటూ ఓ ప్రపంచాన్ని సృష్టించుకుంటూ
నేనొక చెట్టునవుతాను
నా నీడ నా అస్థిత్వాన్ని ప్రశ్నించినపుడు
నేనొక శుష్క సౌధాన్నవుతాను..