Saturday, October 9, 2010

ఈ కధకి పేరు పెట్టండి..









నగరాన్ని పిండితే రాలినట్లు రోడ్లన్నీ జనమయం. ఎవరి బిజీ లోవాళ్ళు. ఆఫీసులకెళ్ళే వాళ్ళు. పిల్లలని స్కూలుకి, కాలేజీలకి తీసుకుని వెళ్ళేవాళ్ళు, రోడ్లు క్రాస్ చేయడానికి ప్రయత్నిస్తూన్నవాళ్ళు కొబ్బరి బొండాలు, కూరగాయలు, చేపలు, రొయ్యలు అమ్మేవాళ్ళు ఎవరి అవసరాల్లోవారు. రావాల్సిన బస్సు కోసం అసహనంగా అటూ, ఇటూ చూస్తూంది కాజల్. ఎదురుచూసే బస్సు రాకుండా ఎక్కడికి పోతుంది. బస్సు వచ్చేవైపే కాదు, రాని వైపుకూడా చూడటం ఆరాటానికి పరాకాష్ట. అయితే రావాల్సిన బస్సు కంటే వేగంగా ఆమె ఆలోచనలు పరిగెడుతున్నాయి. సరిగ్గా నిన్న ఇదే సమయానికి జరిగిన సంఘటన తన కళ్ళముందు కదలాడింది. .

నిన్న బస్సు కోసం ఎదురు చూస్తూన్నపుడు ఎవరో ఒక ఇరవై, ఇరవైఐదు సంవత్సరాల యువకుడు రోడ్డు క్రాస్ చేస్తూ బైక్ గుద్ది పడిపోయాడు. అందరూ అతన్ని ముందు తిట్టినా తరువాత అతడు గుడ్డివాడని తెలిసి జాలిపడి బైక్ అతన్ని తిట్టారు.

తనకేమీ పట్టనట్లు అతను నవ్వుకుంటూ తను వెయిట్ చేస్తున్న బస్టాప్ దగ్గరకి వచ్చేడు. నెమ్మదిగా నడుచుకుంటూ తనకు దగ్గరగా వచ్చి... ఏవండీ 28 వచ్చిందాండి. అందం, ఆకర్షణ అన్నీ ఉన్న ఇతనికి దేవుడు అన్యాయం చేసాడనిపించింది. ఏవండీ మిమ్మల్నే... ఉలిక్కి పడింది కాజల్...ఇంకా రాలేదండి. నేనూ దానికోసమే వెయిట్ చేస్తున్నాను. రాంగానే మిమ్మల్ని ఎక్కిస్తాను. చాలా ధాక్సండి.. మీకెందుకండి శ్రమ ..నేనెక్కగలను. బస్సు వచ్చినపుడు చెప్పండి చాలు. మీరేమనుకోనంటే ఒక చిన్న మాట..మాలాటి వికలాంగుల మీద సానుభూతి చూపించండం నాకిష్టం ఉండదండి. అది మా ఆత్మవిశ్వాసాన్ని దిగజార్చుతుందని నా భావన. వీలయినంత వరకూ ఎవరి మీద ఆధార పడకుండా మా పనులు మేము చేసుకోవడంలోనే మాకు తృప్తి ఉంటుందండి.

ఐయామ్ సారి నా గురించి చెప్పనేలేదు కదూ. నా పేరు ఉదయ్. అనాధాశ్రమంలో జీవన ప్రస్థానం మొదలైంది. రైల్వే న్యూకాలనీలో ఉన్న బ్లైండ్ స్కూల్లో టీచర్ గా వర్క్ చేస్తున్నాను...మీరు ఏ కాలేజిలొ చదువుతున్నారు. మీరు కాలేజి చదువుతున్నట్లు ఎలా తెలిసిందని అవాక్కయ్యారా ? ఇందులో విచిత్ర మేముందండి. మీరు వాడే పెర్ఫ్యూమ్ కాలేజ్ స్టూడెంట్స్ తప్ప మరెవరూ వాడరు కదా. తను నిజంగానే అవాక్కయింది. నోటమాట రాలేదు. మాట్లాడే అవకాశము రాలేదు. తన నిశ్శబ్దాన్ని ఛేధిస్తూ 28 బస్సు హారన్ మ్రోగింది. చూస్తుండగానే అతను బస్సు ఎక్కడం, తరువాత హడావుడిగా తను ఎక్కడం జరిగిపోయింది. బస్సులో విడివిడిగా కూర్చున్నా ఒకరు మరొకరి గురించి ఆలోచిస్తూనే ఉన్నారు. ఆలోచనలో ఉండగానే అతని బస్టాప్ వచ్చింది. తను దిగిపోయాడు.

బస్సు కదిలింది. వెంటనే తను సీట్లోంచి లేచి అంకుల్ కొంచెం స్లో చేయరా నేనిక్కడే దిగాలి. స్టాప్ లో దిగాలమ్మా, ఎక్కడపడితే అక్కడ బస్సాపరు అంటూనే బస్సు స్లో చేసాడు. దిగి వెనక్కి చూసింది. చాలా దూరంలో ఉన్నాడు. మళ్ళీ ఆలోచనలు..... తను దిగాల్సింది మరో రెండు స్టాపుల తర్వాత. మరి ఇక్కడ ఎందుకు దిగింది. అతని గురించా ? అతనితో ఏం మాట్లాడుతుంది తనకే తెలియదు. సెల్ తీసుకుని మాధవికి ఫోన్ చేసి అటెండెంస్ మేనేజ్ చేయమని చెప్పింది. ఇపుడేం చేయాలి. వెనక్కి చూసింది. అతనెవరితోనో మాట్లాడుతూ నెమ్మదిగా నడుచుకుంటూ వస్తున్నాడు. తను నడక మొదలు పెట్టింది. దగ్గర కొచ్చేకా...అరె మీరా... మీరిక్కడే దిగారా ? కాలేజ్ కి వెళ్ళలేదాండి.

లేదండి..ఇక్కడ ఒక అంకుల్ వాళ్ళింటికి వెళ్ళాలి. ఆ పని అయిపోయాకా కాలేజికి వెళతాను. తనకి తెలుసు అది అబధ్ధం అని....బహుసా అతనికి కూడా.. అయినా ఎందుకు చెపుతున్నట్లు.. ఆతన్ని చూడంగానే పరిచయం పెంచుకోవాలని ఎందుకనిపించింది. అదీ తెలియదు. ఇరువురు పరిచయాలు చేసుకోంగానే అతని స్కూలు వచ్చేసింది.

బస్సు హారన్ మ్రోగేసరికి ఊహల్లోంచి బయట పడింది. కొంచెం దూరంలో ఉదయ్ ఉన్నాడు. తనొచ్చేవరకూ బస్సు ఆపింది. రోజు ఇలాగే కలుసుకోవడంలో వారి అనుబంధం పెరిగింది.
తను కూడా అనాధే. చిన్నప్పటి నుండి ఒక దాత చదివించాడు. అతను కాస్తా మరణించేసరికి ఆమె చదువు మధ్యలోనే ఆగిపోయింది. వర్కింగ్ విమెన్ హాస్టల్ లో ఉంటూ ఏదో చిన్న షాపులో పార్టైమ్ స్టోర్స్ మేనేజర్ గా పనిచేసుకుంటూ చదువు కుంటుంది.

ఇద్దరికీ కులం, మతం అడ్డుగోడలు లేవు. తల్లి దండ్రుల ఆంక్షలు లేవు. సో... వారి ప్రేమకి ఎల్లలు లేవు. అలాగని ఎవరూ హద్దులు దాటలేదు.

తరచూ పార్కుల్లోనూ బీచ్ ల్లోనూ కలుసుకోవడం వారిని వివాహ బంధానికి దారి తీసింది.

ఒక రోజు....నాకు కళ్ళు వచ్చే అవకాశాలున్నాయని డాక్టర్లు చెప్పారు. నేత్రదాతలకోసం వెతుకుతున్నాను. నాకు చూపు రాగానే మనిద్దరం పెళ్ళి చేసుకుందాం అన్నాడు.

ఆ రోజు రాత్రి కాజల్ కి నిద్రపట్టలేదు. ఎలాగైనా అతనికి చూపు రప్పించాలి. రెండు రోజులు అతన్ని కలవలేదు. ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ చేసింది. అతని రిపోర్ట్స్ చేతబట్టుకుని నగరంలో ఉన్న కంటి హాస్పటల్స్ చుట్టూ తిరిగింది. మొత్తానికి శంకర్ ఫౌండేషన్ హాస్పటల్ లో అపాయింట్ మెంట్ సాధించింది.

మరో పది రోజుల్లో అతనికి ఆపరేషన్. ఈ విషయం అతనికి చెప్పింది.
తన చీకటి తెరలు తొలగిపోయే రోజుకోసం ఇద్దరూ ఉత్కంఠతో ఎదురుచూసారు.
కళ్ళు వస్తే ఈ లోకంలోని రంగులన్నీ తెలుస్తాయి.
ప్రకృతిలోని అందాలన్నీ చూడగలుగుతాడు.
ఆ ఊహే అతణ్ణి ఉద్వేగపరచింది.
ఆపరేషన్ అవ్వంగానే కళ్ళు తెరచి మొదట తననే చూడాలని అన్నాడు.
ఆపరేషన్ అయ్యింది.
తను కళ్ళు తెరిచేసరికి ఎదురుగా తన రూపం.. మసక మసకగా క్రమంగా రూపుదిద్దుకుంది.

అతని మనో నేత్రంలో ఆమె రూపం సజీవంగా..... ఎదురుగా.....
పెళ్ళి గురించి అడిగింది..చూద్దాంలే..అప్పుడేనా...తర్వాత మాట్లాడుకుందాం...
డిస్చార్జ్ రోజున అడిగింది...ఆలోచిస్తాన్లే అన్నాడు....
అతనికి దగ్గరగా వచ్చింది.. కళ్ళని ముద్దాడింది....
నా కళ్ళు జాగ్రత్త......అని వెళిపోయింది.....

నగరాన్ని పిండితే రాలినట్లు రోడ్లన్నీ జనమయం. ఎవరి బిజీ లోవాళ్ళు. ఆఫీసులకెళ్ళే వాళ్ళు. పిల్లలని స్కూలుకి, కాలేజీలకి తీసుకుని వెళ్ళేవాళ్ళు, రోడ్లు క్రాస్ చేయడానికి ప్రయత్నిస్తూన్నవాళ్ళు కొబ్బరి బొండాలు, కూరగాయలు, చేపలు, రొయ్యలు అమ్మేవాళ్ళు ఎవరి అవసరాల్లోవారు.

కళ్ళ చుట్టూ ఉండాల్సిన కాటుక (కాజల్) చీకటిని కళ్ళల్లో నింపుకుని....
రావాల్సిన బస్సు కోసం అసహనంగా ఎటో చూస్తూంది కాజల్....

7 comments:

  1. కాజల్ అనే పేరే బాగుంటుందేమో...
    కథ మాత్రం చాలా బాగుంది.

    ReplyDelete
  2. ఎదురు చూపులు!
    చివరకు మిగిలింది అవే కదా!

    ReplyDelete
  3. బాగున్న మనిషి కళ్లు పీకి మరొకరికిచ్చే డాక్టరెవరు?

    ReplyDelete
  4. ఈ విజయదశమికి ఆ జగజ్జనని మీకు సకల శుభాలు అందించాలని కోరుకుంటూ............

    - SRRao

    శిరాకదంబం

    ReplyDelete
  5. మీకు, మీ కుటుంబానికి దీపావళి శుభాకాంక్షలు
    - శి. రా. రావు
    శిరాకదంబం

    ReplyDelete
  6. మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

    SRRao
    శిరాకదంబం

    ReplyDelete