Thursday, April 22, 2010

ప్రపంచ పుస్తక దినోత్సవ విశేషాలు ...


ఏప్రిల్ 23 ప్రపంచ పుస్తక దినోత్సవం.
పాఠకుల్లారా ప్రపంచ పుస్తక దినోత్సవ శుభాకాంక్షలు.

ఈ రోజు ప్రపంచ పుస్తక దినోత్సవం గా పరిగణించడానికి విభిన్న కధనాలున్నా చాలా మంది ఒక ఏకాభిప్రాయానికి వచ్చిన కొన్ని అంశాలు.
1. సెవాంతెస్, షేక్సిపియర్, ఇన్కా గర్సిలాసో, వేగా అను రచయితలు 1616 ఇదే రోజున మరణించారు.
2. అంతేకాదు జోసెఫ్ ప్లా, వ్లాదిమర్, మారిస్ ద్రువాం ఇలా ఇంకా చాలా చాలా మంది ప్రపంచ ప్రఖ్యాత రచయితలు ఇదే రోజున మరణించడమో, జన్మించడమో జరగడం విశేషం.
3. ఇదే రోజున సెయింట్ జార్జ్ జన్మదినాన్ని స్పెయిన్ లో జరుపుకుంటారు. ఇప్పటికీ స్పెయిన్ లో ప్రతి పుస్తక కొనుగోలు పై ఒక గులాబీని గిఫ్ట్ గా ఇస్తారు.
ఇన్ని ప్రత్యేకతలున్న ఈ రోజును1995 లో యునెస్కో ప్రపంచ పుస్తక దినం గా ప్రకటించిండమేకాదు, ప్రపంచ పుస్తక మరియు కాపీ హక్కుల దినం గా జరపాలని, రచయితలను, ప్రచురణకర్తలను, పాఠకులను, ఉపాధ్యాయులను ఈ రోజున గౌరవించాలని సూచించింది. అంతర్జాలం, మీడియా కొంతవరకూ పుస్తకం మనుగడను అడ్డుకుంటున్నాయి. అందుకే..
పుస్తకాన్ని కొందాం. పుస్తకాన్ని బ్రతికించుకొందాం.
యుకె లోను ఐర్లాండులోను ప్రపంచ పుస్తక దినం ఒక ఘనమైన వేడుకగా జరుపుకుంటారు. ఆన్ లైన్లో రచయితలు తమ రచనలను చదివి వినిపిస్తారు. పాఠశాలలలో పుస్తక పఠనా పోటీలు నిర్వహిస్తారు. వీటినే రీడథాన్ (Readathon) అనడం విశేషం. అమెరికాలోనైతే వేల కొలది ఇ-బుక్ లను నెట్ లో పెట్టి వాటిలో కొన్ని పుస్తకాల మీద బడి పిల్లలకు ఏక్సలరేటెడ్ రీడింగ్ అనే కాంపిటీషన్ పెడతారు. (ఈ కాంపిటీషన్ ని ఈ సమ్వత్సరం మా స్కూలులో ప్రవేశ పెడుతున్నాం.)
అయితే కొన్ని దేశాలలో ఈ వేడుకను వేర్వేరు రోజుల్లో జరుపుకోవడం విశేషం. ఇది ఇంకా భారతదేశం లో అంత ప్రాచుర్యమ్లోకి రాలేదు.
అసలు ఏ పుస్తకమైనా ఎందుకు చదువుతాం. ఏం అనుభవం లోకి వస్తుంది. ఏ భావనలకు లోనవుతాం. ఏ రకమైన భావోద్రేకాలు ఎలా ఉత్ధాన స్ఠాయికి చేరుకుంటాయి. పుస్తకం లోకి నడవడమంటే... పరిచయ పాత్రలలోకి మనల్ని మనం వంపుకుంటామా ? లేదా మనలని రచయిత తనలో వంపు కుంటాడా? ఇది చాలా చక్కగా బొల్లోజు బాబా గారు తన బ్లాగులో ఒక కవితలో అంటారు..

పుస్తకం లోకి నడవడమంటే.....
ఎప్పుడో, ఎక్కడో, ఎవరో
ఒకడు
దోసెడు అక్షరాల్ని
కాలానికి అర్ఘ్యమిస్తాడు.
పిడికెడు ఆలోచనల్ని ఒడిసిపట్టుకొని
పుస్తకపుటలపై చల్లుతాడు.

ఎప్పుడో, ఎక్కడో, ఎవరో
ఒకడు
ఆ పుస్తకాన్ని తెరుస్తాడు.

ఒక జీవనది వాని గుండెల్లోకి
ప్రవహించటం మొదలౌతుంది.

ఒక సంగీతమేఘం
తేనె పాటల్ని వర్షిస్తూంటుంది.

ఆ రాగ స్పర్శకు వాని మనోయవనికపై
ఓ అపరిచిత అరణ్యం మొలకెత్తుతుంది.
వేన వేల స్వప్నాల పిట్టలు
రివ్వుమంటో ఎగిరి వచ్చి
మనో వనాన వాల్తాయి.
వసంతపు మొగ్గలు
పువ్వులుగా బద్దలవుతాయి.
పరిమళపు భ్రమరాలు ఝుమ్మంటో
వాడిని చుట్టుముడతాయి.

దివా సంధ్యలు, గెలుపోటములు,
సుఖ, దు:ఖాలు, రాగ ద్వేషాలు
అనుభూతి తరువులపై వాలిన
జంట పిచ్చుకలౌతాయి.

కెలడియోస్కోపులో ని
రంగురంగు గాజుముక్కలల్లే
అవే అక్షరాలు అసంఖ్యాక చిత్రాల్ని
ఆవిష్కరిస్తూంటాయి.

ఒక నన్నయ, ఒక వేమన, ఒక గురజాడ
లిప్తపాటు మెరిసి మాయమవుతారు.

నవరసాలూ వాటి దేహాల్ని లాక్కొచ్చి
కనుల వాకిట నిలిపి
రసావిష్కరణ జరిపిస్తాయి.

శత సహస్త్ర శిరఛ్ఛేద
ఖడ్గ పరిహాసం తళుక్కుమంటుంది.

తరాల్ని కలిపే రుధిరామృతం
కాల రేఖ పై లీలగా జారుతుంది.
*************

ఏదైనా ఓ పుస్తకంలోకి నడవటమంటే
పరిచిత పాత్రలలోకి
మనల్ని మనం ఒంపు కోవటమే కదా!

బొల్లోజు బాబా
బాబా గారికి కృతజ్ఞతలతో

Friday, April 2, 2010

బాల పాఠకులందరికీ...

ఈనాడు అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవం.
బాల పాఠకులందరికీ శుభాకాం క్షలు. . ఎలెక్ట్రానిక్ మీడియా, వీడియో గేంస్ ఎంతో ప్రబావం చూపుతున్న ఈ కాలం లో కూడా పిల్లలకి కధల పుస్తకాలంటే ప్రాణం. మీడియా ప్రభావం వలన మిగిలిన సాహిత్యం కాస్త కుంటుపడిందని అనక తప్పదు. నిజానికి ఇటువంటి పరిస్థితులలో బాల సాహిత్యం, వ్యక్తిత్వ వికాస సాహిత్యం మాత్రమే ప్రపంచం లో నిలదొక్కుకోగలిగిందని చెప్పవచ్చు. ఇదంతా వేరే విషయం.
ఇంతకీ ఈ బాలల పుస్తకదినోత్సవం ఎలా మొదలయింది. దీనికో చిన్న కధ ఉంది.
ఫెయిరీ టేల్స్ అంటే పిల్లలకి చాలా ఇష్టం. అయితే ఈ ఫెయిరీ టేల్స్ సృష్టికర్త " హాన్ స్ క్రిష్టియన్ ఆండర్సన్ " డెన్మార్క్ లో పుట్టిన ఈయన 1805-1875 మధ్య నివశించాడు. ఈయన రాసిన అనేక కధలలో .. ద లిటిల్ మెర్మైడ్, ద స్నో క్వీన్, ద ప్రిన్సెస్ అండ్ ద పీ మరియు థంబులీన్
చాలా ప్రాచుర్యం పొందాయి. అంతేకాదు ఈయన రాసిన జానపద కధలు 150 భాషల్లోకి అనువదింపబడ్డాయి. అంతేనా..ఎన్నో ఏనిమేషన్ చిత్రాలు, పిల్లల నాటికలకు, సినిమాలకు ప్రేరణని ఇచ్చాయి. మరి ఈ రోజెందుకు బాలల పుస్తక దినోత్సవం ఎందుకు జరుపుతున్నారు. ఎందుకంటే ఈరోజు ఆండర్సన్ ( ఏప్రిల్ 2 ) గారి పుట్టిన రోజు కాబట్టి. మరో విశేషం ఏమంటే ఈరోజు ఆయన 205 వ జయంతి. ఈ దినోత్సవ ఉద్దేశ్యం ఏమంటే బాలలలో పఠనాసక్తిని పెంపొందించడమే..
ఈ రోజుని మా స్కూల్ లో చాలా బాగా జరుపుకున్నాం. సం.రం. అంతా మా పిల్లలు చదివిన పుస్తకాల పేర్లు ఒక డైరీ లో రాసుకుంటారు. ఈ రోజున పేరెట్స్ ని పిలిచి వారెదురుగా పిల్లలు వారు చదివిన పుస్తకాలలో వానికి నచ్చిన కధని అందరికీ చెపుతారు. ఈ కార్యక్రమానికి తల్లిదండ్రులే న్యాయనిర్ణేతలు గా వ్యవ హరించి బాగా చెప్పిన పిల్లలని ఎంపిక చేస్తారు. వారికి బహుమతులివ్వడం జరుగుతుంది. ఇంట్రెస్టింగ్ విషయమేమంటే
కార్యక్రమానికి వచ్చిన తల్లిదండ్రులు చాలా మంది పిల్లల కధల పుస్తకాలు తెచ్చి మిగిలిన పిల్లలకి పంచి పెట్టారు. ఈ విద్యాసం వత్సరమ్లో ఈ ఉత్సవాన్ని మరింత వెరైటీగా ఎంత వెరైటీ అంటే భారతదేశమ్లో మరే ఇతర స్కూలు జరపలేనంతగా జరపాలని ప్రణాళిక లు సిధ్ధం చేసేసాం.
ఎలా అనుకుంటున్నారా... అమ్మో ఇపుడు చెప్పను... బై.

Wednesday, March 24, 2010

అసహజ జీవనం ?

" వివాహానికి ముందు శృంగారం, స్త్రీ, పురుషులు వివాహం చేసుకోకుండా సహజీవనం సాగించడం అనేది నేరం కాదు. ఇద్దరు వయోజనులు సహజీవనం చేయాలనుకుంటే అందులో నేరమేమిటి? అది నేరమవుతుందా? సహజీవనం నేరం కాదు " అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె.జి. బాలకృష్ణన్ తో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ రెండింటినీ నిషేధించే చట్టమేదీ లేదని కూడా పేర్కొంది.

నిజమే...ఈ దేశ పౌరుని జీవన విధానాన్ని నియంత్రించే చట్టాలేమీ మన భారతీయ శిక్షాస్మృతి లో లేక పోవడం దురదృష్టకరం. మన సంస్కృతిని కాపాడ వలసిన ధర్మాన్ని, బాధ్యతని యువత విస్మరించడం కూడా నేరపరిధిలోకి రాదు. ప్రపంచం లో అత్యధిక శాతం యవత/యువశక్తి కలిగిన మనదేశ పౌరుడు పెడదోవ పడుతున్నా, ఈ దేశ చట్టాలు, సమాజం ప్రేక్షక పాత్ర వహించాల్సిందే. ఎందుకంటే social conduct of an individual is not legalised. No law can prevent the fall of moral values of an indiviual.

వివాహానికి ముందు శృంగారం మంచిదా, కాదా అనేది మనిషి వ్యక్తిత్వం, కుటుంబ నేపధ్యం మీద ఆధారపడిఉంటుంది. చదువు, సంస్కారం ఉన్నయువతకి కొంత విచక్షణా జ్ఞానం ఉంటుంది. గ్రామీణ సమాజం లో ఇటువంటి ఆచారం అనాదిగా ఉన్నప్పటికీ ఇది సంస్కృతి మీద అంత ప్రభావం చూపక పోవచ్చు.

స్త్రీ, పురుషులు వివాహం చేసుకోకుండా సహజీవనం (Dating) సాగించడం.. మన వివాహ వ్యవస్థ మీద చాలా ప్రభావం ఉంటుంది. పటిష్టమయిన వివాహ సంప్రదాయానికి చరమగీతం పాడినట్లే. దేశవిదేశాల్లో ఎంతో ప్రాచుర్యం పొందిన మన వివాహ విధానం లోని ఆచార వ్యవహారాలను అటకెక్కించినట్లే. అభివృధ్ధి చెందుతున్న దేశాలకు ధీటుగా భారత్ ను నిలబెడుతున్న అనేక అంశాల్లో ఈ దేశ సంస్కృతి ఒకటి. ఎంతో మంది విదేశీయులు మన వివాహ వ్యవస్థని అధ్యయనం చేసి.. భారతదేశం లో కుటుంబ వ్యవస్థకు మూలాలు వివాహ మంత్రాలలోనూ, వివాహ సంప్రదాయం లోను, వారి కట్టుబాట్లలోనూ ఉందని కొనియాడేరు.
ఈ సహజీవనం దేశ నైతిక విలువలపై వ్యతిరేక ప్రభావం చూపుతుంది అనడం లో సందేహం లేదు. ఆడ మగ డేటింగ్లో ప్రస్తుత సమాజ పరిస్థితుల్లో ఎన్ని అనర్ధాలు వస్తాయో అనూహ్యం. అంతేకాదు రాధాకృష్ణుల మధురానుబంధాన్ని..మానవమాత్రుల విచ్చలవిడితనంతో సరి పోల్చడం వారి విజ్ఞత కి వదిలేయాలి.

కొసమెరుపు : సీతారామ కల్యాణమందు ప్రస్తావించిన మంత్రోపదేశాలే నేటికీ మన హిందూ వివాహ విధానమ్లో అనుసరిస్తున్నాం.
సీతారాముల దాంపత్యమంత అన్యోన్యంగా ఉండాలని ఆ మంత్రముల అర్ధం.
లోక కల్యాణరాముని కల్యాణం జరుగు శ్రీరామ నవమి రోజున ఇటువంటి వార్త వినడం.

Tuesday, March 16, 2010

తెలుగు వెలుగుల ఉగాది...



తెలుగు వెలుగుల ఉగాది
తేవాలి అందరి జీవితాలలో
సుఖ సంతోషాల కేళి
ఉగాది శుభాకాం క్షలతో
మీ
శ్రీనిక

Sunday, March 14, 2010

విలక్షణమైన స్త్రీని నేను...

మాయా ఏంజిలౌ

అమెరికా జాత్యహంకారపు పడగ నీడలోఅణగద్రొక్కబడిన నల్ల జాతి బానిస జీవుల జీవితాలలో తమ రచనలతో వెలుగులు నింపిన అతికొద్దిమంది నల్లజాతీయులలోమాయా ఏంజిలౌ ఒకరు.విలక్షణమైన వ్యక్తిత్వం, నిర్మొహమాటమైన వైఖరి ఈమె రచనల్లో కనిపిస్తుంది. బహుముఖ ప్రజ్ఞాశాలి వివిధ రచనా ప్రక్రియలలో అసాధారాణ ప్రతిభ ఆవిడ సొంతం. Still I rise, On the pulse of morning, Life doesn't frighten me etc., అనే కవితలుI know why the caged bird sings, The heart of a woman, Phenomenal woman అనే కవితలు, ఆత్మకధలు ఆమెకి బాగా
పేరు తెచ్చిన రచనలు.

Phenomenal woman
(స్వేచ్ఛానువాదం)











అందమైన యువతులు
నా సౌందర్య రహస్యమేమిటాని
ఆశ్చర్య పోతూంటారు..
నేను అందంగానో లేక
ఫ్యాషన్ మోడల్ అంత
నాజూకుగానో లేను
అలాగని నేను చెపితే
అబధ్ధాలనుకుంటారు
నా సౌందర్యం
నా చేతుల కలయికలో
నా తొడల నిడివిలో
నా హుందా నడకలో
నా పెదవుల నుడికారంలో ఉంది
విలక్షణంగా
నేనొక స్త్రీని
విలక్షణమైన
స్త్రీని నేను

మీరు కోరినట్లు
నేనో గదిలోకి వెళ్తాను,
ఒక పురుషుని వద్దకు,
వారు నిలబడి లేదా మోకరిల్లి
తేనెటీగల్లా
నా చుట్టూ తిరుగుతూంటారు..
నా కళ్ళలో జ్వాల
నా పలువరుసలో మెరుపు
నా నడుములో ఊపు
నా అడుగులో ఆనందం
విలక్షణంగా
కలిగిన
నేనొక స్త్రీని
విలక్షణమైన
స్త్రీని నేను

నాలోని నన్ను చూసిన
పురుషులు అచ్చెరువొందుతారు,
నా అంతరంగ రహస్యాలను
స్పృశించాలని
విఫల యత్నాలు చేస్తారు..
నే చూపించ బోయినా
చూడలేక పోయామంటారు..
నా సౌందర్య
నా వీపు వంపులోను
నా చిరునవ్వు కాంతిలోను
నా స్తనముల ఊపులోనూ
నా శృంగార రీతిలోనూ
విలక్షణంగా కలిగిన
నేనొక స్త్రీని
విలక్షణమైన
స్త్రీని నేను...

మీకిపుడు తెలిసే ఉంటుంది
నా తల ఎందుకు దించలేదో
నేను ఎక్కువ నినదించను
నా ఆగమనం
నిను గర్వ పరచడానికే
నా సౌందర్యం
నా అడుగుల సవ్వడిలోను
నా శిరోజాల వంపులలోను
నా అరచేతిలోను
నా ఆత్మ రక్షణలోను
విలక్షణంగా కలిగిన
నేనొక స్త్రీని
విలక్షణమైన
స్త్రీని నేను...

Monday, March 8, 2010

మ...ది...శు..



మహిళా బ్లాగర్లందరికీ అంతర్జాతీయ మహిళాదినోత్సవ శుభాకాంక్షలు.


స్త్రీ బాహ్య నిర్బంధాలనుండి విముక్తి కావడం ఒక క్రమమయితే అంతర బంధాలనుండి విముక్తి కావడం మరో క్రమం.
అయితే ఈ విముక్తి ని ఒక వస్తువుగా సాగిన సాహిత్యం స్త్రీవాద సాహిత్యం గా రూపాంతరం చెంది
అన్ని సాహితీ ప్రక్రియలలోనుప్రవేశించి సమాజాన్ని ప్రశ్నించింది, ఆలోచింప చేసింది, బాధ్యతను గుర్తుచేసింది. దశాబ్దాలుగా సాగిన పోరాటమ్లో ప్రతి మైలురాయి అనేక త్యాగాలకు నిదర్శనగా చెప్పవచ్చు. ఆదర్శనీయమైన విషయమేమిటంటే ఈ విముక్తి పోరాటం లో కేవలం మహిళలే కాదు, వారికి చేదోడు వాదోడుగా పురుషులు కూడా పాలు పంచుకుని సమాజాన్ని చైతన్యవంతం చేయడం లో వారుకూడా కృతకృత్యులయ్యారనడం అతిసయోక్తి కాదు. గడచిన రెండు దశాబ్దాలుగా వచ్చిన స్త్రీవాద సాహిత్యం లో స్త్రీ సమస్యలని అర్ధం చేసుకోవడం లో కవులు గొప్ప పరిణితి చెం దారు.
కానీ ఎనభై దశకాల్లోనూ...తొంభై దశకాల్లోనూ ఉన్నంత ఉధృతి ఈ దశాబ్దం లో లేదనే చెప్పవచ్చు. గ్లోబలీకరణ, సాంకేతిక విజ్ఞాన అభివృధ్ధి, మహిళల అక్షరాస్యత శాతం పెరుగుదల, విద్యాలయాలలో, ఉద్యోగాలలో మహిళలకు రిజర్వేషన్లు,ఆర్ధిక స్వాలంబన..సమస్య సాంద్రతని కొంతవరకూ తగ్గించాయని కూడా చెప్పవచ్చు...అంతేకాదు మహిళా బిల్లును ప్రవేశపెట్టటానికి జరుగుతున్న పరిణామాలు హర్షణీయం.
అంతర్జాతీయ మహిళాదినోత్సవ సందర్భంగా...
ఎనభైలలోనూ, తొంభైల లోనూ అక్షరబధ్ధం చేసిన రెండు కవితలని ఇక్క డ ....
అమ్మ
అల్లం నారాయణ.

పొద్దుతో పాటూ
పంట పొలంలో పొడిచేది అమ్మ
చెమట ముత్యాల్లోకి జారి
కత్తిలాంటి మా కండరాల్లోకి ఇంకేది
అమ్మ నుదుటి సింధూరం పువ్వు
' అమ్మా ఆకలే ' అనడం తప్ప
అమ్మ కడుపులో కాసిన
ఎర్రటెండను పట్టించుకున్నదెవ్వడు?
మొగ్గలకు రెక్కలతికిన అమ్మ
నల్లనల్లని రేగళ్ళ నాగేటి చాలయింది
కంట్లో కారు చీకట్లు దాచుకొని
వెన్నెల నవ్వుల్ని విరిసింది
పక్షుల్ని పిలిచి మాకు పాటలు నేర్పింది
పొగ చూరిన పాత వంటగది కావల
నాకోసం మా అమ్మ
ప్రపంచం కిటికీ తెరిచింది
ప్రపంచం కిటికీ గుండా
నే ఆవలి గట్టుకి దూకేసా
మా అమ్మ మాత్రం
వంటింటి గడప మీద శిలయింది
పసుపు కుంకుమలు, తాళిబొట్టు, కాలిపట్టెడ
పాతివ్రత్య ధర్మం మీద పూర్వీకుడు రాసిన పుస్తకం
సాక్షీ భూతాలుగా
మాఅమ్మ వంటింటి గడప మీద
శిలువబడింది.....

ఆంధ్రజ్యోతి దినపత్రిక 29.03.1988 అల్లం నారాయణ గారు ఆంధ్రజ్యోతి సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేసారు. " జగిత్యాల పల్లె " కవితా సంపుటి ప్రచురించారు..
---------------------------------------------------------------------

పంజరం
శిలాలోలిత

పంజరాన్నీ నేనే
పక్షినీ నేనే
నాకు నేనే ఉచ్చును బిగించుకొంటాను
చిలుక పలుకులే తెలుసు
గొంతెత్తి పాడలేని మూగజీవాన్ని--
కవిత్వం రాయలేని సమాజపు పక్షపాతాన్ని నిరసించాలనీ
నాలోని కోటానుకోట్ల కణాల యుధ్ధారావాల్ని
నాలోని విద్యుత్ ప్రవాహ సంగీతాన్ని
నాలోని ఆలోచనాలోచనాల సముద్రాల్ని వెలికి తీసి
నాలోని నన్ను ఆవిష్కరిద్దామనే నా భావన

కలలున్నాయి కానీ అన్నీ డొల్లలే
కధలున్నాయి కాని ఎవరో పూర్తిచేసిన ముగింపులే
కనులున్నాయి కానీ ఎవరో కత్తిరించిన రెటీనాలే
సమాజం లో బతకని నువ్వు
నీ పుట్టుకా సమాధి పంజరమే అయిన నువ్వు--
పంజరం ఊచలెన్నో లెక్కెట్టుకో
కవిత్వం కవులే రాయగలరు
నీకు అక్షరాలేం తెలుసునన్న పురుషాహంకారం
ఔను నాకు అక్షరాలు తెలియవు
నాకు పొడి మాటలు తెలియవు
అసలు అక్షరాలేవి ? అయ్యో వాటికి ప్రాణమేది ?
ఎర్రటి రక్తం లో స్నానాలు చేస్తున్నాయవి
వెలికి తీద్దామన్న యత్నం లో నా వేళ్ళు తెగిరక్తమ్లో కలిశాయి

చేతులే లేని నేను
హత్య చేయబడ్డ అక్షరాలతో నేను
అసలు భాషే
లేని నేను ఎలా మాట్లాడేది ? ఎలా రాసేది ?

నా చేతికి ' మాడిఫై' చేయబడిన రూపం లో గాజుల సంకెళ్ళు
నా బతుకే ధన్యమనే బ్రెయిన్ వాష్ లు
నా నాలుక తెగ్గొట్టినా, చేతుల్ని నరికేసినా
అక్షరాల్ని విరిచేసినా, భాషను లేకుండా దగ్ధం చేసినా
నేను మరణించలేదు.

నేను మరణించను
ఔను -- ఈ నెత్తుటిలో కొత్తపుట్టుక నాది
ఈ పుట్టుక నా స్వంతం
జనన మరణాల పట్టికని నేనే తయారు చేసుకోగలను
ఎవరికీ నన్ను కాల్చడానికీ ముంచడానికీ చంపడానికీ
వదిలేయడానికీ, ఉంచుకోవడానికీ, ఎంచు కోవడానికీ
సర్వహక్కులు ధారాదత్తం చేయబడలేదు
నేను వైప్లవ్య గీతిని
మూగతనం తెలిసిన నాకు భాషెంత బాగుంటుందో తెలుసు
కష్టాలలో మునిగి తేలిన నాకు కడసారి వీడ్కోలు కొత్తకాదు
కన్నీళ్ళ నదులకి ఆనకట్టలు కట్టి
కొత్త వంతెనలు కట్టుకోగలను..

నేనొక ప్రాణినేనన్న గుర్తింపు కోసం
నేనొక సమిధనౌతాను
నన్ను నేను నిలబెట్టుకొనే క్రమం లో
నా పాదాల క్రింద ఇసుకలా జారిపోతున్న కుబుసాన్ని
తృణీకరిస్తున్నాను

భాషను దూరం చేసిన ప్రణాళికాధికారులకు
నేనొక కొత్త నిఘంటువును
బతుకును చౌరస్తాను చేసిన వ్యవహారికపు ముసుగులకు
నేనొక కంచుకత్తిని
నేను తెగినా నేలరాలినా, నెత్తురు చిమ్మినా
నేనొక మాట్లాడగల శక్తినని నిరూపిస్తాను
పోరు బాట నాకు కొత్తకాదు
చాళ్ళనిండా విత్తనాలు మొలకెత్తుతూనే ఉన్నాయి...
( " పంజరాన్నీ నేనే పక్షిని నేనే " -- (1999) కవితా సంపుటి నుండి )

శిలాలోలిత : అసలు పేరు పి. లక్ష్మి ప్రచురిత రచనలు: కవయిత్రుల కవిత్వం లో స్త్రీ మనోభావాలు (1993) ఎంతెంత దూరం (2005) నారి సారించి - సాహిత్య వ్యాసాలు (2006) చిరునామా: ' సూఫీఘర్ ' 1-7-9/1/3, చైతన్యపురి,హైదరాబాదు-80 ఫోన్ : 040 - 24040890, 9849156588.
అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా
ఒక
విలక్షణ మైన వ్యాసం ఇక్కడ లింకులో...
http://timesofindia.indiatimes.com/city/lucknow/No-need-for-Reserved-Class-to-travel-ahead/articleshow/5655723.cms

Thursday, March 4, 2010

నాకు తెల్సు...










నడుస్తున్న రోడ్డు
రెండుగాచీలిపోయిందంటే
రెండునాల్కల నగర
కుహరం లోకి ప్రవహిస్తున్నట్లే
రోడ్డుకిరువైపులా ఉండే
మహా వృక్షాలన్నీ మరుగుజ్జుల్లా
రోడ్డుమధ్యలో నిలబడ్డాయంటే
నగరీకరణ వరదలో
అస్థిత్వ వేదనకి అర్ఘ్యమిచ్చినట్లే
వేడి వేడి తారు చల్లచల్లగా
పచ్చని పొలాల్లోకి పారిందంటే
మనుగడపై సునామీలు మోహరించినట్లే
ఉపాధి అవకాశాల్ని
లారీల్నిండా మోసుకొచ్చి రాత్రికిరాత్రే
పల్లె పల్లెనీ తరలించుకుపోయిన
వైనం తెల్సునాకు...
నడకని, నడతనీ.......ఉనికినీ, ఉన్నతినీ
జోరుని, హోరునీ.....స్వచ్ఛతని, పవిత్రతనీ
సాగర సంగమంలో పోగొట్టుకున్న నది
భవన కూలీల చెమటలో
కరుగుతున్న పనిమనిషి కండల్లో
కూరల బండివాని అరిగిపోయిన చెప్పుల్లో
ఇంకా అక్కడక్కడా...
నా నది ఇంకి పోయిన
వైనం తెల్సునాకు...