Sunday, January 17, 2010

బూరె పోయె ...బుధ్ధి వచ్చే !!


ఏవిటి..బూరెపోవడమేంటి బుధ్ధి రావడమేమిటి అనుకుంటున్నారా? ఇది వివరంగా చెప్పాలంటే.... కొంచెం చరిత్రలోకి వెళ్ళి అపుడు వర్తమానం లోకి వస్తాను. చిన్నప్పటినుండి బూరెలంటే నాకు చచ్చేంత ఇష్టం. అసలు..బాగా చిన్నప్పుడయితే బూరి నాకొక మిస్టరీ.
బూరె లోపలికి ఆ పూర్ణం ఎలా వెళ్ళిందబ్బా.... అని.

ఏ సినిమా తీసినా ఐటమ్ సాంగ్ ఎంత కంపల్సరీయో


చిన్నప్పటినుండి మా ఇంట్లో ఏ పండుగ చేసినా
మెన్యూలో
బూరె ఐటమ్ ఉండాల్సిందే.
సో.. అలా నా జీవితం బూరితో తీయని

అనుబంధాన్ని పెనవేసుకుంది.

ఎక్కడ ఏ ఫంక్షనికి వెళ్ళినా నా కళ్ళు బూరెల కోసమే వెతికేవి.
బంధు వర్గాలలో
ఈ విషయం తెలిసిపోయి
చిన్నప్పుడు నన్ను
ఏడిపించేవారు కూడా..
చిన్నప్పటినుండి గారాల పట్టీని కాబట్టి వంట
నేర్పలేదు.(నేర్చుకోలేదు) పైగా సగం జీవితం
చదువులకే సరిపోయింది. బూరెలు
తినడం మీద ఇంట్రస్ట్ పెంచుకున్నానే తప్ప
వాటిని వండడం నేర్చుకోవాలని ఎపుడూ అనుకోలేదు.

పెళ్ళయ్యాకా తెలిసింది మావారికి కూడా బూరెలంటే మహా ఇష్టమని.....
అప్పుడే
నేనో నిర్ణయం తీసేసుకున్నాను.
ఎలాగయినా బూరెలు వండటం నేర్చుకోవాలి.

మరొహటేంటంటే నాకు బూరెలు వండడం

రాదని ఆయనికి తెలిసి పోయింది.

వెంటనే దీని గురించి స్టడీ చేయాలనుకున్నాను.
అయితే ఎలా...?
ఎవర్నయినా అడగాలంటే చిన్నతన మనిపించింది.
మా వారు నా బాధ నర్ధం చేసుకుని..

ఓ రోజు...
నీకో విలువయిన గిఫ్టు తెచ్చానోయ్.
ఏవిటండీ..వంట చేస్తున్నాను..

అబ్బ ! కాసేపు ఆ స్టౌ ఆపి ఇటు రావే
చూద్దువుగాని..
ఇక తప్పేటట్టు లేదు. స్టౌ ఆపి వెళ్ళాను.
ఆయన చేతిలో ఒక గిఫ్టు పాక్.

ఏవిటండీ...నక్లెస్సా !..మొఖం చాటంత చేసుకుని..

ఛీ..ఛీ..అంత కంటే గొప్పదోయ్.
అంటూ నా చేతిలో పెట్టారు.
ఓపెన్ చేయ్...

మెల్ల మెల్లగ ఓపెన్ చేసేసరికి
చేతిలోంచి జారిపడింది...
' అన్నపూర్ణ - వంటలు, పిండివంటలు ' పుస్తకం.
వంటలు రావని భార్యని ఛీదరించుకొని

బాధలు పెట్టిన భర్తలెందరినో చూసాను.

కాని మావారు ఎంత మంచి వారో...వంటల పుస్తకం
తీసుకొచ్చి నేర్చుకోమని అవకాశం
ఇవ్వడం,
ఆయన ప్రోత్సాహం నన్ను
మరింత రెచ్చగొట్టింది.
ఈ రోజెలాగైయినా బూరెలు వండుతానండి...
వంట అయిపో్యాకా బూరెలు ఐటం చదివాను.

ఒక్క సారే మనసంతా తేలికైపోయినట్లయింది..

ఏవండీ చూసారా! బూరెలు వండడం చాలా ఈజీ.
అయితే ఈ రోజు స్పెషల్ ...బూరెలన్నమాట....మావారు..

వెంఠనే పప్పు నానబెట్టేసాను...

సూచనల ప్రకారం ఫాలో అయిపోయాను.

ఆయనయితే వండబోయే బూరెలను తలచుకొని
గాల్లో తేలిపోతునట్లు న్నారు. పిల్లలనిద్దరిని తెగ ఆడించేస్తూన్నారు.
నిజం చెప్పొద్దూ...నా పరిస్థితి అలాగే ఉంది.

ఇంత పెద్ద సమస్య ...ఎంత సింపుల్ గా తీరిపోతుందా ని...

పప్పు గ్రైండర్ లో వేసి పక్కన పెట్టుకున్నాను.

ఇపుడు పూర్ణం తయారీ...

పూర్ణం కలుపుతుంటుంటే
మెల్ల మెల్లగా
అది పలుచగా తయారయింది.

అది వుండలు చేసుకునే వీలు లేదు. అంతా వేస్ట్.

ఎందుకలా తయారయిందో అర్ధం కాలేదు.

మరో ప్రక్క బూరెల వంట ఫెయిలయిందే అన్న బాధ...

వెనకనుంచి మావారు..

నెవర్ మైండ్..ఫస్టైమ్ కదా. నెక్స్టైమ్ బెటర్ లక్...
అంటూ ఆయన బైటకెళ్ళిపోయారు..
నా కోరిక మరింత బలపడింది.
ఈ సారి ఎలాగయినా సాధించాలి.
మరో రోజు...ఒకటికి పదిసార్లు చదివి మొదలు పెట్టాను.
సక్సెస్ ఖాయం అని పిస్తుంది.
నిజమే...సక్సెస్...
దోర దోరగా, వేడి వేడిగా బూరెలు రెడీ....
బూరెను చిదిమి కాసిన నెయ్యిని
మధ్యలో వేసి తింటే...ఆహా ఏమి రుచి !
అని అనుకుంటూంటే...వెనక నుంచి మావారు...
ఎవిటోయ్...చుట్టూ ఉన్న పిండి ఇంత థిక్ గా ఉంది.
ఒకె..ఒకె..నాట్ సో బేడ్..
షిట్ ! మళ్ళీ ఫెయిల్....
No. No. Half lost is half won. అనుకుని
కాన్ఫిడెంస్ బిల్డప్ చేసుకున్నాను.
ఈ సారేమయినా సంక్రాంతికి సాధించాలి.
నా ఫ్రెండ్ సరిత వంటల గురించి
http://www.sailusfood.com/ లోచూడమంది.
ఓహ్.మంచి ఫోటోలతో చాలా బాగుంది సైటు.
ఇంచుమించు ఇందులో కూడా ఒకేలా ఉంది.
చక చకా అన్ని పనులు జరిగి పోయాయ్.
సల సలా కాగుతున్న నూనెలో ఒకటి ఒకటిగా
వేస్తున్నాను....ఝమ ఝమలు ముక్కు
పుటాల్లో గిలిగింతలు పెడుతున్నాయి. ఇంతలో...
ఠాప్...ఠాప్....ఠాప్.....ఠాప్.....?
కట్ చేస్తే....
మంచం మీద నేను..మంచం పక్కన పిల్లలూ
నా పక్కన మావారు.. చేతిలో బర్నాల్....

ముఖం మీద, చేతుల మీద ఆయిల్ చెదిరి

కాలిన బొబ్బలపై బర్నాల్ రాస్తూ.. ఏమోయ్...

Half lost may also be lost forever.
ఇదెందుకో నీకు కలసి రాలేదు.
మనం
హోం ఫుడ్స్ నుండి తెచ్చుకుందామ్లే..
అయినా.. నా హెల్మెట్, నీ కిచెన్ గ్లవ్స్

వేసుకో లేక పోయావా ?

Thursday, January 14, 2010

సమ్..క్రాంతి.

సంక్రాంతి వచ్చిందంటే...నాకు రెండు టెంషన్లు...
ఒకటి పండగదైతే..మరోటి..ఇంతకంటే ఎక్కువది..
ఈ నెలలోనే వచ్చేది...మా అమ్మాయి
యమున పుట్టిన రోజు.
తను చేసే హడావిడి అంతా ఇంతా కాదు.
కాలి గోళ్ళ రంగు దగ్గర నుండి నెత్తి మీద పెట్టుకునే క్లిప్పు వరకూ
కనీసం పది షాపులు తిరగాల్సిందే..
ఈ పండగకి షాపులు ఎంత రద్దీగా ఉంటాయో తెలుసుకదా..
24 న పుట్టిన రోజు కదమ్మా..పండగ అయిపోయాకా వెళదామే అంటే
"పండగ అయిపోతే వెరైటీ లుండవ్...
ఇప్పుడే షాపింగు చేయాలి..అంతే
సరే కదాని ముందే కొంటే అవన్నీ పండగకి వాడేస్తాది.
మళ్ళీ పుట్టిన రోజుకి అన్నీ కొనాల్సిందే.
తను ఏదైన అంది అంటే అది జరగాల్సిందే..
లేకపోతే ఇల్లు పీకి పందిరివేసేస్తాది.
ఎపుడైనా ఏమైన అంటే చాలు... ఏ గదిలోకో వెళ్ళి కామ్ గా
మా ఆడపడుచుకి ఫోన్ చేసేస్తాది.
తనంటే మా ఆడపడుచుకి బాగా గారం.
ఆపై మా అత్తగారు.. ఇంట్లో ఉండనే ఉన్నారు.
ఇక వెంటనే ఫోను వచ్చేస్తాది. " ఎందుకొదినా..ఈ సారికి దానిష్టప్రకారమే
కానీయరాదూ.." అంటూ (ఎపుడూ దానిష్టప్రకారమే అన్నీజరుగుతాయి).

ఇక ఈ సం.రం. పుట్టిన రోజు టెంషను గత సం.రమే మొదలయింది.
ఎందుకంటే ఈ సం.రం.తన పుట్టిన రోజు 24 ఆదివారం వచ్చింది.
లాస్ట్ ఇయర్ అంతా గుర్తుకొచ్చినపుడల్లా మాబుర్ర తినీసేది.
పోని తిధుల ప్రకారం చేద్దామంటే 20 న వచ్చింది.
ఆ రోజు స్కూలు శెలవు. ఆమరుసటి రోజు నుంచి స్కూళ్ళు తెరుస్తారు.
ఇహ తన బాధ అంతా ఇంతా కాదు.
' ఇంక నేను కేకు ఎలా కట్ చేస్తాను.
చాకలైట్సు ఎవరికి ఇవ్వాలి ?
మా ఫ్రండ్స్ ఎవరూ ఉండరు'
. ఒహటే ఆందోళన.
సరే ఇంత బాధ పడుతుంది కదాని..మేం బాధ పడి పోయి
ఎలాగోలా ఏదో చేయాలని అనుకుని.. నిన్న షాపింగుకి తీసుకెళ్ళాం.

తనకి CMR షాపింగు మాల్ అంటే ఇష్టం.
ఎందుకంటే అన్నీ ఒకే చోట దొరుకుతాయి.
మీరు నమ్మరు గాని మధ్యాహ్నం రెండు గంటలకు క్లోత్స్ సెక్షనులో అడుగెట్టాం.
బయటకొచ్చేసరికి రాత్రి తొమ్మిదయింది. తన డ్రస్ కొనే కౌంటర్ లో
నలుగురు సేల్స్ గాల్స్ దీని సెలెక్షన్ ధాటికి తట్టుకోలేక
మెల్లగా సైడై పోయారు. ఒక ఇరవయ్ రెండు డ్రస్ లు మాత్రమే ట్రైల్ వేసిందంతే..
చివరికి తేల్చిందేమంటే..... ' ఇది నాన్నగారికి నచ్చింది..
ఇది అమ్మకి నచ్చింది...ఇది నాకు నచ్చింది.
సో మూడు తీసేసుకుంటాను'...
ఢాఢాఢాం .

ఏదో ఉన్న వాళ్ళమే కాని మరీ...ఒక రోజుకి
మూడు డ్రస్ లు కొనేంత రిచ్ కాదు.
తరువాత బంగారం..కొనాలి. డ్రస్ ల దగ్గర అనుభవం
అయిందికదా..అందుకని తనని, మావారిని
ఫుడ్ కోర్టుకి వెళ్ళమని ఆ పని తొందరగా కానిచ్చేసాను.
ఈ గోల్డ్ సర్ప్రైజ్ గా ఇద్దామని ముందే డిసైడ్ అయ్యాం.
షాపింగుకి వచ్చామంటే కంపల్సరీగా హోటల్లో
డిన్నర్ చేయాల్సిందే..లేక పోతే అదో పేచీ..
ఇంటికొచ్చేసరికి పదిన్నర...సెలవులు కదా..
మా బాలు రెచ్చిపోయి టి.వి చూసేస్తున్నాడు.
యమున ఊరికనే ఉండదుకదా......
" ఒరేయ్ అన్నయ్యా... నా బడ్డేకి మూడు డ్రస్ లు
తెచ్చుకున్నాన్రా!చూడు ఎంత బాగున్నాయో..
ఛీ..ఛీ
ఇవేం బాగున్నాయ్..
హె
! చెత్త సెలక్షన్.. పరమ చెత్త సెలక్షన్...!
(మేం హోటల్లో తినివచ్చాం కదాని వాడికి కుళ్ళు)
ఢాఢాఢాఢాఢాం...అది నాకేసి
కొర కొరా
చూస్తోందంటే....
మళ్ళీ కధ మొదలవుతాది..

కొసమెరుపు:

CMR షాపింగ్ మాల్ లో ఏది కొన్నా బిల్ చూపిస్తే
దాదాపు 100 నుండి 150 రూపాయిల విలువ చేసే
తాజా కూరగాయలిస్తున్నారండోయ్..
త్వరపడండి. ఇదే సమ్..క్రాంతి.
బ్లాగ్మిత్రులందరికీ
సంక్రాంతి శుభాకాంక్షలు.

Wednesday, January 13, 2010

భోగి పిడకలంటే తెల్సా?




ఊరు నించి రాత్రే వచ్చాం. ఉదయాన్నే పిల్లల్ని లేపి స్నానాలు చేయించే సరికి
ఎదురు ఫ్లాట్ సరిత గారు కాలింగ్ బెల్ కొట్టి ...
ఏవిటి మీరు రారా ? భోగి మంట వేస్తున్నాం. బాబుని, పాపని తీసుకుని రండి.
అని పిలిచేసి వెళ్ళి పోయారు.
మా ఆడపడుచు అత్తగారికి బాగాలేదంటే విజయవాడ వెళ్ళి రాత్రే వచ్చాం.
సంక్రాంతికి ఏం ఎరేంజ్ మెంట్స్ చేసారో తెలియదు.
పిల్లలిద్దరిని ముందు పంపి తరువాత నేను వెళ్ళాను.
నాలుగున్నరకే చాలమంది అక్కడకి చేరిపోయారు.
మైన్ గేటు కి కొంచెం పక్కగా పెద్ద భోగి మంట వేసారు.
ఇలాటి కార్యక్రమాలంటే ముందుండే మూర్తి గారు నన్ను చూడగానే..
ఏమ్మా ఎపుడొచ్చారు. మీ పిన్నిగారు బాగున్నారా?
ఆ! రాత్రే వచ్చాం అంకుల్. పిన్నికి ఫర్వాలేదంకుల్. కొంచెం లేచి తిరుగుతున్నారు.

భోగి మంట పెద్దదే వేసారు. చుట్టూ చేరిన పిల్లలు చిన్న చిన్న పుల్లముక్కలు తీసుకొచ్చి మంటలో పడేస్తున్నారు.
అంతే కాని ఎవరి చేతుల్లోను భోగి దండలు గాని భోగి పిడకలు గాని లేవు.
ధగ ధగ మండుతున్న భోగి మంటని చూసేసరికి
నా చిన్నప్పటి జ్ఞాపకాలు ముసురుకొచ్చాయి.

మాది అటు పల్లెటూరు కాదు పట్నం కాదన్నట్లుండే ఊరు. పల్లె పండుగలు, సాంప్రదాయాలకు విలువనిస్తూ, పట్టణ నాగరికతకి స్వాగతం పలికే సంధికాలమ్లో నలుగురు అన్నయ్యలు,
ఒక అక్క కి ఒకే ఒక చెల్లి గా పుట్టిన అదృష్టవంతురాలిని.
సంక్రాంతి వచ్చిందంటే ముగ్గుల పుస్తకాలు ఫ్రెండ్స్ షేర్ చేసుకుని రకరకాల ముగ్గులు ప్రాక్టీసు చేస్తూ ఆ సందడే సందడి. నేనింకా చిన్న పిల్లని కాబట్టి అక్క చేస్తుంటే వింతగా చూసేదాన్ని. అందరికంటే చిన్నదాన్నికాబట్టి అందరూ గారంగా చూసుకునేవారు.
ఇహ భోగి పిడకలు గురించి చెప్పాలంటే...చాలాఉంది.
సంక్రంతి వస్తుందంటే నెల రోజుల ముందే అమ్మ పొలం నుండి ఆవు పేడ తెప్పించేది. మా నలుగురు అన్నయ్యలు వాటితో భోగి పిడకలు చేసేవారు. ఒక్కక్కరికి ఒకో దండ వచ్చేటట్టు చిన్ని చిన్ని పిడకలు
వేసి వాటి కి దండగా చేయడానికి చిన్ని కన్నాలు పెట్టేవారు.
మా ఆరుగురికి ఒకో దండ వచ్చేటట్టు చేసేవారు. ఈ పిడకలలో రకాలుండేవండోయ్.
అరిసె పిడకలు అంటే అరిసెల్లా పెద్దవి చేసి ఎక్కువ కన్నాలు పెట్టేవారు.
అరటికాయ పిడకలు అంటే అరటికాయ షేపులో ఉండేవి.
ఇవి అందరకీ సమంగా వేసి భోగి దండలోమధ్య మధ్యలో వేస్తే దండలెంత
అందంగా ఉండేవో.మిగిలినవి చిన్నగా హార్లిక్స్ బాటిల్ మూతంత సైజులో గుండ్రంగా ఉండేవి.
నిజం చెప్పొద్దూ పేడ పిడక దండలైనా గాని ఎంత ముద్దొచ్చేవో..
ఈ పిడకల తయారీలో చిన్న పిల్లని కాబట్టి నన్ను దగ్గరికి రానిచ్చేవారు కాదు.
నాకు మాత్రం అవి ఎప్పుడెండుతాయా అని ఒకటే టెంషన్.
ఎప్పుడు దండలు చేస్తారో అవి ఎంత అందంగా ఉంటాయో
ఊహించుకుంటూ ఆనంద పడి పోయేదాన్ని.అన్నయ వాళ్ళు స్కూలు కెళ్ళినపుడు
మెల్లగా గోడ దగ్గరికి చేరి పిడకలు ఎండాయా లేదా అని ఊడపెరికి చూసేదాన్ని.
అంతేఊడిన పిడకలని అతికించలేం కదా..
సాయంత్రం వాళ్ళు స్కూలు నుండి వచ్చేసరికి వరుసకి నాలుగైదు పిడకలు మిస్సింగ్.
రెండో అన్నయ్య కి నాకు ఎప్పుడూ గొడవే. అంతే అమ్మకి కంప్లైంటు వెళ్ళి పోయేది.
అమ్మ నను కొట్టడానికి, రెండో అన్నయ్య నను పట్టుకోవడం ఇల్లంతా పరుగు పెట్టించి పెట్టించి
చివరకి నాయినమ్మ వెనక్కి దాక్కునేదాన్ని. నాయినమ్మ వాణ్ణి ఒక్క గసురు గసిరేది.
దానికి అందేలా పిడకలు ఎందుకేయాలి?
కొంచెం ఎత్తులో వేయాలని తెలియదా మీకు ? అని తిట్టేది. దాంతో సద్దుమణిగేది.
మళ్ళీ పెద్దన్నయ్య కొత్త పిడకలు వేయడం.. వాటిని నేను చెకింగ్ చేయడం
ఈ గొడవ ఇంచుమించు రోజూ జరుగుతూనే ఉండేది.

ఇపుడు తలుచు కుంటుంటే నవ్వొస్తోంది.
ఇన్ని సరదాల మధ్య నిమ్మదిగా నడుచుకుంటూ
వచ్చిన గంగిరెద్దులా భోగి పండగ వచ్చేది.
ఉదయాన్నే అందరికి స్నానాలు చేయించి కొత్త బట్టలు కట్టుకుని
ఆరుగురుం కవాతు చేసే సైనికుల్లా ఒకరి వెనక ఒకరు భోగి మంట్లో
భోగిదండలు వేసాకా నాన్న భోగి మంట బూడిద
తీసి అందరకి వీబూధి పెట్టేవారు.
అక్క వాళ్ళ ఫ్రెండ్స్ భోగి మంట చుట్టూ తిరుగుతూ పాటలు పాడేవారు.
అమ్మ అక్కని అటువంటి ఆటపాటలకి పంపేది కాదు.
ఇంట్లో ఉన్న అమ్మకీ నాయినమ్మకీ భోగి బూడిద పెద్దన్నయ తీసుకొచ్చే వాడు.
ఇంటికొచ్చేసరికి వేడి వేడిగా టిఫిన్ రెడీ గా ఉండేది.
ఇవండీ నా చిన్నప్పటి భోగి స్మృతులు.
ఇప్పటికీ ఈ రకంగా పల్లెటూరు లో జరుగుతున్నాయి తప్ప
ఈ నగరాలు ఈ సంబరాలకి నోచుకోలేదు.
ఈ మధ్య ఎక్కడో చదివాను. ఈ తరం వారు
ఈ సంక్రాంతి సంబరాల గురించి తెలుసుకోవాలంటే
www.సంక్రాంతి.com లో చూడాల్సిందేనట.

Tuesday, January 12, 2010

అదే చిరునవ్వుతో....

అందమైన పూల పానుపు పై
నీ అంతిమ దృశ్యాలు
నాలో ఘనీభవిస్తూంటాయి...
అవసరం తీరిపోయింది కదా
అందరూ తొందర పడి
నిను సాగనంపేసారు

ఎవరూ మిగలలేదు
మనిద్దరం తప్ప...

నువు లేవన్నది
ఎంత అబధ్ధమో
నేను ఉన్నాను అన్నదీ
అంతే అబధ్ధం..

నీ సమాధి మీద
మన పాప నాటిన
తులసి మొక్క
నన్నే చూస్తున్నట్లు ఉంది.
అవును నిజమే
నాకు కనిపిస్తున్నావు
నన్ను రమ్మంటున్నావు
నేను నడుస్తున్నానా !
నాకే తెలియదు..
నాలో నేను లేను
గుప్పెడు సముద్రాన్ని నింపి
నానుండి నన్ను
నువెపుడో తీసుకు పోయావు.
గది నిండా నీ స్మృతులే
కిటికీ తెరచి చూస్తే
అంతా చీకటి..
నీ చిత్తరువు మాత్రం
అదే చిరునవ్వుతో....


Sunday, January 3, 2010

పెళ్ళి పుస్తకం - 12

హిందూ వివాహ ప్రాశస్త్యము.
పండ్రెండవ భాగము
పాణి గ్రహణము:

బ్రహ్మముడి తంతు లోని మరికొన్ని మంత్రాలు తెలుసుకుందాం....


1.సోమ: ప్రధమో వివిదే గంధర్వోవివిద ఉత్తర:
తృతీయో అగ్నిష్టేపతి స్తురీయస్తే మనుష్యజా:

2.సోమో దద ద్గంధర్వాయ గంధర్వో దద దగ్నయే
రయిం చ పుత్రాగ్ శ్చాదా దగ్ని ర్మహ్యా మధో ఇమామ్.

1. కన్య పుట్టగానే కొంత కాలము సోముడు,కొంతకాలము గంధర్వుడు,
కొంతకాలము అగ్ని కాపాడుతారు. వారిని హోమ ప్రార్ధనాదుల గావించి
సంతృప్తి పరచి వారివలన పొందిన కన్యకు తాను పతి యగును.

2. సోముడు నిను గంధర్వుని కిచ్చెను, గంధర్వుడు నిన్ను అగ్ని కిచ్చెను.
నేను నిన్ను కాపాడవలసిన నాల్గవ వాడను. అగ్ని నాకు నిన్ను,
పుత్రులను ప్రసాదించుగాక.
అని అభి మంత్రించి పెళ్ళికూతురు చేయి పట్టుకొంటాడు.
దీనినే
పాణిగ్రహణము అంటారు.
ఇక్కడ ప్రధాన మైన రెండు మంత్రాలను,వాటి అర్ధాలను చూద్దాం.

'గృహ్ణామితే సుప్రజాస్త్వాయ హస్తం
మయావత్య జరదృష్టిర్య దాసహ'


పెద్దలు ఎట్లు ఆచరించిరో అట్లే నేనునూ మంచి సంతతి కొరకు
నీ హస్తమును గ్రహించుచున్నాను.

'మూర్దన్వాన్ యత్రసౌభ్రవ:పూర్వ దేవేధ్య ఆతపత్
సరస్వతి ప్రేమదన సుషగే వాజినీవతి'


మన పూర్వులగు సుభ్రులు శిరోధార్యమగు శీలముతో ఎట్లు వెలుగొందిరో
అట్లు వెలుగొందునట్లు ఈమెను సరస్వతి లోకములోని జీవులకు
అగ్రగణ్యగా నిన్ను చేయు గాక ! అని వరుడు మంత్రాలు పఠిస్తాడు.

సప్తపది:

అంటే వరుడు వధువుని చేయి పట్టుకుని అగ్ని హూత్రము
చుట్టూ ఏడు అడుగలు వేస్తాడు.
ఈ ఏడడుగులలోను వరుడు వధువుని ఏడు కోరికలు కోరతాడు.
ఈ ఏడడుగులు ఏడేడు జన్మల అనుబంధాన్నిస్తుంది.
ఈ ఏడడుగులకు ఏడు మంత్రాలను పఠిస్తాడు.
ఈ సప్తపది పూర్తి కాని ఎడల వివాహము పూర్తి కానట్లే...

అగ్నికి ఉత్తరం వైపున కుడికాలు మొదట పెట్టి ప్రాద్దిక్కుగా గాని
ఉత్తర దిక్కుగా గాని వధువుని నడిపించుచూ ఏడు మంత్రాలు
చెపుతాడు.

1. ఏకమిషే విష్ణు స్త్వాన్వేతు
2. ద్వే ఊర్జే విష్ణు స్త్వాన్వేతు
3. త్రీణి వ్రతాయ విష్ణు స్త్వాన్వేతు

4. చత్వారి మయోభవాయ విష్ణు స్త్వాన్వేతు

5. పంచ్వశుభ్యో విష్ణు స్త్వాన్వేతు

6. షడృతుభ్యో విష్ణు స్త్వాన్వేతు

7. సప్తభ్యోత్రాభ్యో విష్ణు స్త్వాన్వేతు


భావం:

ఓ చిన్నదానా ! నీవు నావెంట నడువుము
విష్ణుమూర్తి నీవు వేసే....
మొదటి అడుగువల్ల అన్నాన్ని,
రెండవ అడుగువల్ల బలాన్ని,
మూడవ అడుగువల్ల మంచి కార్యాలను,
నాల్గవ అడుగువల్ల సౌఖ్యాన్ని,
ఐదవ అడుగువల్ల పశుసమృధ్ధిని,
ఆరవ అడుగువల్ల ఋతుసంపదను,
ఏడవ అడుగువల్ల ఏడుగురు హోతలను
నీకు ఇచ్చుగాక.

ఇవికాక వరుడు కొన్ని మంత్రాలను,
వధువు కొన్ని మంత్రాలను, ఇరువురు కలసి
కొన్ని మంత్రాలను పఠిస్తారు.
ఇవి భార్యా భర్తల అనుబంధాన్ని,భాద్యతలను వివరిస్తాయి.
అవి తరువాయి టపాలో....

కొసమెరుపు:
1. దక్షిణాఫ్రికాలోని కొన్ని జాతులలో వివాహ వేడుకలలోభాగంగా... వారి జీవితాలలో ముఖ్యమైనవిగా భావించే 12 వస్తువులని (ద్రాక్ష సారాయి,గోధుమలు,మిరియాలు, ఉప్పు, చేదు రుచినిచ్చే కొన్ని మొక్కలు,నీటి కుండ,చెంచా, చీపురు,తేనె, ఒక వ్యవసాయ పనిముట్టు, ఒక రక్షణ కవచం, బైబిల్ పుస్తకం) వివాహ తంతులోఉంచుతారు. వధూవరుల రెండు కుటుంబాల ప్రేమానురాగాలకు ప్రతీకలుగా వీటిని భావిస్తారు.

2. మరికొన్ని జాతులలో వధూవరుల తల్లిదండ్రులు
వారివారి ఇళ్ళనుండి కొలిమిలోని అగ్నితో వధూవరుల గృహం లో కొలిమి ని వెలిగిస్తారు.







Friday, January 1, 2010

2009-2010 ఒక విచిత్రం.



బ్లాగ్మిత్రులందరికీ
నూతనసంవత్సర శుభాకాంక్షలు

మనం మరో 1000 సంవత్సరాలు బ్రతికితే
3009-3010 చూడగలం.
ఇది అసంభవం కదా
ఇలా మొదటి దశాబ్దం చూడడం ధ్రిల్లింగా లేదూ...........