Wednesday, August 31, 2011

అమలిన శృంగారమే ముఖ్యం...ఇస్లాం


ఖుత్బా అంటే ఏమిటో గత టపాలో తెలుసుకున్నాం.. వివాహ సందర్భంలో పఠించబడే
అరబ్బీ ప్రసంగాన్ని ఖుత్బా అంటారు.
ఖుత్బా ప్రారంభంలో పఠించబడే తొలి వాక్యానికి అర్ధం ఇది.
స్తోత్రం: కృతజ్ఞతాభావం అల్లాహ్ కొరకే. మనమందరం ఆయనకే కృతజ్ఞులం. ఆయన్నే కీర్తిస్తూ ఉంటాము. ఆయన్నే సహాయం కొరకు అర్థిస్తాము. మన అపరాధాల మన్నింపుకై ఆయన్నే వేడుకుంటాము. మన ఆంతర్యంలో పుట్టే చెడుగు నుండి, మన్ చేష్టల దుష్పరిణామం నుండి మేము ఆయన రక్షణనే కోరుకుంటున్నాము. అల్లాహ్ మార్గం చూపిన వాడికిఎవ్వరూ మార్గం తప్పించలేరు. మరెవరికయితే మార్గం తప్పడానికి అల్లాహ్ వదిలేస్తాడో అతన్ని మరెవ్వరూ మార్గం చూపలేరు.
ప్రసంగంలోని ఈ తొలి వాక్యంలో దైవం పట్ల మనిషి ఎంత కృతజ్ఞతతో ఉండాలో అర్ధమవుతుంది. దైవాన్ని విశ్వసించే వ్యక్తి ఆలోచనా తీరు ఎలా ఉండాలో ప్రస్ఫుటమవుతుంది. మనకి లభించే అసంఖ్యాక వరప్రసాదాలన్నీ దైవం ప్రసాదించినవే అని చెపుతుంది. ఊహ కందని వరప్రసాదాలని దైవం మనిషికి ప్రసాదిస్తాడు. అందువల్ల మనిషి ఆయనకి అత్యంత కృతజ్ఞతాపరుడయి జీవించాలి. ఆయన ఆదేశాలను తు.చ తప్పకుండా పాటించడమే మనిషికి దైవం పట్ల ఉన్న కృతజ్ఞతా భావానికి నిదర్శనం.
మనిషి ఆలోచన, ఆచరణా పరిధుల్లో ఉన్న స్వేఛ్చ కారణంగా అతడు తప్పులు చెయ్యడం, అపరాధాలు చెయ్యడం సాధ్యమే. అందువల్ల వాటికి క్షమాభిక్ష పెట్టమని మనిషి ఆ ప్రభువునే అర్ధించాలి. ఆయన గొప్ప క్షమాగుణం కలవాడు. అలాంటి తప్పులని మరల చేయకుండా జాగ్రత్త పడేందుకు మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకునేవాణ్ణి అతడు చేసిన తప్పులని అల్లాహ్ మన్నిస్తాడు. మనిషికి ఇటువంటి అవకాశం ప్రతినిత్యం ఉంటుంది. దేన్నే " తౌబా " (పశ్చాత్తాపం) అని అంటారు.
మనిషి మానసికంగా బలహీనుడన్నది మనందరికి తెలిసిన విషయమే. అతడు మాటిమాటికీ పొరపాట్లు చెయ్యడం సాధ్యమే. మనసు పరి పరి విధాల పెడ మార్గాలకు పోనివ్వకుండా కాపాడడం ఆ ప్రభువుకే సాధ్యం. చెడుగు నుండి కాపాడమని ఈ సందర్భంగా దంపతులు ఆ ప్రభువునే ఆశ్రయించాలి. ప్రభువు సన్మార్గాన్ని సూచిస్తాడు. ఆ సన్మార్గాన్ని మనిషి విడవకుండా పాటించాలి. సన్మార్గం పట్ల గట్టి విశ్వాశంతో దంపతులు మెలగాలి.

ఖుత్బాలో పఠించే రెండవ వాక్యానికి అర్ధం మరో టపాలో...

కొసమెరుపు :
వివాహంలో శృంగారానికే పెద్దపీట ...
ఇస్లాం లో దాంపత్యబంధం అలౌకిక ప్రేమకు, అన్నోన్యతకి పరిమితం కాదు. అలాగని ప్రత్యుత్పత్తి కోసం కూడా కాదు. నిజానికి " నిఖా " అనే పదానికి అర్ధం శృంగారం. నమ్మలేకపోతున్నాం కదూ. వివాహానికి పరమావధి శృంగారమయినపుడు మరిన్ని విశృతమైన నియమ నిభంధనలెందుకు ? ఇంత తతంగమెందుకు ? అని సందేహం రావచ్చు. ఎందుకంటే ఇస్లాం స్త్రీ, పురుష శృంగార వాంఛల గురించి పూర్తి అవగాహన తో జీవితంలో దాని అవసరం గుర్తించింది. మతం మాటున కోరికల అణచివేత ఎంతమాత్రమూ తగదని ఇస్లాం చెపుతుంది.

పవిత్ర గ్రంధం ఖురాన్ శృంగారాన్ని ఈ విధంగా సమర్ధించింది.

" అల్లాహ ఆజ్ఞాపించారు...వారు ( స్త్రీలు )

ఋతు స్రావం అయిన తరువాత శుభ్రపరచుకుని భర్తలతోశృంగారంలో విధిగా పాల్గొనవలెను. ( సురాహ్ బఖరాహ్ 2.222 )

మహా ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం ఇకముందు స అ సం ) కూడా ఈ విధంగా అంటారు. " యువతీ యువకులారా మీరు వివాహం చేసుకోవాలి. మీ కోరికలను చట్టబధ్ధంగా నెరవేర్చుకోవాలి.
పవిత్ర రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలతో...
సశేషం



Monday, August 22, 2011

క్రిష్ణం వందే జగద్గురుం




ఇదేంటి ఉగాది నాడు అదృశ్యమై మళ్ళీ క్రిష్ణాష్టమి నాడు ప్రత్యక్షమయ్యానని అనుకుంటున్నారా ? మరేంలేదండి ఇంటి నిర్మాణ పనుల్లో కొంచెం బిజీ అయి బ్లాగుని నెగ్లెక్ట్ చేసాను. ఈ రోజు నుండి పున ప్రవేశమ్ గావిస్తున్నాను.
బ్లాగు మిత్రులందరికీ క్రిష్ణాష్టమి శుభాకాంక్షలు..

Monday, April 4, 2011

ఇల కోయిల

ఎలా తెలిసిందో ఎవరు పిలిచారో
మంచుతెర తొలగిందని....
మావిచిగురు తొడిగిందని...
మత్తుకాకుల మధ్య
మత్తకోయిలలు వచ్చి వాలాయి...
వికృతి విలయతాండవ ప్రకృతిలో
శుభకర కరములు చాచి
స్వాగతిస్తోంది శ్రీఖర ఉగాదిని
ఇల కోయిల ఆశావాది

బ్లాగు మిత్రులు, శ్రేయోభిలాషులందరికి ఉగాది శుభాకాంక్షలు

అంతే కాదు ఈ రోజు అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవం. మీ ఇంట్లో చిన్న పిల్లలుంటే ...
A must read book

HEIDI
Writer: Johanna Spyri
Publisher : Penguin popular classics
చదివించండి లేదా చదివి వినిపించండి. దాని లంకె ఇక్కడ
http://www.gutenberg.org/ebooks/1448

Friday, January 21, 2011

మా పసలపూడి లో పస ఎంత ?

ఎన్నాళ్ళనుండో ఊరించి, ఊరించి మా టీవిలో మొదలయిన వంశీ మా పసలపూడి కధలు వంశీ డైరెక్షను మార్కు అంచనాలను తారుమారు చేసిందనిపించింది. ఇన్నాళ్ళనుండి చూడడం వీలు పడలేదు. ఈ రోజే గుర్తుపెట్టుకుని మరీ చూసాను. నేను వంశీ పుస్తకం చదవలేదు..కానీ కధల చిత్రీకరణ బాగాలేదనిపించింది. ఏదో డబ్బింగ్ సీరియల్ చూస్తున్నట్టనిపించింది. ఎందుకంటే యాక్టర్స్ వారి డైలాగులు చెప్పేవిధానంలో పెదాల కదలికకీ, పదాల ఉఛ్చారణకీ పొందిక లేకుండా పోయింది. ఎడిటింగ్ లో మరింత శ్రధ్ధ తీసుకోవాలి.
అంతేకాదు...తూ.గో.జిల్లా యాస నటులకు అంతగా వచ్చినట్లు లేదు. ఏదో బలవంతంగా డైలాగులు చెపుతున్నట్లనిపించింది. తూ.గో మాండలీకం తెచ్చిపెట్టుకున్నట్లుగా ఉంది. ముఖ్యంగా సుంకి పాత్ర.. ఈమె నటిస్తున్నట్లుగానే అనిపించింది. పాత్రను ఆకళింపు చేసుకోనట్లు, పాత్ర పట్ల అవగాహన లేనట్లుగా నటిస్తుంది. తూ.గో.జిల్లా నేపధ్యం ఉన్న నటులను ఎంపిక చేసినట్లు లేదు.
రెడ్డి గారి అమ్మాయి పాత్ర లో నటి చెప్పే డైలాగు కి చేసే అభినయానికి పొంతన లేదు. బహుసా నూతన నటీనటులకు నటనలో శిక్షణ కొరవడిందనిపిస్తుంది.
కానీ ఈ ఎపిసోడ్ లో సందేశం మాత్రం బాగుంది. కోనసీమ అందాలు అద్భుతంగా ఉన్నాయి

Wednesday, January 12, 2011

ఖుత్బా...అంటే





గత సంవత్సరం నా బ్లాగులో పెళ్ళి పుస్తకం వర్గంలో హిందూ వివాహాలలోని ఆచార వ్యవహారాలను అందించడం జరిగింది. ఎంతోమంది వాటి గురించి తెలుసుకుని కామెంట్ల ద్వారా నన్ను ప్రోత్సహించడం నాకెంతో ఆనందాన్నిచ్చింది.

కొంతమంది వేరే మతాలలోని వివాహ వ్యవస్థ, ఆచార వ్యవహారాలను తెలియచేయమని అన్నారు. నిజమే ఇది ఇంట్రస్టింగా అనిపించింది. అప్పటినుండి ఆయా మతాల వివాహ వ్యవస్థ గురించి అధ్యయనం మొదలు పెట్టాను. వాస్తవానికి హిందూ మతంలో వివాహ వ్యవస్థ గురించి కుప్పలు తెప్పలుగా సమాచారం ఉంది. కాని ముస్లిం, క్రిస్టియన్ వివాహ వ్యవస్థ గురించి సమాచారం తెలుగులో అంతగా అందుబాటులో లేవు. ఆయా మత పెద్దలను సంప్రదించినా అంతగా ఫలితం లేకపోయింది. విషయసేకరణ కొంత కష్టమయింది. కొంతవరకూ క్రైస్తవ వివాహంలోని విషయాలు సేకరించగలిగాను కాని ముస్లిం వివాహవ్యవస్థలోని వ్యవహారమంతా అరబ్బీలోనే ఉంది. దీనిని అవసరమైనంత మేరకు తర్జుమా చేయించుకుని అర్ధాన్ని గ్రహించగలిగాను.

ఏ మతమైనా కోరేదేమిటి ? మనిషి ఇహపర జీవితాలు సుఖవంతం, శాంతిమయం, ఫలప్రదం కావాలంటే మనిషి తన ప్రాపంచిక జీవితం మొత్తాన దైవం కోరేవిధానాన్ని అనుసరించాలి. దైవాదేశాలను కేవలం ఆరాధానాలయాల నాలుగు గోడల మధ్యనే కాక సకల జీవన రంగాల్లో పాటించడం తప్పనిసరి.

ప్రతి మనిషి జీవితంలో వివాహం ఒక గొప్ప మలుపు. ఇదొక పవిత్రకార్యంగా భావిస్తారు. భగవంతుడు మానవ జాతికి మాత్రమే ప్రసాదించిన అనేక ప్రత్యేకతలలో వివాహం ఒకటి. జాతి, మతం, కులం అనే తేడా లేకుండా ఈ కార్యాన్ని ఎవరి స్థోమతని బట్టి వారు వైభవంగా జరుపుకుంటారు. చిన్న, పెద్ద, పేద, గొప్ప అనే బేధభావం లేకుండా బంధుమిత్రుల సపరివారంతో ఎంతో సందడిగా ఈ కార్యాన్ని జరుపుకుంటారు.

ఇక ముస్లిం వివాహ వ్యవహారాలు ఎలా జరుగుతాయో చూద్దాం.
ముస్లిముల జీవితం ఏ విధంగా ఇస్లామీయ జీవన వ్యవస్థకు దూరమయిపోయి ముస్లిం సమాజమే నిర్వీర్యమయి పోతుందో అదే విధంగా ముస్లిముల వివాహాది శుభకార్యాలు కూడా ఇస్లామ్ నిజ జీవితాన్ని ప్రతిబింబించడంలేదనిపించింది.

ముస్లిముల వివాహాన్ని నికాహ్ (ఉర్దూలో) అంటారు. నికాహ్ వధువు లేదా వరుడు ఇంటివద్దగాని జరుపుకుంటారు. నికాహ్ స్థల నిర్ణయం ప్రాధమికంగా వసతి సౌకర్యాల మీద ఆధార పడి ఉంటుంది. అందుకే వీరి వివాహాలు ఈ మధ్య కల్యాణ మండపాలలో కూడా జరుగుతున్నాయి.

నికాహ్ సందర్భంలో పఠించబడే అరబ్బీ ప్రసంగాన్ని సాధారణంగా ఖుత్బా అనంటారు. ఈ ఖుత్బానే మహాప్రవక్త మహమ్మద్ పెళ్ళిళ్ళలో పఠించేవారు. ఇప్పటికీ కూడా నికాహ్ జరిగినప్పుడల్లా ఈ ఖుత్బానే పఠిస్తారు.

నికాహ్ ఓ సంతోష కార్యం. మనిషి సాధారణంగా ఇలాంటి సందర్భాలలో తన్మయత్వంలో తన నిజ స్థానాన్ని విస్మరించే అవకాశం ఉంటుంది. ఈ సమయంలోనే సైతాన్ (మనిషిలోని చెడు గుణం) తన పని నెగ్గించుకునేందుకు మంచి తరుణం. ఇది మంచి పై చెడు విజయం. అందువల్లనే మహాప్రవక్త ఆచరణాత్మకంగా బోధించిన వివాహ ప్రసంగం ఎంతో శుభప్రదమయింది. అది మహా వరప్రసాదమని చెప్పవచ్చు. ఇందులో ఇహపర జీవితాలకు సంబంధించిన అసంఖ్యాకమయిన మేళ్ళు ఉన్నాయి.
వాస్తవానికి ఈ ప్రసంగాన్ని అర్ధంచేసుకోకుండా, ఓ ఆచారంగానో, లాంఛనంగానో భావిస్తున్నారు. మన జీవితాల్లో దాని భావాన్ని, ఉద్దేశాన్ని ఇనుమడింపచేసుకునే అవకాశం కనిపించుటలేదు.
మహాప్రవక్త ప్రవచించిన ఆ ప్రసంగ సారాంశాన్ని తరువాత టపాలో తెలుసుకుందాం. ..............సశేషం

Saturday, January 1, 2011

మరో మొగ్గ...



కాలం ఎంత విచిత్రమైంది. వెయిట్ చేస్తే భారంగా కదులుతున్నట్లనిపిస్తుంది.
కష్టకాలమయితే ఎడారి ఎంతకీ తరగదనిపిస్తుంది.
సౌఖ్యంగా ఉంటే వేలి సందుల్లోంచి అపుడే జారి పోయిందే అనిపిస్తుంది.
నిన్న మొన్ననే మనం 2000 సం.రం లోకి అడుగు పెట్టామా అనిపించింది..
ఇంతలోనే ఈ దశాబ్దం ముగిసిపోయింది.



మొగ్గలా మరో సంవత్సరం

పువ్వులా వికసించి

పరిమళాన్ని మోసుకొస్తుంది

కనిపించని ముళ్ళతో

కాటు వేస్తుంది..

అంతలోనే వాడిపోయి

మరో మొగ్గకు జీవం పోస్తుంది....

బ్లాగు మిత్రులందరికి
నూతన సం వత్సర శుభాకాంక్షలు....

Saturday, October 9, 2010

ఈ కధకి పేరు పెట్టండి..









నగరాన్ని పిండితే రాలినట్లు రోడ్లన్నీ జనమయం. ఎవరి బిజీ లోవాళ్ళు. ఆఫీసులకెళ్ళే వాళ్ళు. పిల్లలని స్కూలుకి, కాలేజీలకి తీసుకుని వెళ్ళేవాళ్ళు, రోడ్లు క్రాస్ చేయడానికి ప్రయత్నిస్తూన్నవాళ్ళు కొబ్బరి బొండాలు, కూరగాయలు, చేపలు, రొయ్యలు అమ్మేవాళ్ళు ఎవరి అవసరాల్లోవారు. రావాల్సిన బస్సు కోసం అసహనంగా అటూ, ఇటూ చూస్తూంది కాజల్. ఎదురుచూసే బస్సు రాకుండా ఎక్కడికి పోతుంది. బస్సు వచ్చేవైపే కాదు, రాని వైపుకూడా చూడటం ఆరాటానికి పరాకాష్ట. అయితే రావాల్సిన బస్సు కంటే వేగంగా ఆమె ఆలోచనలు పరిగెడుతున్నాయి. సరిగ్గా నిన్న ఇదే సమయానికి జరిగిన సంఘటన తన కళ్ళముందు కదలాడింది. .

నిన్న బస్సు కోసం ఎదురు చూస్తూన్నపుడు ఎవరో ఒక ఇరవై, ఇరవైఐదు సంవత్సరాల యువకుడు రోడ్డు క్రాస్ చేస్తూ బైక్ గుద్ది పడిపోయాడు. అందరూ అతన్ని ముందు తిట్టినా తరువాత అతడు గుడ్డివాడని తెలిసి జాలిపడి బైక్ అతన్ని తిట్టారు.

తనకేమీ పట్టనట్లు అతను నవ్వుకుంటూ తను వెయిట్ చేస్తున్న బస్టాప్ దగ్గరకి వచ్చేడు. నెమ్మదిగా నడుచుకుంటూ తనకు దగ్గరగా వచ్చి... ఏవండీ 28 వచ్చిందాండి. అందం, ఆకర్షణ అన్నీ ఉన్న ఇతనికి దేవుడు అన్యాయం చేసాడనిపించింది. ఏవండీ మిమ్మల్నే... ఉలిక్కి పడింది కాజల్...ఇంకా రాలేదండి. నేనూ దానికోసమే వెయిట్ చేస్తున్నాను. రాంగానే మిమ్మల్ని ఎక్కిస్తాను. చాలా ధాక్సండి.. మీకెందుకండి శ్రమ ..నేనెక్కగలను. బస్సు వచ్చినపుడు చెప్పండి చాలు. మీరేమనుకోనంటే ఒక చిన్న మాట..మాలాటి వికలాంగుల మీద సానుభూతి చూపించండం నాకిష్టం ఉండదండి. అది మా ఆత్మవిశ్వాసాన్ని దిగజార్చుతుందని నా భావన. వీలయినంత వరకూ ఎవరి మీద ఆధార పడకుండా మా పనులు మేము చేసుకోవడంలోనే మాకు తృప్తి ఉంటుందండి.

ఐయామ్ సారి నా గురించి చెప్పనేలేదు కదూ. నా పేరు ఉదయ్. అనాధాశ్రమంలో జీవన ప్రస్థానం మొదలైంది. రైల్వే న్యూకాలనీలో ఉన్న బ్లైండ్ స్కూల్లో టీచర్ గా వర్క్ చేస్తున్నాను...మీరు ఏ కాలేజిలొ చదువుతున్నారు. మీరు కాలేజి చదువుతున్నట్లు ఎలా తెలిసిందని అవాక్కయ్యారా ? ఇందులో విచిత్ర మేముందండి. మీరు వాడే పెర్ఫ్యూమ్ కాలేజ్ స్టూడెంట్స్ తప్ప మరెవరూ వాడరు కదా. తను నిజంగానే అవాక్కయింది. నోటమాట రాలేదు. మాట్లాడే అవకాశము రాలేదు. తన నిశ్శబ్దాన్ని ఛేధిస్తూ 28 బస్సు హారన్ మ్రోగింది. చూస్తుండగానే అతను బస్సు ఎక్కడం, తరువాత హడావుడిగా తను ఎక్కడం జరిగిపోయింది. బస్సులో విడివిడిగా కూర్చున్నా ఒకరు మరొకరి గురించి ఆలోచిస్తూనే ఉన్నారు. ఆలోచనలో ఉండగానే అతని బస్టాప్ వచ్చింది. తను దిగిపోయాడు.

బస్సు కదిలింది. వెంటనే తను సీట్లోంచి లేచి అంకుల్ కొంచెం స్లో చేయరా నేనిక్కడే దిగాలి. స్టాప్ లో దిగాలమ్మా, ఎక్కడపడితే అక్కడ బస్సాపరు అంటూనే బస్సు స్లో చేసాడు. దిగి వెనక్కి చూసింది. చాలా దూరంలో ఉన్నాడు. మళ్ళీ ఆలోచనలు..... తను దిగాల్సింది మరో రెండు స్టాపుల తర్వాత. మరి ఇక్కడ ఎందుకు దిగింది. అతని గురించా ? అతనితో ఏం మాట్లాడుతుంది తనకే తెలియదు. సెల్ తీసుకుని మాధవికి ఫోన్ చేసి అటెండెంస్ మేనేజ్ చేయమని చెప్పింది. ఇపుడేం చేయాలి. వెనక్కి చూసింది. అతనెవరితోనో మాట్లాడుతూ నెమ్మదిగా నడుచుకుంటూ వస్తున్నాడు. తను నడక మొదలు పెట్టింది. దగ్గర కొచ్చేకా...అరె మీరా... మీరిక్కడే దిగారా ? కాలేజ్ కి వెళ్ళలేదాండి.

లేదండి..ఇక్కడ ఒక అంకుల్ వాళ్ళింటికి వెళ్ళాలి. ఆ పని అయిపోయాకా కాలేజికి వెళతాను. తనకి తెలుసు అది అబధ్ధం అని....బహుసా అతనికి కూడా.. అయినా ఎందుకు చెపుతున్నట్లు.. ఆతన్ని చూడంగానే పరిచయం పెంచుకోవాలని ఎందుకనిపించింది. అదీ తెలియదు. ఇరువురు పరిచయాలు చేసుకోంగానే అతని స్కూలు వచ్చేసింది.

బస్సు హారన్ మ్రోగేసరికి ఊహల్లోంచి బయట పడింది. కొంచెం దూరంలో ఉదయ్ ఉన్నాడు. తనొచ్చేవరకూ బస్సు ఆపింది. రోజు ఇలాగే కలుసుకోవడంలో వారి అనుబంధం పెరిగింది.
తను కూడా అనాధే. చిన్నప్పటి నుండి ఒక దాత చదివించాడు. అతను కాస్తా మరణించేసరికి ఆమె చదువు మధ్యలోనే ఆగిపోయింది. వర్కింగ్ విమెన్ హాస్టల్ లో ఉంటూ ఏదో చిన్న షాపులో పార్టైమ్ స్టోర్స్ మేనేజర్ గా పనిచేసుకుంటూ చదువు కుంటుంది.

ఇద్దరికీ కులం, మతం అడ్డుగోడలు లేవు. తల్లి దండ్రుల ఆంక్షలు లేవు. సో... వారి ప్రేమకి ఎల్లలు లేవు. అలాగని ఎవరూ హద్దులు దాటలేదు.

తరచూ పార్కుల్లోనూ బీచ్ ల్లోనూ కలుసుకోవడం వారిని వివాహ బంధానికి దారి తీసింది.

ఒక రోజు....నాకు కళ్ళు వచ్చే అవకాశాలున్నాయని డాక్టర్లు చెప్పారు. నేత్రదాతలకోసం వెతుకుతున్నాను. నాకు చూపు రాగానే మనిద్దరం పెళ్ళి చేసుకుందాం అన్నాడు.

ఆ రోజు రాత్రి కాజల్ కి నిద్రపట్టలేదు. ఎలాగైనా అతనికి చూపు రప్పించాలి. రెండు రోజులు అతన్ని కలవలేదు. ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ చేసింది. అతని రిపోర్ట్స్ చేతబట్టుకుని నగరంలో ఉన్న కంటి హాస్పటల్స్ చుట్టూ తిరిగింది. మొత్తానికి శంకర్ ఫౌండేషన్ హాస్పటల్ లో అపాయింట్ మెంట్ సాధించింది.

మరో పది రోజుల్లో అతనికి ఆపరేషన్. ఈ విషయం అతనికి చెప్పింది.
తన చీకటి తెరలు తొలగిపోయే రోజుకోసం ఇద్దరూ ఉత్కంఠతో ఎదురుచూసారు.
కళ్ళు వస్తే ఈ లోకంలోని రంగులన్నీ తెలుస్తాయి.
ప్రకృతిలోని అందాలన్నీ చూడగలుగుతాడు.
ఆ ఊహే అతణ్ణి ఉద్వేగపరచింది.
ఆపరేషన్ అవ్వంగానే కళ్ళు తెరచి మొదట తననే చూడాలని అన్నాడు.
ఆపరేషన్ అయ్యింది.
తను కళ్ళు తెరిచేసరికి ఎదురుగా తన రూపం.. మసక మసకగా క్రమంగా రూపుదిద్దుకుంది.

అతని మనో నేత్రంలో ఆమె రూపం సజీవంగా..... ఎదురుగా.....
పెళ్ళి గురించి అడిగింది..చూద్దాంలే..అప్పుడేనా...తర్వాత మాట్లాడుకుందాం...
డిస్చార్జ్ రోజున అడిగింది...ఆలోచిస్తాన్లే అన్నాడు....
అతనికి దగ్గరగా వచ్చింది.. కళ్ళని ముద్దాడింది....
నా కళ్ళు జాగ్రత్త......అని వెళిపోయింది.....

నగరాన్ని పిండితే రాలినట్లు రోడ్లన్నీ జనమయం. ఎవరి బిజీ లోవాళ్ళు. ఆఫీసులకెళ్ళే వాళ్ళు. పిల్లలని స్కూలుకి, కాలేజీలకి తీసుకుని వెళ్ళేవాళ్ళు, రోడ్లు క్రాస్ చేయడానికి ప్రయత్నిస్తూన్నవాళ్ళు కొబ్బరి బొండాలు, కూరగాయలు, చేపలు, రొయ్యలు అమ్మేవాళ్ళు ఎవరి అవసరాల్లోవారు.

కళ్ళ చుట్టూ ఉండాల్సిన కాటుక (కాజల్) చీకటిని కళ్ళల్లో నింపుకుని....
రావాల్సిన బస్సు కోసం అసహనంగా ఎటో చూస్తూంది కాజల్....