Wednesday, September 23, 2009

మరింక శెలవ్.

Despair shall forsake me

మరింక శెలవ్.
ప్రపంచ మంతా ఆవగింజలా
ఇమడ్చుకుని
చూపుల కాన్వాసుని
విశ్వమంతా పరచిన
కళ్ళు మూతలు పడిపోతూన్నాయి.

ఎక్కడో స్వరపేటిక మూలాల్లో
ఇరుక్కుపోయిన వాయువు
సంధించిన ఆఖరి ప్రకంపనలు
దేహం నుండి ప్రాణానికో
ప్ర్రాణం నుండి ఆత్మకో
మరింక శెలవు.

ఏదో అంటున్నట్లే వుంది.
ఎవరికీ వినబడుతున్నట్లు లేదు
అందరూ చూస్తూనే ఉన్నారు
దృశ్యాలన్నీ మేఘాల్లా
కరిగి పోతూన్నాయి
శక్తినంతా కూడదీస్తేనే కానీ
ఏ బంధమూ తెగేటట్లు లేదు.

ఊపిరి నెవరో బలవంతంగా
వేళ్ళతో ఊడపెరుకుతున్నట్లే ఉంది
అంగాంగాలన్నీ ఎవరికో
అర్పించుకుంటున్నట్లుగా
ఒకటి ఒకటిగా దూరమైపోతూన్నాయి.

చెవులు రెండూ చిల్లు పడవల్లా
శబ్ద సముద్రాల్లో మునిగిపోతూంటే...
పాదరస మట్టం
పాతాళాన్ని ముద్దాడుతూంటే...

మనసు కేటలిష్టయి
మస్థిష్కంలో మొదలయిన రశాయనిక చర్య
గొంతు గుండెలోంచి శబ్ద తరంగాలై.....
'ఇప్పుడిప్పట్లో పోయేటట్లు లేడు'
వేచి చూడాలి..ఏం చేస్తాం.
పెద్దకొడుకు సర్దుబాటు ?
ఫెటీల్మని కర్ణభేరి పగిలిన శబ్దం

'రాతకోతలన్నీ అయినట్లేనా ?'
రెండో కోడలి అనుమానం ?
ఛెళ్ళుమన్న కొరడాదెబ్బలా !

అవన్నీ ముందే జాగ్రత్త పడమన్నానుగా
కూతురి ముందు చూపు ?
కరెంటు షాక్ తగిలినట్లుగా !

అఖండ తేజస్సు
నన్ను ఆవహించేవేళ
నేను ప్రశ్నిస్తూన్నాను...

ఓ భగవాన్ !
ప్రేమిస్తే ప్రేమించబడతానన్నావు...
పిచ్చివాడా ?
న్యూటన్ నియమాలకెప్పుడో
నీళ్ళు చెల్లిపోయాయి...
ఈ కవిత తెలుగురత్న అక్టోబరు సంచిక లో ప్రచురితమైనది. దాని లింకును ఇక్కడ ఇస్తున్నాను.
http://teluguratna.com/content/view/277/26/

10 comments:

  1. సంస్కారమే నరుని నారాయణు గా మారుస్తుంది.
    జీవితాన్ని డబ్బుతో కాదు
    ప్రేమతో కొనుక్కో
    ప్రేమను వంచనతో కాదు
    మనసుతో గెలుచుకో
    ఇది అర్ధం కాని నాడు మానవ సంబంధాలు 'ఆర్ధిక సంబంధాలే'
    చాలా మంచి భావాలను పంచిపెట్టారు. మనసు భారంగా ,ఎంతో వేదన నింపింది.

    ReplyDelete
  2. ఎపుడో మరణం గురించి ఇలా వ్రాసుకున్నాను,

    కాలం కూల్చిన గతపు శిథిలాల్నుండి ఎవరో పిలిచినట్లు,
    నేటి నిట్టూర్పుల వేడికి రేపటి కలల మంచు కరిగే వేకువలో,
    బ్రతుకు కొమ్మపై, వూపిరి చిగురులు త్రుంపేస్తూ,
    తపించే మనస్సుకి మరుజన్మ వరకు మరి రానని
    మాటిచ్చి వెంటపెట్టుకుపోతుంది మరణం.

    కానీ ఆ మరణంలోనూ నరకయాతన వుంటుందని చివరికి మరణమే మిత్రునిగా తోస్తుందనిపించేంత వేదన ఈ కవితలో...

    ReplyDelete
  3. మీరు ఆధ్యాత్మికంగా ముగిస్తారనుకున్నా, బంధాలతో ముడిపెట్టారా...

    ReplyDelete
  4. చాలా బాగుంది.
    మరణ శయ్య మీదున్నపుడు మనో భావాలని చాలా చక్కగా చిత్రీకరించారు.

    ReplyDelete
  5. నిజమే
    life is like that.

    మంచి వస్తువు. ఆర్ధ్రంగా ఆవిష్కరించబడింది.

    బొల్లోజు బాబా

    ReplyDelete
  6. బాగుంది. నేనూ ఈ ఫీల్ తో ఒక కవిత రాసాను. చూడండి.జూం నెలలో నా సహవాసి బ్లాగులో http://www.sahavaasi-v.blogspot.com/. మన భావం దగ్గరగా వుందని.

    ReplyDelete
  7. జయ గారికి,
    ధన్యవాదములు, ఇపుడంతటా ఆర్ధిక సంబంధాలే ఎక్కువగా కనిపిస్తున్నాయండి. నా భావన లోని ఆర్ద్రతని అర్ధం చేసుకున్నారు.

    ఉష గారికి
    మీ కవిత నా భావనని మరింత ఎలివేట్ చేసింది. మీ కవిత చాలా బాగుంది. ధన్యవాదములు.

    బృహ:స్పతి గారికి,
    ఈ మధ్య ఒక ఫ్రెండ్ వాళ్ళ బంధువు చివరి ఘడియల్లో నేను విన్న మాటలు కవితలో బోల్డు టైపు చేసాను.
    ఇది ఎంత అమానుషం, నీచమో అనిపిస్తుందికదూ. దీన్ని ఆధ్యాత్మికంగా ముగించ లేక పోయాను.

    సునీత గారికి
    ధన్యవాదములు, I removed word verification
    Thank you.

    సాయిసాహితి గారికి
    ధన్యవాదములు.

    బాబా గారికి
    ధన్యవాదములు.

    కుమార్ గారికి
    ధన్యవాదములు
    తప్పకుండా చూస్తాను.

    మరోసారి అందరకీ ధన్యవాదములు.

    ReplyDelete
  8. మనిషి విలువను అతనికున్న ఆస్తితో పోల్చే మానవనైజాన్ని చక్కగా తెలుపుతోంది మీ కవిత...బాగుంది.

    ReplyDelete