Sunday, August 1, 2010
పెళ్ళి పుస్తకం. 15
హిందూ వివాహ ధర్మం మీద గత కొన్ని సమ్వత్సరాలుగా చేసిన అధ్యయనం వలన ఎన్నో విషయాలు తెలిసినవి. అనేక సందర్భాలలో ఈ విషయాలను బంధుమిత్రులతో పంచుకున్నపుడు వారికెంతో ఆశక్తిని కలిగించేవి. చాలామంది మిత్రులు వీటిని పుస్తక రూపమ్లో తీసుకురమ్మని పలు విధాలుగా ప్రోత్సహించారు. కాని నాకెందుకో ఇష్టం కలగలేదు. ముద్రణకి మనసంగీకరించలేదు. ప్రత్యేకమైన కారణమేమి లేదు. అయినా వారి సలహాని త్రోసిపుచ్చలేదు. నే రాసుకున్న నోట్సు, సేకరించిన విషయాలు ఒక క్రమం లో ఉండాలని ఒక చిత్తు ప్రతిని తయారు చేసుకున్నాను. ఇది జరుగుతున్న తరుణమ్లో విదేశాల్లో ఉంటున్న మా అన్నయగారి పాపకి పెళ్ళి కుదిరింది. కాకినాడలో పెళ్ళి . పెళ్ళి పనులు కొన్ని అన్నయ నాకప్పగించాడు. వాటికోసం కాకినాడ, వైజాగ్ తిరుగుతూంటే మా బంధువుల్లో ఒక పెద్దాయన " అవున్రా చిట్టీ నీ మేనకోడల పెళ్ళి కి ఓ చిన్న పెళ్ళి పుస్తకం అచ్చువేయించి అందరకీ పంచవచ్చుకదా " అని సలహా ఇచ్చాడు. ఎందుకో ఆ ఐడియా అద్భుతంగా అనిపించింది. వెంటనే ప్రెస్ వాళ్ళని సంప్రదించి రెం డువేల కాపీలు (జేబులో పెట్టుకునే సైజులో) ముద్రించి పెళ్ళిలో అందరికీ పంచిపెట్టాను.కొన్ని తెలిసినవారికి, మా స్కూలు పేరెంట్స్ కిపంచిపెట్టాను. అందరూ ఎంతో మెచ్చుకున్నారు. ఇది జరిగి మూడు సంవత్సరాలు పైనే అయింది. నాకు తెలియని వాళ్ళు కూడా నాకు ఫోను చేసి మరీ అభినందనలు తెలిపారు. (వాళ్ళకి నా పుస్తకం ఎలా చేరిందో నాకు తెలియదు) అయినా నాకెందుకో తృప్తి కలగలేదు. ఏదో వెలితిగానే ఉండేది. ఇదుగో ఆ సందర్భం లో నా ఫ్రెండ్ మాలతి ఇవన్నీ బ్లాగులో పెట్టమని సలహా ఇచ్చింది. సో అలా గత సంవత్సరం అక్టోబరు నెలలో మొదలయిన ' నా భావనలు ' బ్లాగులో ' పెళ్ళి పుస్తకం ' అనే పేరుతో ఒక వర్గాన్ని మొదలుపెట్టాను. ప్రపంచం నలుమూలలనుండి ఎంతో మంది తెలుగు బ్లాగర్లు అభినందించారు, ఆశీర్వదించారు... అందరికీ పేరు పేరున నెనర్లు. కొందరైతే క్రిస్టియన్, ముస్లిం మత వివాహ ధర్మాలనికూడా వ్రాయమని అడిగారు. ఇది అంతర్లీనంగా నా బాధ్యతని పెంచింది. అంతకంటే ఎక్కువగా వారి సలహా నన్ను ప్రేరేపించింది. అందుకే ఇతర మతాలలో జరిగే వివాహ తంతులగురించి అధ్యయనం మొదలు పెట్టాను. ఈ రెండు నెలల అధ్యయనంలో ఎన్నో ఆశక్తికరమైన విషయాలు తెలిసాయి. అవన్నీత్వరలో మీతో పంచుకుంటాను.
మతమేదయినా వివాహ ధర్మమొకటే ' సహజీవన సౌందర్యం ' . పాశ్చాత్య నాగరికతా మోజులో పడి భారత యువత ఎంతగా భ్ర ష్టుపట్టిపోతుందో మనకి తెలియంది కాదు. ప్రేమ పేరుతో వంచనలు, దురాగతాలు అంతు లేకుండా పోతున్నాయి. భాధ్యతగల్లిన పౌరులే కాదు సమాజంలో హోదా,పరువు వున్నవారు కూడా ఈనాడు వివాహేతర సంబంధాలతో విచ్చలవిడి శృంగారాన్నిఇపుడు ఒక స్టేటస్ గా భావిస్తున్నారు. సర్వత్రా నైతిక విలువలు లోపిస్తున్నాయి.
యావత్ ప్రపంచం లోనే అత్యధిక యవశక్తి ఉన్నదేశం మన భారతదేశం. యువత సన్మార్గం లో నడుచుకుంటే భారతదేశాన్ని మించిన మరొ దేశం ఈ ప్రపంచం లో ఉండదంటే అతిశయోక్తి కాదు.
సంఘమ్లో సదాచారాలను, సాంఘిక న్యాయాన్ని విశ్వజనీనంగా ఏర్పాటుచేసి సువ్యవస్థను రూపొందిచిన వారు మన పూర్వీకులు. ప్రపంచం లో ఎక్కడా లేని వివాహ సంస్కృతి మనది. భిన్న కుటుంబం లో పుట్టి, భిన్న వాతావరణం లో పెరిగి, భిన్న అలవాట్లను, అభిప్రాయాలను కలిగి ఉన్న ఇద్దరు మనుషులను ఒక పసుపు తాడు ప్రేమానురాగాలతో ఆ జన్మాంతం కట్టిపడేసే పటిష్టమైన వివాహ బంధం మనది. మన పూర్వీకులు మనకందించిన ఈ సంస్కృతీ సంప్రదాయాలను మన ముందుతరాలకు అందిచాల్సిన బాధ్యత మనందరిది.
భారతీయ వివాహ పధ్ధతి యందలి పవిత్రత, గౌరవం , ఆశయం, ఆదర్శం ప్రపంచమందలి మరి ఏ యితర దేశమందుగాని, మతమునందుగాని గాన జాలము. ....అనిబిసెంటు.
Labels:
తెలుగు సాహిత్యం.,
పెళ్ళిళ్ళు,
వధువు,
వివాహ వేడుకలు
Subscribe to:
Posts (Atom)