Wednesday, January 12, 2011

ఖుత్బా...అంటే





గత సంవత్సరం నా బ్లాగులో పెళ్ళి పుస్తకం వర్గంలో హిందూ వివాహాలలోని ఆచార వ్యవహారాలను అందించడం జరిగింది. ఎంతోమంది వాటి గురించి తెలుసుకుని కామెంట్ల ద్వారా నన్ను ప్రోత్సహించడం నాకెంతో ఆనందాన్నిచ్చింది.

కొంతమంది వేరే మతాలలోని వివాహ వ్యవస్థ, ఆచార వ్యవహారాలను తెలియచేయమని అన్నారు. నిజమే ఇది ఇంట్రస్టింగా అనిపించింది. అప్పటినుండి ఆయా మతాల వివాహ వ్యవస్థ గురించి అధ్యయనం మొదలు పెట్టాను. వాస్తవానికి హిందూ మతంలో వివాహ వ్యవస్థ గురించి కుప్పలు తెప్పలుగా సమాచారం ఉంది. కాని ముస్లిం, క్రిస్టియన్ వివాహ వ్యవస్థ గురించి సమాచారం తెలుగులో అంతగా అందుబాటులో లేవు. ఆయా మత పెద్దలను సంప్రదించినా అంతగా ఫలితం లేకపోయింది. విషయసేకరణ కొంత కష్టమయింది. కొంతవరకూ క్రైస్తవ వివాహంలోని విషయాలు సేకరించగలిగాను కాని ముస్లిం వివాహవ్యవస్థలోని వ్యవహారమంతా అరబ్బీలోనే ఉంది. దీనిని అవసరమైనంత మేరకు తర్జుమా చేయించుకుని అర్ధాన్ని గ్రహించగలిగాను.

ఏ మతమైనా కోరేదేమిటి ? మనిషి ఇహపర జీవితాలు సుఖవంతం, శాంతిమయం, ఫలప్రదం కావాలంటే మనిషి తన ప్రాపంచిక జీవితం మొత్తాన దైవం కోరేవిధానాన్ని అనుసరించాలి. దైవాదేశాలను కేవలం ఆరాధానాలయాల నాలుగు గోడల మధ్యనే కాక సకల జీవన రంగాల్లో పాటించడం తప్పనిసరి.

ప్రతి మనిషి జీవితంలో వివాహం ఒక గొప్ప మలుపు. ఇదొక పవిత్రకార్యంగా భావిస్తారు. భగవంతుడు మానవ జాతికి మాత్రమే ప్రసాదించిన అనేక ప్రత్యేకతలలో వివాహం ఒకటి. జాతి, మతం, కులం అనే తేడా లేకుండా ఈ కార్యాన్ని ఎవరి స్థోమతని బట్టి వారు వైభవంగా జరుపుకుంటారు. చిన్న, పెద్ద, పేద, గొప్ప అనే బేధభావం లేకుండా బంధుమిత్రుల సపరివారంతో ఎంతో సందడిగా ఈ కార్యాన్ని జరుపుకుంటారు.

ఇక ముస్లిం వివాహ వ్యవహారాలు ఎలా జరుగుతాయో చూద్దాం.
ముస్లిముల జీవితం ఏ విధంగా ఇస్లామీయ జీవన వ్యవస్థకు దూరమయిపోయి ముస్లిం సమాజమే నిర్వీర్యమయి పోతుందో అదే విధంగా ముస్లిముల వివాహాది శుభకార్యాలు కూడా ఇస్లామ్ నిజ జీవితాన్ని ప్రతిబింబించడంలేదనిపించింది.

ముస్లిముల వివాహాన్ని నికాహ్ (ఉర్దూలో) అంటారు. నికాహ్ వధువు లేదా వరుడు ఇంటివద్దగాని జరుపుకుంటారు. నికాహ్ స్థల నిర్ణయం ప్రాధమికంగా వసతి సౌకర్యాల మీద ఆధార పడి ఉంటుంది. అందుకే వీరి వివాహాలు ఈ మధ్య కల్యాణ మండపాలలో కూడా జరుగుతున్నాయి.

నికాహ్ సందర్భంలో పఠించబడే అరబ్బీ ప్రసంగాన్ని సాధారణంగా ఖుత్బా అనంటారు. ఈ ఖుత్బానే మహాప్రవక్త మహమ్మద్ పెళ్ళిళ్ళలో పఠించేవారు. ఇప్పటికీ కూడా నికాహ్ జరిగినప్పుడల్లా ఈ ఖుత్బానే పఠిస్తారు.

నికాహ్ ఓ సంతోష కార్యం. మనిషి సాధారణంగా ఇలాంటి సందర్భాలలో తన్మయత్వంలో తన నిజ స్థానాన్ని విస్మరించే అవకాశం ఉంటుంది. ఈ సమయంలోనే సైతాన్ (మనిషిలోని చెడు గుణం) తన పని నెగ్గించుకునేందుకు మంచి తరుణం. ఇది మంచి పై చెడు విజయం. అందువల్లనే మహాప్రవక్త ఆచరణాత్మకంగా బోధించిన వివాహ ప్రసంగం ఎంతో శుభప్రదమయింది. అది మహా వరప్రసాదమని చెప్పవచ్చు. ఇందులో ఇహపర జీవితాలకు సంబంధించిన అసంఖ్యాకమయిన మేళ్ళు ఉన్నాయి.
వాస్తవానికి ఈ ప్రసంగాన్ని అర్ధంచేసుకోకుండా, ఓ ఆచారంగానో, లాంఛనంగానో భావిస్తున్నారు. మన జీవితాల్లో దాని భావాన్ని, ఉద్దేశాన్ని ఇనుమడింపచేసుకునే అవకాశం కనిపించుటలేదు.
మహాప్రవక్త ప్రవచించిన ఆ ప్రసంగ సారాంశాన్ని తరువాత టపాలో తెలుసుకుందాం. ..............సశేషం

3 comments:

  1. నికాహ్ కేవలం engagement లాంటిది మాత్రమే అనీ పెళ్ళి అంటే వలిమా అని నా friend చెప్పగా విన్నాను. కొంచెం వివరించగలరు.

    ReplyDelete
  2. chaalaa baagundi..manchi information ichchcaaru...

    ReplyDelete
  3. మినర్వా గారూ,
    ధన్యవాదాలు..నికాహ్ అంటే ఎంగేజ్మెంట్ కాదు.నికాహ్ అంటే వివాహం. ఇక వలీమా అంటే వివాహానంతరం జరిపే విందు. అయితే ఇది కేవలం బంధువర్గాలలో మాత్రమే ఉండేది. కాని ఇపుడు మిత్రులును కూడా ఆహ్వానించడం శుభపరిణామం.

    నీలకంఠనాగ్ గారు,
    ధన్యవాదాలు,
    శి.రా. రావు గారు
    ధాంక్స్..

    ReplyDelete