నిన్న మాస్కూల్లో ఒక టీచర్ రిటైర్ అయ్యారు..తన విశ్రాంతజీవనం మీద ఒక కవిత వ్రాయమని అడిగారు... ఆమె నార్తిండియన్. హిందీ టీచర్. హిందీ లేదా ఇంగ్లీషులో వ్రాస్తానంటే కాదు తెలుగులోనే వ్రాయమన్నారు. ఆ సందర్భంలో ఆమె తరపున నే చదివిన కవిత...

ఈరోజు గంట కొట్టంగానే నాకంటే ముందే
బడి లోకి వెళ్ళాలని ననుతోసుకుంటూ
వెళ్ళిన నా చిన్నారులు
నా స్మృతి వీధుల్లోంచి వెనక్కి వెళిపోతుంటారు...
నా మనో సముద్రంలో ఎగిసిపడిన అలల్ని
ఒకటొకటిగా మోసి నా చేతిలో
విరిగి అరిగిన సుద్దముక్క
విశ్రాంత జీవన కౌగిలిలో కరిగిపోతూంటుంది...
తనువు తారు నలుపైనా
గోడ నిండా పరుచుకుని
అక్షర మల్లియల సుగంధాన్ని
ఎదజల్లిన నల్లబల్ల నాకోసం
తనువంతా కనులై ఎదురుచూస్తూంటుంది...
ఈ దేవాలయ ప్రాంగణంలో
నా పాద ధూళి రేపటి వానలో
తడిసి ముద్దయిపోతుంది...
హాజరు పుస్తకంలో నా చివరి సంతకం
వేల వేల ప్రశ్నల్ని ప్రసవిస్తుంది...
నే కూర్చునే కుర్చీ మీ వైపు
జాలిగా చూస్తూంటుంది.
మీ చెక్కిళ్ళపై ఎండిన కన్నీళ్ళలో
నా రూపం క్రమక్రమంగా కరిగి పోతుంది...
నేను మాత్రం.....
గుప్పెడు జ్ఞాపకాల మూటని
భుజాన్న మోసుకుని వెళిపోతాను..
మధురక్షణాల చిత్తరువులు(ఫోటోలు)
తగిలించిన గోడకి నా రెండు కళ్ళూ ఉరి పోసుకుంటాను..
వీధివెంట వెళ్ళే బడి పిల్లలని చూస్తూ
గుమ్మానికి వేలాడతాను..
విశ్రాంత జీవన యానంలో
మహాప్రస్థానానికి దారి వెతుకుతూంటాను.
మిత్రులారా ఇక సెలవ్......