Friday, September 25, 2009

ఈ శెలవులు మాకొద్దు.....

ఈ శెలవులు మాకొద్దు..

తొందర పడి ఒక కోయిల ముందే కూసిందీ... అని హమ్ చేసుకుంటూ వంట చేస్తూన్నాను. త్వరగా వంట చేసేయాలి.లేకపోతే చంటి గాడి ఆటో వచ్చిందంటే ఒఖ్ఖ నిముషం ఆగడు. తనకేమీ పట్టనట్లు చంటి టి.వి చూసుకుంటూ కూర్చున్నాడు. కనీసం వాటర్ బాటిల్సయినా పట్టచ్చుకదా.
ఆడపిల్లయినా గానీ అనూ కూడా అంతే..ఎంత సేపూ బాగ్ సర్దుకుంటూ గడిపేస్తాది. ఒక్క పనికి చేతి కంది రాదు.
అయినా ఈ రోజు మనసంతా హుషారుగా ఉంది. ఎందుకంటే దసరా శెలవులొచ్చేసాయి. ఈ సారి తొందరగానే వచ్చేసాయి. ఎపుడూ దసరాకి నార్త్ ఇండియానో, సౌత్ ఇండియానో టూర్కి చెక్కేస్తాం. సంక్రాంతికి అమ్మవాళ్ళింటికి చేరిపోతాం. కానీ ఈ సారి మావారు ఆఫీసు పని మీద హైదరాబాదు వెళ్ళిపోతారు. ఫాస్ట్ గా పేపర్లన్నీ కరెక్ట్ చేసేసి ఇచ్చేస్తే శెలవుల్లో ఇంటి పని పట్టచ్చని ప్రణాలికలు వేసేసాను.
గబ గబా కేరేజీలు సర్దేసి పిల్లల్ని పంపి మా ఇద్దరి కేరేజీలు సర్ది ఇంటికి తాళాలు వేసేటప్పటికి మావారు బండి మీద రెడీగా హారన్ మోగిస్తూ..
హబ్బ..ఏం జీవితమండిబాబూ.
ఉరుకులు..పరుగులు.. కానీ నెలాఖర్ని జీతం తీసుకునే టపుడు మాత్రం నెలంతా పడిన బాధలన్నీ మర్చిపోతాం...
సాయంత్రం ఇంటికొచ్చి కొంచెం ఫ్రెష్ అయి బాల్కనీలో కూర్చుని చిక్కటి బ్రూ కాఫీ తాగుతూంటే సెల్ రింగయింది.
సంధ్య . . మా ఆడపడుచు. నిడదవోలు నుంచి.
హలో సంధ్యా. బాగున్నావా?
ఆ ! బాగున్నానొదినా. మీరెలా ఉన్నారు.
మేము బాగానే ఉన్నాం. బాలు , యమున , మీవారు ఎలా ఉన్నారు.
బాగానే ఉన్నారొదినా.
ఏదో విశేషం ఉంటే తప్ప మా ఆడపడుచు ఫోను చెయ్యదు. మా చందు పర్మిషను ఇవ్వాలి. అలాగని అతను పిసినారి కాడు. అతనన్నీ లెక్క ప్రకారం ఖర్చు పెడతాడు. అంతే.
ఏవిటి విశేషం సంధ్యా.
ఆ ఏం లేదొదినా.. మా మామ గారు ఆస్తి పంపకాలు, రిజిస్ట్రేషనూ ఉన్నాయనీ ఈ శెలవుల్లో అవి చేయించుకోడానికి రమ్మనీ ఫోను చేసారు. మేమిద్దరం ఆ పనులు మీద తిరుగూతూంటే బాలు, యమునలకి ఇబ్బంది అవుతుందేమోననిపిస్తుంది. అన్నయ్యకి ఫోను చేస్తే ఈ దసరాకి మీరెక్కడికీ వెళ్ళటం లేదన్నాడు. అందుకనీ...
అదేంటి సంధ్యా .. అడగడానికి అంత మొహమాట పడిపోతున్నావు. పిల్లలిద్దరినీ ఇక్కడికి పంపించేయ్. నేనొచ్చి తీసుకురానా ? మీ ఆయనకి శెలవుందో లేదో.
అయ్యయ్యో..నీకెందుకు శ్రమ వదినా..మీ తమ్ముడు గారు పిల్లలని దించి వచ్చేస్తారు.
ఏం ఫర్వాలేదు సంధ్యా. నీకెలా వీలయితే అలాగే. చందూతో పంపించు.
ఆ అలాగే వదినా.
ఆ..ఆ.. సంధ్యా...చందూ వచ్చేటపుడు, రేగు పండు వడియాలు పంపించు. మీ నిడదవోలులో అవి చాలా ఫేమస్ కదా. మీ అన్నయ్యకి,చంటిగాడికి చాలా ఇష్టం.
అలాగే వదినా..ఉంటాను వదినా.
ఆ..ఒకే. బై. ఫోను కట్ చేసాను.

********
ఆదివారం సాయంత్రానికల్లా చందు పిల్లల్నేసుకుని వచ్చి సోమ వారం ఉదయాన్నే వెళిపోయాడు.
ప్రయాణం లో అలసి పోయారేమో పిల్లలు టి.వి. చూస్తూనే నిద్ర పోయారు.
మా చంటి సిక్స్త్, వాళ్ళ బాలు ఫోర్త్ క్లాసులు చదువుతున్నారు.
మా అనూ ఫోర్త్ , యమున సెకండ్ క్లాసులు చదువుతున్నారు.
ఉదయాన్నే లేవగానే టిఫిన్లు చేసి పిల్లలందరికీ పెట్టి టి.వి. ఆన్ చేసాను.
నలుగురుకి ఒకరికొకరు అటాచ్ మెంట్ మొదలయింది.
వీళ్ళలో యమున చాలా మొండిది. తను అనుకున్నది సాధించి తీరుతుంది.
ఒకసారేమయిందంటే అనూ తనకి బొమ్మ ఇవ్వ లేదని ..ఆ రాత్రి అందరూ నిద్రపోయాకా లేచి ఆ బొమ్మని విరగొట్టేసి కామ్ గా పడుకుండిపోయింది.
దీంతోనే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏం కొంప ముంచుతుందో ఏమో.
బాలు అదో టైపు. అందరూ వాడి మాటే వినాలని, వాడే గ్రూపు లీడర్ గా అందర్నీ కమాండ్ చేస్తూంటాడు. వాడి మాట ఎవడన్నా వినక పోతే మాత్రం వాడి పని ఆంతే.
ఏమైనా ఇద్దరూ కొంచెం ప్రమాదమే..

కాసేపు కామ్గా అందరూ టి.వి. చూసారు. ఆ తర్వాత మా అపార్ట్ మెంట్ లో పిల్లల్తో ఆటలకి వెళిపోయారు.
నేను నా వంట పనిలో పడిపోయాను.
ఆయన్నించి ఇంకా ఫోన్ రాలేదు. ఎలా ఉన్నారో ఏమో.
వంట అయిపోయాకా అందర్నీ పిలిచి భోజనాల దగ్గర కూర్చోబెట్టేసరికి విసుగొ చ్చేసింది.

భోజనాలవ్వంగానే మళ్ళీ ఆటలకి వెళ్ళిపోయారు.
పిల్లలకి ఆటలుంటే చాలు. అన్న పానీయాలు అవసరం లేదు.
నేను భోంచేసి కాస్త నడుం వాల్చేను.
ఈ రోజు గడిచింది.
ఇంకా వీళ్ళతో వారం రోజుల పాటు అడ్జస్ట్ అవ్వాలి.
****
నాల్గు రోజులు గడిచి పోయాయి.
రోజూ ఆటలకి వెళ్ళి వస్తున్నారేమో, అలసి పోయి పడుకుంటున్నారు.
ఈ రోజు శుక్రవారం నాకు సంతోషి మాత పూజ. పులుపు పదార్ధాలేమి తినను.
పిల్లలందరికి విడిగా వండి నేనింత తినేసరికి
మూడో ఫ్లోరు లో సావిత్రి గారు లలితాసహశ్రనామ పారాయణం చేద్దామని పిలిస్తే వారింటికి వెళ్ళాను.
అపార్ట్మెంటులోని ఇంచు మించు అన్ని ఫ్లాట్ ల ఆడవాళ్ళు అక్కడ ఉన్నారు. అందరూ ముక్త ఖంఠంతో ఆ దేవిని స్తుతిస్తున్నారు.
ఇంతలో రాజ్యలక్ష్మి గారబ్బాయి బబ్లూ ఆయాస పడిపోతూ వచ్చాడు.
సరోజా ఆంటీ..సరోజా ఆంటీ..అంటూ నాదగ్గరకి వచ్చి షీలా ఆంటి వాళ్ళ బాబు లేడా వాడే నితిన్ ఆంటీ, వాడు పడిపోతే ముక్కు చిదిగిపోయి రక్తం కారిపోతూంటే అంకుల్ వెంటనే హాస్పిటల్ కి తీసుకెల్తే అయిదు కుట్లు పడ్డాయట ఆంటీ
అయ్యయ్యో ఎలా పడిపోయాడు.
మీ ఇంటికి వచ్చిందే చుంచు మొఖంది..అదే ఆంటీ దాని పేరేంటి ఆ..ఆ..యమున..యమున. దాన్ని ఆటలొ చేర్చుకోలేదని కోపంతో వెనకాలే వచ్చి నితిన్ని తోసేసింది. పాపం షీలా ఆంటే ఏడ్చేస్తూన్నారు ఆంటీ.
మరుక్షణం లో షీలాగారింటికి వెళ్ళి జరిగిన దానికి క్షమాపణలు చెప్పి ...ఎంత వద్దన్నాఅయిదు వందలు ఉంచమని చెప్పి , వారెదురుగానే యమునని నాల్గు వాయించి అందర్నీ ఇంటికి తీసుకొచ్చి పడేసాను.
ఇక రేపట్నుండి బయటికి పంపేదిలేదు అని తీర్మానించుకున్నాను.
*****
టిఫిన్లు తినేవరకూ కామ్ గానే ఉన్నారు. ఇక ఆ తర్వాత ఇల్లంతా ఒకటే గోల.
అరుపులు..కేకలు, తిట్లు,ఏడుపులూనూ.
ఒకరు కార్టూన్ నెట్ వర్కు కావాలని, మరొకరు జెటిక్స్, ఇంకొకరు పోగో కావాలని..
నేనొచ్చి మొత్తం టీ.వీని కట్టేసాను.
ఇక బొమ్మల మీద పడ్డారు...ఒకే బొమ్మ నాకు కావాలని ఒకరు.. నాకుకావాలని మరొకరు.
మంచాల మీద పక్కలన్నీ చెరిపేసారు.
కప్ బోర్డు ల్లో బొమ్మలన్నీ పాడుచేసేసారు.
ఒక్క మాటలో చెప్పాలంటే ఇల్లంతా రావణ కాష్ఠం చేసారు.
వీ ళ్ళతో మరొక రోజు గడపాలంటే మాటలా !
ఉదయాన్నే చందు వచ్చి పిల్లలని తీసుకెళిపోతే ఎంత బావుణ్ణు?
మా పిల్లలే నయం. నయాన్నో, భయాన్నో కొంచమయినా మాట వింటారు.
వాళ్ళొచ్చి చేరి వీళ్ళూ పాడయి పోయారు.
స్కూల్లో అంత మందిని కంట్రోల్లో పెట్టగలుగుతున్న దాన్ని
వీళ్ళనెలా కంట్రోల్లో పెట్టాలో అర్ధం కావట్లేదు.
పిల్లలకి స్కూల్ ఉంటేనే కంట్రోల్లో ఉంటారు.
ఇంతలో సెల్ ఫోన్ మోగింది ..స్కూల్ నుంచి
రిసెప్ష నిస్ట్ నీరజ.
హలో మేడం. నేను నీరజని మాట్లాడుతున్నాను.
ఆ. చెప్పండి నీరజా..
మీకో గుడ్ న్యూస్ !
ప్రభుత్వ ఆదేశాలననుసరించి శెలవులు మరో నాలుగు రోజులు పొడిగించారని కరస్పాండెంటు గారు అందరికీ ఇన్ ఫాం చేయమన్నారు మేడం.
హా !

Wednesday, September 23, 2009

మరింక శెలవ్.

Despair shall forsake me

మరింక శెలవ్.
ప్రపంచ మంతా ఆవగింజలా
ఇమడ్చుకుని
చూపుల కాన్వాసుని
విశ్వమంతా పరచిన
కళ్ళు మూతలు పడిపోతూన్నాయి.

ఎక్కడో స్వరపేటిక మూలాల్లో
ఇరుక్కుపోయిన వాయువు
సంధించిన ఆఖరి ప్రకంపనలు
దేహం నుండి ప్రాణానికో
ప్ర్రాణం నుండి ఆత్మకో
మరింక శెలవు.

ఏదో అంటున్నట్లే వుంది.
ఎవరికీ వినబడుతున్నట్లు లేదు
అందరూ చూస్తూనే ఉన్నారు
దృశ్యాలన్నీ మేఘాల్లా
కరిగి పోతూన్నాయి
శక్తినంతా కూడదీస్తేనే కానీ
ఏ బంధమూ తెగేటట్లు లేదు.

ఊపిరి నెవరో బలవంతంగా
వేళ్ళతో ఊడపెరుకుతున్నట్లే ఉంది
అంగాంగాలన్నీ ఎవరికో
అర్పించుకుంటున్నట్లుగా
ఒకటి ఒకటిగా దూరమైపోతూన్నాయి.

చెవులు రెండూ చిల్లు పడవల్లా
శబ్ద సముద్రాల్లో మునిగిపోతూంటే...
పాదరస మట్టం
పాతాళాన్ని ముద్దాడుతూంటే...

మనసు కేటలిష్టయి
మస్థిష్కంలో మొదలయిన రశాయనిక చర్య
గొంతు గుండెలోంచి శబ్ద తరంగాలై.....
'ఇప్పుడిప్పట్లో పోయేటట్లు లేడు'
వేచి చూడాలి..ఏం చేస్తాం.
పెద్దకొడుకు సర్దుబాటు ?
ఫెటీల్మని కర్ణభేరి పగిలిన శబ్దం

'రాతకోతలన్నీ అయినట్లేనా ?'
రెండో కోడలి అనుమానం ?
ఛెళ్ళుమన్న కొరడాదెబ్బలా !

అవన్నీ ముందే జాగ్రత్త పడమన్నానుగా
కూతురి ముందు చూపు ?
కరెంటు షాక్ తగిలినట్లుగా !

అఖండ తేజస్సు
నన్ను ఆవహించేవేళ
నేను ప్రశ్నిస్తూన్నాను...

ఓ భగవాన్ !
ప్రేమిస్తే ప్రేమించబడతానన్నావు...
పిచ్చివాడా ?
న్యూటన్ నియమాలకెప్పుడో
నీళ్ళు చెల్లిపోయాయి...
ఈ కవిత తెలుగురత్న అక్టోబరు సంచిక లో ప్రచురితమైనది. దాని లింకును ఇక్కడ ఇస్తున్నాను.
http://teluguratna.com/content/view/277/26/

Sunday, September 20, 2009

మళ్ళీ వికసించనీ...


ఇదిగో ఇక్కడే
నా బాల్యం లో
సీతాకోక చిలుకలు
రెక్కల్ని రెపరెప లాడిస్తూ
ఋతువుల్ని రాల్చి వెళ్ళిపోయాయి.
కాని అవి వాలిన పూలు
నాలో ఇంకా వాడిపోలేదు....
వర్తమాన పొరల్లో
గతం ఎంత చుట్టుకుపోతున్నా
నాలో స్మృతులు మాత్రం
మంచు బిందువంత
స్వచ్చంగా ఉన్నాయి....
ఇదిగో ఇక్కడే
నా బాల్యంలో
నే నడిచిన దారుల్లో
చెరిగిపోయిన
నా పాదముద్రికలు
నాకింకా కనిపిస్తూనే ఉన్నాయి.....
అదృశ్య దృశ్యాలన్నీ
హృదయాకాశంలో
నక్షత్రాల్లా మెరుస్తూనే ఉన్నాయి.
మనసంతా
వెన్నెల వెలుగుతూనే ఉంది.....
నా బాల్యం
నా వైపొకసారి చూసి
ఎటో వెళ్ళి పోయింది
గంట మ్రోగంగానే
పరుగులు తీసిన బడి పిల్లాడిలా
నేను మాత్రం
ఖాళీ అయిన తరగతి గదిలా .....
ఓ ప్రభూ !
అన్నిటికీ పునర్జన్మ నిచ్చావు
కాలానికి తప్ప
అందమయిన ఆ పుష్పాన్ని
మళ్ళీ వికసించనీ...
మధురమయిన ఆ రోజుల్ని
మళ్ళీ ఉదయించనీ....

Sunday, September 13, 2009

వర్షించే ప్రతి బొట్టులో


వర్షించే ప్రతి బొట్టులో......

మన తొలి పరిష్వంగన
అనుభూతిని మొగ్గలోనే
చిదిమి వెళిపోయిన
నీకేం తెల్సు
నేనెంత గ్రీష్మాన్ని
దిగమింగానో...
ఈ ఏకాంతంలో
వర్షించే ప్రతి
కన్నీటిబొట్టులో
నీ రూపాన్ని
చూసుకుంటూ
ఎన్ని నిద్రలేని రాత్రులు
నిరీక్షించానో...
తలపులలోనిండిన
నీ రూపం
కలలో దూరమయ్యేనని
కలత నిద్రకు కూడా
దూరమయ్యేను...
ఈ కన్నీటి ధారలు
ఎప్పటికి ఇంకిపోవు
ఎందుకంటే
ఒక బిందువు నీకోసం
ఒక బిందువు నాకోసం
మరో బిందువు మనకోసం
అలా...అలా...అలల్లా......
అనంత వాహినిలా............

Saturday, September 12, 2009

రోజూ కనిపించే.....


మీరు...
సమాధిలోకి వెల్తున్నపుడు
మీచుట్టూ ఎవరూ ఉండరు
ఎవరూ ఏడ్చినట్లనిపించదు
ఏ ప్రార్ధనలు మీకు వినబడవు
ఎన్నో ప్రశ్నలు మాత్రం
మీ చుట్టూ నాట్యం చేస్తూంటాయి
మీ పార్ధివ శరీరం బూడిదయి పోతూంటే
మీకేమీ బాధనిపించదు...
రెండోరోజుకల్లా మీ ఫోటో
చిరునవ్వుతో మిమ్మల్ని పలకరిస్తుంది...
మీకందరూ కనిపిస్తారు
మీరెవరికీ కనపడరు...
పరామర్శల ముసుగేసుకుని
వచ్చేవారందరూ
ఫోటో ఫ్రేములో బిగించిన
మిమ్మల్నిచూస్తూంటారు
అశ్రునయనాలతో
మీ పిల్లలు మిమ్మల్ని చూస్తూ
వెళిపోతూంటారు...
ఎవరి బిజీ వారిది
మీరేమీ బాధపడినట్లుండరు...
పెరట్లో మీరు నాటిన మొక్కలు
అందమయిన పూలు పూస్తూంటాయి
పిల్లలు వాటినేచూస్తూ
ఆనందపడుతూంటారు
మీకేమీ బాధనిపించదు...
ముసలి చెట్ల స్థానంలో
కొత్త మొక్కలు మొలుస్తూంటాయి
ఈరోజెందుకో
మీరు బాధగా కనిపిస్తున్నారు
పాతసామాన్ల వాడి సంచిలో
ఇరుక్కుపోయిన మీ ఫొటో
మిమ్మల్ని చూసి జాలిపడుతూంటుంది
మీ స్థానంలో
మీ కొడుకు ఫొటో
వేలాడుతూంటుంది.....