Monday, March 8, 2010
మ...ది...శు..
మహిళా బ్లాగర్లందరికీ అంతర్జాతీయ మహిళాదినోత్సవ శుభాకాంక్షలు.
స్త్రీ బాహ్య నిర్బంధాలనుండి విముక్తి కావడం ఒక క్రమమయితే అంతర బంధాలనుండి విముక్తి కావడం మరో క్రమం.
అయితే ఈ విముక్తి ని ఒక వస్తువుగా సాగిన సాహిత్యం స్త్రీవాద సాహిత్యం గా రూపాంతరం చెంది
అన్ని సాహితీ ప్రక్రియలలోనుప్రవేశించి సమాజాన్ని ప్రశ్నించింది, ఆలోచింప చేసింది, బాధ్యతను గుర్తుచేసింది. దశాబ్దాలుగా సాగిన పోరాటమ్లో ప్రతి మైలురాయి అనేక త్యాగాలకు నిదర్శనగా చెప్పవచ్చు. ఆదర్శనీయమైన విషయమేమిటంటే ఈ విముక్తి పోరాటం లో కేవలం మహిళలే కాదు, వారికి చేదోడు వాదోడుగా పురుషులు కూడా పాలు పంచుకుని సమాజాన్ని చైతన్యవంతం చేయడం లో వారుకూడా కృతకృత్యులయ్యారనడం అతిసయోక్తి కాదు. గడచిన రెండు దశాబ్దాలుగా వచ్చిన స్త్రీవాద సాహిత్యం లో స్త్రీ సమస్యలని అర్ధం చేసుకోవడం లో కవులు గొప్ప పరిణితి చెం దారు.
కానీ ఎనభై దశకాల్లోనూ...తొంభై దశకాల్లోనూ ఉన్నంత ఉధృతి ఈ దశాబ్దం లో లేదనే చెప్పవచ్చు. గ్లోబలీకరణ, సాంకేతిక విజ్ఞాన అభివృధ్ధి, మహిళల అక్షరాస్యత శాతం పెరుగుదల, విద్యాలయాలలో, ఉద్యోగాలలో మహిళలకు రిజర్వేషన్లు,ఆర్ధిక స్వాలంబన..సమస్య సాంద్రతని కొంతవరకూ తగ్గించాయని కూడా చెప్పవచ్చు...అంతేకాదు మహిళా బిల్లును ప్రవేశపెట్టటానికి జరుగుతున్న పరిణామాలు హర్షణీయం.
అంతర్జాతీయ మహిళాదినోత్సవ సందర్భంగా...
ఎనభైలలోనూ, తొంభైల లోనూ అక్షరబధ్ధం చేసిన రెండు కవితలని ఇక్క డ ....
అమ్మ
అల్లం నారాయణ.
పొద్దుతో పాటూ
పంట పొలంలో పొడిచేది అమ్మ
చెమట ముత్యాల్లోకి జారి
కత్తిలాంటి మా కండరాల్లోకి ఇంకేది
అమ్మ నుదుటి సింధూరం పువ్వు
' అమ్మా ఆకలే ' అనడం తప్ప
అమ్మ కడుపులో కాసిన
ఎర్రటెండను పట్టించుకున్నదెవ్వడు?
మొగ్గలకు రెక్కలతికిన అమ్మ
నల్లనల్లని రేగళ్ళ నాగేటి చాలయింది
కంట్లో కారు చీకట్లు దాచుకొని
వెన్నెల నవ్వుల్ని విరిసింది
పక్షుల్ని పిలిచి మాకు పాటలు నేర్పింది
పొగ చూరిన పాత వంటగది కావల
నాకోసం మా అమ్మ
ప్రపంచం కిటికీ తెరిచింది
ప్రపంచం కిటికీ గుండా
నే ఆవలి గట్టుకి దూకేసా
మా అమ్మ మాత్రం
వంటింటి గడప మీద శిలయింది
పసుపు కుంకుమలు, తాళిబొట్టు, కాలిపట్టెడ
పాతివ్రత్య ధర్మం మీద పూర్వీకుడు రాసిన పుస్తకం
సాక్షీ భూతాలుగా
మాఅమ్మ వంటింటి గడప మీద
శిలువబడింది.....
ఆంధ్రజ్యోతి దినపత్రిక 29.03.1988 అల్లం నారాయణ గారు ఆంధ్రజ్యోతి సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేసారు. " జగిత్యాల పల్లె " కవితా సంపుటి ప్రచురించారు..
---------------------------------------------------------------------
పంజరం
శిలాలోలిత
పంజరాన్నీ నేనే
పక్షినీ నేనే
నాకు నేనే ఉచ్చును బిగించుకొంటాను
చిలుక పలుకులే తెలుసు
గొంతెత్తి పాడలేని మూగజీవాన్ని--
కవిత్వం రాయలేని సమాజపు పక్షపాతాన్ని నిరసించాలనీ
నాలోని కోటానుకోట్ల కణాల యుధ్ధారావాల్ని
నాలోని విద్యుత్ ప్రవాహ సంగీతాన్ని
నాలోని ఆలోచనాలోచనాల సముద్రాల్ని వెలికి తీసి
నాలోని నన్ను ఆవిష్కరిద్దామనే నా భావన
కలలున్నాయి కానీ అన్నీ డొల్లలే
కధలున్నాయి కాని ఎవరో పూర్తిచేసిన ముగింపులే
కనులున్నాయి కానీ ఎవరో కత్తిరించిన రెటీనాలే
సమాజం లో బతకని నువ్వు
నీ పుట్టుకా సమాధి పంజరమే అయిన నువ్వు--
పంజరం ఊచలెన్నో లెక్కెట్టుకో
కవిత్వం కవులే రాయగలరు
నీకు అక్షరాలేం తెలుసునన్న పురుషాహంకారం
ఔను నాకు అక్షరాలు తెలియవు
నాకు పొడి మాటలు తెలియవు
అసలు అక్షరాలేవి ? అయ్యో వాటికి ప్రాణమేది ?
ఎర్రటి రక్తం లో స్నానాలు చేస్తున్నాయవి
వెలికి తీద్దామన్న యత్నం లో నా వేళ్ళు తెగిరక్తమ్లో కలిశాయి
చేతులే లేని నేను
హత్య చేయబడ్డ అక్షరాలతో నేను
అసలు భాషే
లేని నేను ఎలా మాట్లాడేది ? ఎలా రాసేది ?
నా చేతికి ' మాడిఫై' చేయబడిన రూపం లో గాజుల సంకెళ్ళు
నా బతుకే ధన్యమనే బ్రెయిన్ వాష్ లు
నా నాలుక తెగ్గొట్టినా, చేతుల్ని నరికేసినా
అక్షరాల్ని విరిచేసినా, భాషను లేకుండా దగ్ధం చేసినా
నేను మరణించలేదు.
నేను మరణించను
ఔను -- ఈ నెత్తుటిలో కొత్తపుట్టుక నాది
ఈ పుట్టుక నా స్వంతం
జనన మరణాల పట్టికని నేనే తయారు చేసుకోగలను
ఎవరికీ నన్ను కాల్చడానికీ ముంచడానికీ చంపడానికీ
వదిలేయడానికీ, ఉంచుకోవడానికీ, ఎంచు కోవడానికీ
సర్వహక్కులు ధారాదత్తం చేయబడలేదు
నేను వైప్లవ్య గీతిని
మూగతనం తెలిసిన నాకు భాషెంత బాగుంటుందో తెలుసు
కష్టాలలో మునిగి తేలిన నాకు కడసారి వీడ్కోలు కొత్తకాదు
కన్నీళ్ళ నదులకి ఆనకట్టలు కట్టి
కొత్త వంతెనలు కట్టుకోగలను..
నేనొక ప్రాణినేనన్న గుర్తింపు కోసం
నేనొక సమిధనౌతాను
నన్ను నేను నిలబెట్టుకొనే క్రమం లో
నా పాదాల క్రింద ఇసుకలా జారిపోతున్న కుబుసాన్ని
తృణీకరిస్తున్నాను
భాషను దూరం చేసిన ప్రణాళికాధికారులకు
నేనొక కొత్త నిఘంటువును
బతుకును చౌరస్తాను చేసిన వ్యవహారికపు ముసుగులకు
నేనొక కంచుకత్తిని
నేను తెగినా నేలరాలినా, నెత్తురు చిమ్మినా
నేనొక మాట్లాడగల శక్తినని నిరూపిస్తాను
పోరు బాట నాకు కొత్తకాదు
చాళ్ళనిండా విత్తనాలు మొలకెత్తుతూనే ఉన్నాయి...
( " పంజరాన్నీ నేనే పక్షిని నేనే " -- (1999) కవితా సంపుటి నుండి )
శిలాలోలిత : అసలు పేరు పి. లక్ష్మి ప్రచురిత రచనలు: కవయిత్రుల కవిత్వం లో స్త్రీ మనోభావాలు (1993) ఎంతెంత దూరం (2005) నారి సారించి - సాహిత్య వ్యాసాలు (2006) చిరునామా: ' సూఫీఘర్ ' 1-7-9/1/3, చైతన్యపురి,హైదరాబాదు-80 ఫోన్ : 040 - 24040890, 9849156588.
అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా
ఒక విలక్షణ మైన వ్యాసం ఇక్కడ లింకులో...
http://timesofindia.indiatimes.com/city/lucknow/No-need-for-Reserved-Class-to-travel-ahead/articleshow/5655723.cms
Subscribe to:
Post Comments (Atom)
శ్రీనిక గారూ !
ReplyDeleteముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మంచి కవితల్ని అందించారు. ధన్యవాదాలు.
శ్రీనికగారూ,
ReplyDeleteమీరు ఇచ్చిన లింక్ చదివాను. మంచి లింక్ ఇచ్చారు. కవితలు మనసుని కదిలించేవిలా వున్నాయి..
శ్రీనిక గారు కవితలు, మీ భావాలు బాగున్నాయండి. అందమైన పక్షినే కదండీ పంజరం లో పెడ్తారు. మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
ReplyDelete