Showing posts with label అందమైన పూలు. Show all posts
Showing posts with label అందమైన పూలు. Show all posts

Thursday, March 22, 2012

నిలువెల్ల కనులై...

చుస్తూన్నా నందనా నీ రాకకోసం
నీ వెన్నంటి వచ్చే వసంతానికై
వాడియైన చేతలతో
ఖరనామ సమ్వత్సరం
మిగిల్చింది వేడివేడి వాతలు
మధ్యతరగతి జీవితాలపై
ధరల వరల మోతలు

కొంగ్రొత్త చిగురుల సోయగాలతో
కనకాంబర అంబరాలలో
ముద్దబంతి మాలలతో
ముచ్చటగా ముద్దులొలికే
ముగ్ధ మనోహర వసంతలక్ష్మీ స్వాగతం

మా మానస వనమ్లో
ఆనంద మందారాలను
విరబూయ నందనా
నీకు స్వాగత వందనం

రాష్ట్రం సుభిక్షమై
నందన నామ ఉగాది
కావాలి అందరి
ఆనందానికి పునాది.

బ్లాగ్మిత్రులందరికీ
శ్రీ నందన నామ శుభాకాంక్షలు

Saturday, January 14, 2012

నది నడచిన జ్ఞాపకం

సంక్రాంతి వచ్చిందంటే
మా ఊరిలో దాచుకున్న
జ్ఞాపకాల మూటని విప్పుకుంటాను
అడుగడుగున గొబ్బెమ్మలు
అందమైన ఆడపడుచులు
గొబ్బెమ్మల ఆటపాటలు
గంగిరెడ్ల నృత్య విన్యాసాలు
డూడూ బసవన్న గంటల గలగలలు
హరిదాసుల హరినామ స్మరణలు
ఇలా ఎన్నో ఎన్నెన్నో
అదృ శ్య దృశ్యాల మీద
నగ్నంగా విహరిస్తూంటాను

నాఊరి గడప గడపనుండి
సంక్రాంతి సంస్కృతీ నది
వీధి వీధినా నడిచిన జ్ఞాపకం....

నగరీకరణ వరదలో
నా ఊరు..
నీరు లేని నదిలా
నగరంలో నేను
నీరులేని చేపలా


బ్లాగ్మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు

Tuesday, January 12, 2010

అదే చిరునవ్వుతో....

అందమైన పూల పానుపు పై
నీ అంతిమ దృశ్యాలు
నాలో ఘనీభవిస్తూంటాయి...
అవసరం తీరిపోయింది కదా
అందరూ తొందర పడి
నిను సాగనంపేసారు

ఎవరూ మిగలలేదు
మనిద్దరం తప్ప...

నువు లేవన్నది
ఎంత అబధ్ధమో
నేను ఉన్నాను అన్నదీ
అంతే అబధ్ధం..

నీ సమాధి మీద
మన పాప నాటిన
తులసి మొక్క
నన్నే చూస్తున్నట్లు ఉంది.
అవును నిజమే
నాకు కనిపిస్తున్నావు
నన్ను రమ్మంటున్నావు
నేను నడుస్తున్నానా !
నాకే తెలియదు..
నాలో నేను లేను
గుప్పెడు సముద్రాన్ని నింపి
నానుండి నన్ను
నువెపుడో తీసుకు పోయావు.
గది నిండా నీ స్మృతులే
కిటికీ తెరచి చూస్తే
అంతా చీకటి..
నీ చిత్తరువు మాత్రం
అదే చిరునవ్వుతో....