Wednesday, January 13, 2010

భోగి పిడకలంటే తెల్సా?




ఊరు నించి రాత్రే వచ్చాం. ఉదయాన్నే పిల్లల్ని లేపి స్నానాలు చేయించే సరికి
ఎదురు ఫ్లాట్ సరిత గారు కాలింగ్ బెల్ కొట్టి ...
ఏవిటి మీరు రారా ? భోగి మంట వేస్తున్నాం. బాబుని, పాపని తీసుకుని రండి.
అని పిలిచేసి వెళ్ళి పోయారు.
మా ఆడపడుచు అత్తగారికి బాగాలేదంటే విజయవాడ వెళ్ళి రాత్రే వచ్చాం.
సంక్రాంతికి ఏం ఎరేంజ్ మెంట్స్ చేసారో తెలియదు.
పిల్లలిద్దరిని ముందు పంపి తరువాత నేను వెళ్ళాను.
నాలుగున్నరకే చాలమంది అక్కడకి చేరిపోయారు.
మైన్ గేటు కి కొంచెం పక్కగా పెద్ద భోగి మంట వేసారు.
ఇలాటి కార్యక్రమాలంటే ముందుండే మూర్తి గారు నన్ను చూడగానే..
ఏమ్మా ఎపుడొచ్చారు. మీ పిన్నిగారు బాగున్నారా?
ఆ! రాత్రే వచ్చాం అంకుల్. పిన్నికి ఫర్వాలేదంకుల్. కొంచెం లేచి తిరుగుతున్నారు.

భోగి మంట పెద్దదే వేసారు. చుట్టూ చేరిన పిల్లలు చిన్న చిన్న పుల్లముక్కలు తీసుకొచ్చి మంటలో పడేస్తున్నారు.
అంతే కాని ఎవరి చేతుల్లోను భోగి దండలు గాని భోగి పిడకలు గాని లేవు.
ధగ ధగ మండుతున్న భోగి మంటని చూసేసరికి
నా చిన్నప్పటి జ్ఞాపకాలు ముసురుకొచ్చాయి.

మాది అటు పల్లెటూరు కాదు పట్నం కాదన్నట్లుండే ఊరు. పల్లె పండుగలు, సాంప్రదాయాలకు విలువనిస్తూ, పట్టణ నాగరికతకి స్వాగతం పలికే సంధికాలమ్లో నలుగురు అన్నయ్యలు,
ఒక అక్క కి ఒకే ఒక చెల్లి గా పుట్టిన అదృష్టవంతురాలిని.
సంక్రాంతి వచ్చిందంటే ముగ్గుల పుస్తకాలు ఫ్రెండ్స్ షేర్ చేసుకుని రకరకాల ముగ్గులు ప్రాక్టీసు చేస్తూ ఆ సందడే సందడి. నేనింకా చిన్న పిల్లని కాబట్టి అక్క చేస్తుంటే వింతగా చూసేదాన్ని. అందరికంటే చిన్నదాన్నికాబట్టి అందరూ గారంగా చూసుకునేవారు.
ఇహ భోగి పిడకలు గురించి చెప్పాలంటే...చాలాఉంది.
సంక్రంతి వస్తుందంటే నెల రోజుల ముందే అమ్మ పొలం నుండి ఆవు పేడ తెప్పించేది. మా నలుగురు అన్నయ్యలు వాటితో భోగి పిడకలు చేసేవారు. ఒక్కక్కరికి ఒకో దండ వచ్చేటట్టు చిన్ని చిన్ని పిడకలు
వేసి వాటి కి దండగా చేయడానికి చిన్ని కన్నాలు పెట్టేవారు.
మా ఆరుగురికి ఒకో దండ వచ్చేటట్టు చేసేవారు. ఈ పిడకలలో రకాలుండేవండోయ్.
అరిసె పిడకలు అంటే అరిసెల్లా పెద్దవి చేసి ఎక్కువ కన్నాలు పెట్టేవారు.
అరటికాయ పిడకలు అంటే అరటికాయ షేపులో ఉండేవి.
ఇవి అందరకీ సమంగా వేసి భోగి దండలోమధ్య మధ్యలో వేస్తే దండలెంత
అందంగా ఉండేవో.మిగిలినవి చిన్నగా హార్లిక్స్ బాటిల్ మూతంత సైజులో గుండ్రంగా ఉండేవి.
నిజం చెప్పొద్దూ పేడ పిడక దండలైనా గాని ఎంత ముద్దొచ్చేవో..
ఈ పిడకల తయారీలో చిన్న పిల్లని కాబట్టి నన్ను దగ్గరికి రానిచ్చేవారు కాదు.
నాకు మాత్రం అవి ఎప్పుడెండుతాయా అని ఒకటే టెంషన్.
ఎప్పుడు దండలు చేస్తారో అవి ఎంత అందంగా ఉంటాయో
ఊహించుకుంటూ ఆనంద పడి పోయేదాన్ని.అన్నయ వాళ్ళు స్కూలు కెళ్ళినపుడు
మెల్లగా గోడ దగ్గరికి చేరి పిడకలు ఎండాయా లేదా అని ఊడపెరికి చూసేదాన్ని.
అంతేఊడిన పిడకలని అతికించలేం కదా..
సాయంత్రం వాళ్ళు స్కూలు నుండి వచ్చేసరికి వరుసకి నాలుగైదు పిడకలు మిస్సింగ్.
రెండో అన్నయ్య కి నాకు ఎప్పుడూ గొడవే. అంతే అమ్మకి కంప్లైంటు వెళ్ళి పోయేది.
అమ్మ నను కొట్టడానికి, రెండో అన్నయ్య నను పట్టుకోవడం ఇల్లంతా పరుగు పెట్టించి పెట్టించి
చివరకి నాయినమ్మ వెనక్కి దాక్కునేదాన్ని. నాయినమ్మ వాణ్ణి ఒక్క గసురు గసిరేది.
దానికి అందేలా పిడకలు ఎందుకేయాలి?
కొంచెం ఎత్తులో వేయాలని తెలియదా మీకు ? అని తిట్టేది. దాంతో సద్దుమణిగేది.
మళ్ళీ పెద్దన్నయ్య కొత్త పిడకలు వేయడం.. వాటిని నేను చెకింగ్ చేయడం
ఈ గొడవ ఇంచుమించు రోజూ జరుగుతూనే ఉండేది.

ఇపుడు తలుచు కుంటుంటే నవ్వొస్తోంది.
ఇన్ని సరదాల మధ్య నిమ్మదిగా నడుచుకుంటూ
వచ్చిన గంగిరెద్దులా భోగి పండగ వచ్చేది.
ఉదయాన్నే అందరికి స్నానాలు చేయించి కొత్త బట్టలు కట్టుకుని
ఆరుగురుం కవాతు చేసే సైనికుల్లా ఒకరి వెనక ఒకరు భోగి మంట్లో
భోగిదండలు వేసాకా నాన్న భోగి మంట బూడిద
తీసి అందరకి వీబూధి పెట్టేవారు.
అక్క వాళ్ళ ఫ్రెండ్స్ భోగి మంట చుట్టూ తిరుగుతూ పాటలు పాడేవారు.
అమ్మ అక్కని అటువంటి ఆటపాటలకి పంపేది కాదు.
ఇంట్లో ఉన్న అమ్మకీ నాయినమ్మకీ భోగి బూడిద పెద్దన్నయ తీసుకొచ్చే వాడు.
ఇంటికొచ్చేసరికి వేడి వేడిగా టిఫిన్ రెడీ గా ఉండేది.
ఇవండీ నా చిన్నప్పటి భోగి స్మృతులు.
ఇప్పటికీ ఈ రకంగా పల్లెటూరు లో జరుగుతున్నాయి తప్ప
ఈ నగరాలు ఈ సంబరాలకి నోచుకోలేదు.
ఈ మధ్య ఎక్కడో చదివాను. ఈ తరం వారు
ఈ సంక్రాంతి సంబరాల గురించి తెలుసుకోవాలంటే
www.సంక్రాంతి.com లో చూడాల్సిందేనట.

7 comments:

  1. అవునండి. చిన్నప్పటి సంక్రాంతి భలే ఆనందం. ఇప్పుడు పేరుకే సంక్రాంతి అనిపిస్తుంది. ఆ సరదాలు లేవు.

    ReplyDelete
  2. బాగున్నాయండి మీ సంక్రాంతి జ్ఞాపకాలు. భోగి పిడకల గురించి నాకు తెలీదు. మీ పోస్టు వాళ్ళ, మురళి గారి పోస్టు వల్లనే నాకు తెలిసాయి ఈ విశేషాలన్నీ..మీకూ, మీ కుటుంబ సభ్యులకూ సంక్రాంతి శుభాకాంక్షలు.

    ReplyDelete
  3. బాగున్నాయి మీ సంక్రాంతి జ్ఞాపకాలు..సంక్రాంతి శుభాకాంక్షలు.

    ReplyDelete
  4. బాగున్నాయండి మీ జ్ఞాపకాలు.
    అవునూ ..మా దగ్గర గొబ్బెమ్మ లని పెడతారు, చిచ్చు బుడ్డి ఆకారం లో అన్ని తలుపుల దగ్గర పెడతారు భోగి రోజు..ఆవు పేడతో చేసినవే.
    ఎందుకో మా పాలమూరు జిల్లాలో భోగి మంటలు చూసిన జ్ఞాపకము లేదు?

    సంక్రాతి శుభాకాంక్షలు.

    ReplyDelete
  5. బాగుంది మీ పిడకల పురాణం. పనిలో పనిగా చాలా మంచి విషయాలే చెప్పారు. చెప్పానుగా మీకు డాక్టరేట్ ఇవ్వాల్సిందే నని. మీ బాబుకి, పాపకి భోగి పళ్ళు పోసారా మరి. మీరు బొమ్మల కొలువు పెడ్తారా? మీకు సంక్రంతి శుభాకాంక్షలు.

    ReplyDelete
  6. శిశిర గారు,
    నిజమేనండి ఇపుడు సంక్రాంతి అంటే pongal holidays..అంతే..
    మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.

    మధురవాణి గారు,
    చెప్పాలంటే ఇంకా చాలా ఉందండి..మీకు మీ కుటుంబ సభ్యులందరికీ
    సంక్రాంతి శుభాకాంక్షలు.

    @ ప్రేరణ
    ధన్యవాదాలు.
    మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.

    @ matalabu,
    నిజమే. గొబ్బెమ్మలని మేమూ పెట్టేవాళ్ళం.
    దాని గురించి చెప్పాలంటే చాలా ఉంది.
    మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.

    జయ గారు,
    టపాకి పేరు మంచిదే పెట్టారు.
    భోగి పళ్ళు పోయడానికి రేగి పళ్ళు రావడం అక్టోబరులోనే ఆగిపోయాయి.బజార్లో దొరికే పెద్దవి (కాశీ రేగుపళ్ళు)పనికిరావు.
    ఏదో పోసామని పించాను. బొమ్మల కొలువు మా అత్తగారి వాళ్ళకి ఆనవాయితీ లేదట. మీరు భలే ఎంకరేజ్ చేస్తారండి. నిజమే ఈ ఆచారం ఎందుకొచ్చింది ? స్టడీ చేయాలి.
    ఎవరైనా బ్లాగులో పెడితే బాగుండు.
    మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.

    ReplyDelete
  7. ఈనాటి ఆనందమయ మకర సంక్రాంతి
    అందించాలి అందరి జీవితాలకు నవ్య క్రాంతి
    *** మీకు, మీ కుటుంబానికి, మీ మిత్రులు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ***
    SRRao
    శిరాకదంబం
    http://sirakadambam.blogspot.com/2010/01/blog-post_13.html

    ReplyDelete